ETV Bharat / state

వైసీపీ అధికార ప్రతినిధిలా సరికొత్త అవతారం - బయటపడ్డ కాంతిరాణా అసలు రంగు - Kanthi Rana Tata complaint to CEO

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 7, 2024, 7:21 AM IST

Vijayawada_CP_Kanthi_Rana_Tata_complaint_to_CEO
Vijayawada_CP_Kanthi_Rana_Tata_complaint_to_CEO

Vijayawada CP Kanthi Rana Tata Complaint to CEO: విజయవాడ సీపీ కాంతి రాణా తన ముసుగులన్నీ తొలగించేసి పూర్తిస్థాయి రంగును బయటపెట్టారు. రాజకీయ పార్టీలు, మీడియా తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని వాటిని నిలువరించాలని ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం తరపున కాంతిరాణా, ఎస్పీ రవీంద్రబాబు సీఈవోకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని అంశాలు, భాషను పరిశీలిస్తే అదంతా తాడేపల్లి ప్యాలెస్‌ స్క్రిప్టేననే అర్థమైపోతోంది.

వైసీపీ అధికార ప్రతినిధిలా సరికొత్త అవతారం - బయటపడ్డ కాంతిరాణా అసలు రంగు

Vijayawada CP Kanthi Rana Tata Complaint to CEO : విజయవాడ సీపీ కాంతి రాణా తన ముసుగులన్నీ తొలగించేసి పూర్తిస్థాయి రంగును బయటపెట్టారు. అయిదేళ్లుగా అధికార పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాసిన ఆయన ఎన్నికల వేళ అచ్చం 'వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి' లా మారిపోయారు. అధికార పార్టీతో అంటకాగుతున్న అధికారులపై మీడియాలో వస్తున్న కథనాలతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న ఫిర్యాదులకు తనదైన రీతిలో వక్రభాష్యం చెప్పుకొచ్చారు. ఆయా అంశాల్లో మీడియా, ప్రతిపక్ష నాయకులపై వైఎస్సార్సీపీ నేతలు పదే పదే చేస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల్లోని అంశాలనే కలగలిపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్సీపీతో అంటకాగుతున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారులందరి తరఫున ఆయనే వకాల్తా పుచ్చుకుని మీడియాపై విషం చిమ్మారు. కాంతిరాణాతో పాటు డీజీపీ కార్యాలయంలో ఏఐజీగా పని చేస్తున్న ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు మీనాకు ఈ ఫిర్యాదు ఇవ్వగా దానిపై 19 మంది ఐపీఎస్ అధికారులు సంతకాలు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ కార్యాలయం వెల్లడించింది. అయితే మీడియాకు విడుదల చేసిన ఫిర్యాదు ప్రతిలో ఏ అధికారి సంతకమూ లేదు.

రాజకీయ పార్టీలు, మీడియా తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని వాటిని నిలువరించాలని ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం తరపున విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, ఎస్పీ రవీంద్రబాబు సీఈవోకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని అంశాలు, భాషను పరిశీలిస్తే అదంతా తాడేపల్లి ప్యాలెస్‌ స్క్రిప్టేననే అర్థమైపోతోంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులతో పాటు, ఆ పార్టీలకు సానుభూతిపరులుగా పేరొందిన మీడియా సంస్థలు ఐపీఎస్‌ అధికారులపై నిరంతరం దుష్ప్రచారం చేస్తున్నాయన్న కాంతిరాణా వారిపై నిరాధార ఆరోపణలతో కథనాలు రాస్తున్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ పోలీసు అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయనీ తెలిపారు.

