YCP Leaders and Volunteers Violating Election Code: ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ క్షేత్రస్థాయిలో కోడ్ ఉల్లంఘనలు జరుగుతునే ఉన్నాయి. పలు చోట్ల వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీ తరఫు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఓటేయ్యాలని ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. అయినా అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Guntur District: గుంటూరు జిల్లా చేబ్రోలు పెద్దకాకాని మండలాల్లో పొన్నూరు వైసీపీ అభ్యర్థి మురళీకృష్ణ ఈనెల 16న ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో సుమారు 300 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. దీనిపై విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో చేబ్రోలు మండలంలో రెండు గ్రామాల నుంచి, పెదకాకాని మండలంలో కేవలం ఎనిమిది మంది మాత్రమే వాలంటీర్ హాజరయ్యారని పంచాయతీ సిబ్బంది అధికారులను తప్పుదోవ పట్టిస్తూ నివేదిక అందజేశారు. రెండు గ్రామాల్లోని వాలంటీర్లను మాత్రమే తొలగించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అధికార పార్టీ కనుసన్నుల్లోనే పని చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Anakapalli District: అనకాపల్లి జిల్లా చోడవరంలో ఇంటింటికి వెళ్లి చీరలు పంపిణీ చేసేందుకు సిద్ధమైన వైసీపీ నాయకులను ఎన్నికల సిబ్బంది పట్టుకున్నారు. చోడవరం జడ్పీటీసీ సభ్యురాలి భర్త మారిశెట్టి శ్రీకాంత్, యువ న్యాయవాది శ్రీను కారులో చీరలు తెచ్చి పంచేందుకు ఓ అపార్ట్మెంట్ వద్ద దిగారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు కారులో ఉన్న చీరలను స్వాధీనం చేసుకున్నారు.
Prakasam District: ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబుతో పాటు ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెట్ కుందూరు అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉద్యోగులు ప్రచారాల్లో పాల్గొనవద్దని నిబంధనలు ఉన్నా వాటిని ఏ మాత్రం లెక్క చేయలేదు. వైసీపీ శ్రేణుల వెంట ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు.
బరితెగించిన వాలంటీర్లు- కోడ్ ఉల్లంఘించి వైఎస్సార్సీపీ ప్రచారంలో డ్యాన్స్‌లు
Eluru District: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వెంకన్న దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యడు వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ట్రస్ట్ బోర్డు సభ్యుడు యానాదయ్య దేవస్థానం కేశఖండన శాలలో కర్షకులను కలిసి వైసీపీకి ఓటేయ్యాలని కోరారు. సిద్ధం పేరుతో ఉన్న కరపత్రాలను పంపిణీ చేశారు. ఆలయంలో పార్టీ తరఫున ప్రచారం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆలయ ఈవో త్రినాధరావు స్పందించకపోవడంతో ఆయన వైసీపీకి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Sri Sathya Sai District: శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండలం కే.బ్రాహ్మణపల్లి పంచాయితీలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారు. కే.బ్రాహ్మణపల్లి వాలంటీర్ దాదా పీర్ వైసీపీ అభ్యర్థితో కలిసి ఇంటింటా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాలంటీర్లు అధికార పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఎంపీడీవోలు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దాదా పేరును వాలంటీర్‌గా తొలగించాలని తెలుగుదేశం నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు.