మీ జీవితానికి టార్గెట్ లేదా! - మనసుకు ఏమవుతుందో తెలుసా?

author img

By ETV Bharat Telangana Desk

Published : Feb 4, 2024, 2:53 PM IST

Life Goal

Life Goal : నీకంటూ ఓ గమ్యం లేదా? అయితే.. నీ జీవితం తెగిన గాలిపటమైపోతుంది అనే మాటలు చాలాసార్లే విని ఉంటారు. టార్గెట్ లేనివారు జీవితంలో సక్సెస్ సాధించలేరంటూ మీతో కూడా చాలా మంది అనేఉంటారు. ఇలాంటివి వినీ వినీ కొందరికి విసుగు రావొచ్చు. మరికొందరు బోర్ ఫీలై, అలాంటి టాపిక్​ను డిస్కషన్లోకే రాకుండా చూసుకోవచ్చు. అలాంటి టాపిక్కే ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నప్పటికీ.. అందులోని విషయాలు మాత్రం కొత్తవి! నేరుగా మీరే ఇన్వాల్వ్ అయిపోతారు! అవేమంటే.. టార్గెట్ లేకపోతే కెరియర్​కు ఇబ్బంది సరే.. మనసుకూ ఇబ్బంది కలిగిస్తుందా? మానసిక సమస్యలకు కారణం అవుతుందా? లక్ష్యం లేనివాళ్ల బ్రెయిన్​ ఎలా బిహేవ్ చేస్తుంది? వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? ఆ థాట్స్​తో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అన్నది ఇప్పుడు చూడబోతున్నాం.

Life Goal : మీ మిర్చి తోటకు నీళ్లు పెట్టాలి. బావి నుంచి తోట దూరంగా ఉంది. నీళ్లు అక్కడి వరకూ వెళ్లాలంటే ఏం చేస్తారు? రెండు పద్ధతులు పాటిస్తారు. ఒకటి బావి నుంచి తోట వరకు కాల్వ తవ్వడం ద్వారా నీటిని తరలిస్తారు. లేదంటే.. పైపుల ద్వారా పంపిస్తారు. ఈ రెండు పనులూ చేయకుండానే.. బావి వద్ద మోటార్ ఆన్ చేశారు. నీళ్లు ఎటు వెళ్తాయి? చెల్లా చెదురుగా పారుతాయి. నేల ఎటు వంపుగా ఉంటే అటు వెళ్తాయి. అంతే తప్ప.. సూటిగా తోట వద్దకు మాత్రం వెళ్లవు. నీళ్లనీ వృథా అయిపోతాయి.

ఇక్కడ బావి మీరైతే.. నీళ్లు మీ ఆలోచనలు. గమ్యం తోట. అక్కడి చేరుకునే ప్లానింగే కాల్వ లేదా పైపులు. ఇవన్నీ ఎంత పక్కాగా ఉంటే.. మీరు అంత సక్సెస్ ఫుల్​గా టార్గెట్ రీచ్ అవుతారు. గెలుపుజెండా ఎగరేస్తారు. ఇందులో ఏ ఒక్కటి తేడాగా ఉన్నా.. సక్సెస్ పర్సెంట్​లో కోత పడిపోతుంది. ఇక్కడ కీలక విషయం ఏమంటే.. సక్సెస్​ పర్సెంట్ తగ్గినా, ఫెయిల్ అయినా నో ప్రాబ్లమ్. పరీక్షల్లో సప్లిమెంటరీ రాసినట్టు మళ్లీ మళ్లీ ప్రయత్నించి విజయం సాధించొచ్చు. కానీ.. అసలు గమ్యమే లేని వాళ్ల సంగతేంటి? అన్నది అసలు విషయం.

ఆలోచనలు అస్తవ్యస్తం..