ఐపీఎస్‌ల తీరుపై కథనాలు - నిరాధార, అసత్య ఆరోపణలంటూ ఐపీఎస్‌ అధికారుల సంఘం దబాయింపు - Kanthi Rana on Eenadu Stories

ఐపీఎస్‌ అధికారా ? రాజకీయ నాయకుడా ?: అఖిలభారత సర్వీసు అధికారిగా ఉండి ప్రతిపక్ష పార్టీలపై, మీడియాపై రాజకీయ విమర్శలు చేయడమేంటి కాంతిరాణా గారూ ? నిరాధార ఆరోపణలతో కథనాలు రాస్తున్నారని, ఫిర్యాదులు చేస్తున్నారని పదే పదే గగ్గోలుపెట్టే బదులు ఏవి నిరాధారమో నిర్దిష్టంగా చెప్పొచ్చు కదా. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు సానుభూతిపరులుగా పేరొందిన మీడియా సంస్థలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారే ఏ ఆధారంతో మీరు ఆ ఆరోపణ చేశారు ? మీడియా ఉన్నదే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి, వాచ్‌డాగ్‌లా వ్యవహరించడానికి, అరాచకాల్ని ఎండగట్టడానికి, వాస్తవాల్ని ప్రజలకు వెల్లడించడానికి. అంతే తప్ప ప్రభుత్వానికి, తప్పులు చేసే అధికారులకు బాకా ఊదడానికి, వెనుకేసుకు రావడానికి కాదు. వైసీపీ నాయకులు నిత్యం చేసే ఆరోపణల్నే ఫిర్యాదులో ప్రస్తావించారంటేనే దాని వెనక ఎవరి ప్రోద్బలం ఉందో, ఎవరి ఆదేశాల మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారో అర్థమైపోతోందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఎన్నికల కోడ్‌ వచ్చాక కూడా అధికారపార్టీ పట్ల స్వామిభక్తిని పదే పదే ప్రదర్శిస్తున్నారే అలాంటి అధికారుల బండారం బట్టబయలు చేసేలా కథనాలు రాయడం తప్పెలా అవుతుంది?

పార్టీల ఫిర్యాదు తప్పు ఎలా అవుతుంది ?: రాజకీయ పార్టీల నాయకులు తొలుత పోలీసు అధికారులపై తీవ్ర అభియోగాలు మోపుతున్నారని అవే అంశాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారని రాణా ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. అందులో పేర్కొన్న అభియోగాలకు ఎలాంటి ఆధారాలూ ఉండట్లేదని అవే అంశాలతో రాజకీయ పార్టీల ప్రతినిధులు బాధ్యాతరహితంగా మీడియాలో మాట్లాడుతున్నారనీ ఆరోపించారు. అవి పత్రికల్లో వస్తూ, టీవీల్లో ప్రసారమవుతున్నాయని ఇదంతా ఓ విషవలయంలా సాగుతోందని సెలవిచ్చారు. ఈ ఫిర్యాదుల వల్ల పోలీసు అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతింటోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తటస్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఐపీఎస్‌ అధికారుల్లో కొందరు వైసీపీకు బంటుల్లా మారిపోయి అన్నీ వదిలేసి ఏకపక్షంగా పని చేస్తుంటే అలాంటివారిపై రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేయడం తప్పెలా అవుతుందో రాణా సారే చెప్పాలి.

మీరెలా తప్పుపడతారు ?: ఆయా పార్టీల ఫిర్యాదుల్లో పేర్కొన్న అభియోగాలకు ఆధారాలు లేవని ఎలా చెబుతారు? ప్రతిపక్షాలు మీడియా ఎదుట ఏం మాట్లాడాలో, మీడియాలో ఏం ప్రచురించాలో కూడా మీరే నిర్దేశిస్తారా? ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించే గళాల్ని గత అయిదేళ్లుగా అణచివేసింది చాలదా? ఎన్నికల కోడ్‌ ఉన్నా ఇంకా అరాచక అధికారుల పట్ల గళాలు విప్పొద్దా ? అధికారపార్టీ అక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అధికారులు ఆయా స్థానాల్లో కొనసాగుతుంటే ఎన్నికల్లో 'లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌' ఎలా సాధ్యమవుతుంది. అలాంటి అధికారుల వ్యవహారాన్ని బహిర్గతం చేసేలా మీడియాలో కథనాలు రాయడం తప్పెలా అవుతుంది ? తప్పు చేస్తున్న అధికారుల గురించి రాస్తే మిగతా పోలీసు అధికారుల నైతిక స్థైర్యం ఎలా దెబ్బతింటుంది? తమకు అన్యాయం జరుగుతోందని భావించినప్పుడు ఫిర్యాదులివ్వడం రాజకీయ పార్టీల బాధ్యత. అందులోని అంశాలు తప్పో, ఒప్పో ఎన్నికల సంఘం తేలుస్తుంది. దాన్ని మీరెలా తప్పుపడతారు?