బావి నీళ్లు ఎటు వెళ్లాలో తెలియక నేల ఎటు వాలుంటే అటు జారిపోయినట్టు.. టార్గెట్ లేని వాళ్ల ఆలోచనలు కూడా అస్తవ్యస్తంగా తయారవుతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. జీవితానికి లక్ష్యం అన్నదే లేనప్పుడు.. ఏం పని చేస్తున్నారో, అది ఎందుకు చేస్తున్నారో తెలియదు. తినడానికి డబ్బు కావాలి కాబట్టి, ఆ డబ్బుకోసం ఏదో ఒక పని చేయాలి కాబట్టి చేస్తారు. కానీ.. అందులో ఇష్టం ఉండదు. ప్యాషన్ ఉండదు. "ఏంటో ఈ జీవితం.. ఎటు పోతోందో అర్థమే కావట్లేదు" అనే వాళ్లను నిత్యం మన చుట్టూనే చూస్తూ ఉంటాం. ఇలా అంటున్నారంటే.. వాళ్లకు టార్గెట్ లేదని అర్థం.

నడి సంద్రంలోనే మిగిలిపోతారు..

లక్ష్యం లేనివారు.. నడిసముద్రంలోని పడవలాంటి వారు. వారి పక్కనుంచే పడవలు, షిప్పులు, క్రూయిజ్​లు అన్నీ తమ తమ గమ్యాల వైపు వెళ్లిపోతుంటాయి. వాటికి టార్గెట్ ఉంది. ఏ తీరానికి చేరాలో తెలుసు కాబట్టి.. అటువైపు ప్రయాణిస్తుంటాయి. కానీ.. గమ్యం లేనివారికి ఏ తీరం వైపు వెళ్లాలో అర్థం కాదు. ఎవరి సక్సెస్ గురించి విన్నా.. వారి బాటలో వెళ్తే బాగుండు అనిపిస్తుంది. కొంత దూరం వెళ్లాక మరొకరి విజయం బాగుందనిపిస్తే.. తిరిగి ఇటువైపు జర్నీ స్టార్ట్ చేస్తారు. ఇలా అటూ ఇటూ తిరుగుతూ.. నడిసంద్రంలోనే కాలం మొత్తం వృథా చేసుకుంటూ ఉంటారు.

మైండ్​లో ప్రెజర్..

ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసేవారు.. చిరాకు, ఆందోళన, భవిష్యత్తుపై భయంతో నిత్యం మనసులో వణికిపోతుంటారు. ఈ కండిషన్​ మెదడుపై ప్రెజర్ పెంచుతుందని థెరపిస్ట్ కేతమ్ హమ్దాన్ అంటున్నారు. మనకంటూ లక్ష్యం లేనప్పుడు.. మెదడు ఎలా బిహేవ్ చేస్తుందో ఆమె చెప్పారు. మనిషికి టార్గెట్ ఉన్నప్పుడు దాన్ని కంప్లీట్ చేయడానికి.. ఆ పనిపైనే ఫోకస్ చేస్తారు. అప్పుడు ఎలాంటి నెగెటివ్ ఆలోచనలూ దరిచేరవు. కానీ.. లక్ష్యం లేనప్పుడు మెదడు దారితప్పుతుందట. నెగెటివి విషయాలనే ఎక్కువగా ఆలోచిస్తుందట.

భవిష్యత్తుపై భయం..

భవిష్యత్తు గురించి ఆశావహ దృక్పథాన్ని పక్కనబెట్టి.. రేపటి రోజున ఎలాంటి నష్టాలు జరుగుతాయో అని మనసు గాబరాపడిపోతుంది. ఈ పరిస్థితి మెదడు అనవసరమైన ఒత్తిడిని మరింతగా పెంచుతుంది. ఇది మరింతగా ముదిరినప్పుడు డిప్రెషన్ వంటి సమస్యలు కూడా చుట్టుముడతాయి. ఈ కండిషన్ మనసు హానికరమని చెబుతున్నారు. ఇదే సమయంలో ఒక టార్గెట్ సెట్ చేసుకున్నవారు.. దానిపై ఫోకస్ చేసి, లక్ష్యం వైపు సాగిపోతుంటారు.

చూశారు కదా.. టార్గెట్ లేకపోతే జీవితం ఇబ్బందుల్లో పడడమే కాదు, మనసు కూడా అల్లకల్లోలమైపోతుంది. అందుకే.. జీవితంలో మీకు నచ్చిన టార్గెట్​ను సెలక్ట్ చేసుకోండి. ఆ వైపుగా సాగిపోండి. అప్పుడు పని కూడా ఓ ఆటలా మారిపోతుంది. ట్రస్ట్ యూ.. ఏదో ఒకరోజు తప్పకుండా నీ టార్గెట్ చేరుకుంటావు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.