కేంద్ర ఎన్నికల సంఘం కొరడా - ప్రతిపక్షాల అణచివేత, నిబంధనల పాతరకు ఫలితం! - IAS And IPS Officers Transfers

వాళ్ల గురించి రాయొద్దా? : స్వార్థ ప్రయోజనాలు, రాజకీయపార్టీలతో అనుబంధం కొనసాగిస్తున్న మీడియా సంస్థలు పోలీసు అధికారులపై ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్లపై అనుచిత, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురిస్తున్నాయని ఫిర్యాదులో విజయవాడ సీపీ సెలవిచ్చారు. వీటివల్ల గత రెండు నెలల్లో 30 మందికి పైగా ఐపీఎస్‌ అధికారులకు నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌లో 120 మందికి పైగా ఐపీఎస్‌ అధికారులున్నారు. వాళ్లలో 26 జిల్లాలకు ఎస్పీలు, కమిషనర్లు ఉన్నారు. వాళ్లందరిపైనా ఫిర్యాదులు లేవు, పత్రికల్లో కథనాలు రావట్లేదు. కేవలం అధికార పార్టీ అక్రమాలు, అరాచకాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ కన్నూమిన్నూ కానరాకుండా వ్యవహరిస్తున్న వారిపైనే వార్తలొచ్చాయి. నిష్పక్షపాతంగా, తటస్థంగా పని చేస్తున్న అధికారులను ఎవరూ తప్పు పట్టట్లేదు. నిబంధనలు మీరి అడ్డగోలుగా, ఏకపక్షంగా పనిచేస్తున్న అధికారుల గురించి మీడియాలో కథనాలు రాయడం తప్పెలా అవుతుంది? అవి అనుచిత కథనాలు ఎలా అవుతాయి? అధికారపార్టీతో అంటకాగుతున్న ఐపీఎస్‌ అధికారులు ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించడం నేరం కాదా? వాళ్లు వైసీపీకు అనుకూలంగా ఎలాగైనా ప్రవర్తించొచ్చా? పేట్రేగిపోవచ్చా? వాళ్ల గురించి మాత్రం రాయొద్దా?

ఎన్నికల సంఘం చర్యలనూ తప్పుపడతారా? : మీడియా సంస్థలు, రాజకీయపార్టీలు కలిసి ప్రణాళికబద్ధంగా నిరంతర వ్యతిరేక ప్రచారం, ప్రతికూల అంశాలను పెద్దవి చేసి చూపించాయని కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రేంజ్‌ ఐజీలను ఎన్నికల సంఘం బదిలీ చేసిన అంశంలో విజయం సాధించాయని కాంతిరాణా ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేసినంత మాత్రాన, మీడియాలో చూపించినంత మాత్రాన విచారణ జరపకుండానే అఖిలభారత సర్వీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసేస్తుందా? అంటే ఎన్నికల సంఘం ప్రభావితమవుతోందన్నది మీ ఉద్దేశమా? ఎన్నికల సంఘం చర్యలనూ తప్పుపడతారా?

రాజకీయ హింస చోటు చేసుకోలేదా? : పల్నాడు ఎస్పీగా పనిచేసిన రవిశంకర్‌రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి, అనంతపురం ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తమ హయాంలో వైకాపా కార్యకర్తల్లా మారిపోయి విధులు నిర్వర్తించారన్న విమర్శలున్నాయి. అధికారపార్టీ అరాచకాలకు అండగా ఉంటూ.. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించారని, ప్రతిపక్ష నాయకుల్ని వేధించారన్న ఫిర్యాదులున్నాయి. చివరికి ప్రధాని పాల్గొనే సభకూ తగిన భద్రతా ఏర్పాట్లు చేయకుండా వదిలేశారన్న ఆరోపణలున్నాయి. రాజకీయపరమైన హింసకు చోటు ఇవ్వద్దని ఎన్నికల సంఘం హెచ్చరించినా ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో రాజకీయ హింస చోటు చేసుకోలేదా? వీటన్నింటిపైనా కేంద్ర ఎన్నికల సంఘమే విచారణ జరిపించింది. కేంద్ర నిఘావిభాగం నివేదిక పంపించింది. వాటి ఆధారంగా ఎన్నికల సంఘం వాళ్లపై చర్యలు తీసుకుంది. దాన్నీ కాంతిరాణా ఎలా తప్పు పడతారు?

అలాంటి అధికారుల పేర్లను ఎలా ప్రతిపాదిస్తారు? : ఎన్నికల సంఘం బదిలీ చేసిన అధికారుల స్థానంలో కొత్తగా నియమితులైన ఎస్పీలు బాధ్యతలు చేపట్టకముందే 'వీళ్లా.. కొత్త ఎస్పీలు?' అంటూ విషం చిమ్ముతూ కథనం రాశారని ఇది ఎన్నికల సంఘం పట్ల ధిక్కారమేనని విజయవాడ సీపీ ఆయనకాయనే తేల్చేశారు. నెల్లూరు ఎస్పీగా నియమితులైన ఆరిఫ్‌ హఫీజ్‌ తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపైన, చంద్రబాబు ఇంటిపైన దాడి జరిగితే కనీసం నిందితులను అరెస్టు చేయలేదు. ప్రకాశం ఎస్పీగా నియమితులైన గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై జులుం ప్రదర్శించారు.

అనంతపురం ఎస్పీగా నియమితులైన అమిత్‌ బర్దర్‌ శ్రీకాకుళంలో తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లను అక్రమంగా అరెస్టు చేసి వేధించారన్న విమర్శలున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీ కోసం పని చేశారన్న ఫిర్యాదులున్నాయి. సీఐడీ ఆర్థిక నేరాల విభాగం ఎస్పీగా ఉంటూ ప్రభుత్వానికి గిట్టనివారిని తీవ్రంగా వేధించారనే విమర్శలున్నాయి. అలాంటి అధికారుల పేర్లను ఎన్నికల సంఘానికి పంపించిన ప్యానెల్‌లో సీఎస్‌ ఎలా ప్రతిపాదిస్తారు? అధికారపార్టీ అరాచకాలకు కొమ్ముకాశారనే అభియోగాలున్న ఇలాంటి అధికారులను ఎస్పీలుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించడం తప్పెలా అవుతుంది? అది విషం చిమ్మడమెలా అవుతుంది?

పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసింది ఆ అధికారులు కాదా?: మావోయిస్టులు, ఉగ్రవాదులు, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలను అణిచివేయడం ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల ముందుంది. కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్‌ అధికారుల వరకూ ఎందరో ప్రాణత్యాగాలు చేశారని రాణా తెలిపారు. అలాంటిది పోలీసు అధికారుల మనోధైర్యం దెబ్బతీయడానికి, నిర్వీర్యం చేయడానికి నిరాధార ఆరోపణలతో నిందలు వేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులంటేనే దేశంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉండేవి. ఎంతోమంది అధికారుల త్యాగాల వల్లే ఆ కీర్తి లభించింది. అంతటి విశిష్టత కలిగిన ఏపీ పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసింది వైసీపీతో అంటకాగి, ఆపార్టీకి కొమ్ముకాసిన అధికారులు కాదా? మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ లాంటి ప్రఖ్యాత సంస్థనే ఇబ్బందులకు గురిచేసి విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయించాల్సిన పరిస్థితులు కల్పించింది ఎవరు? నిజాయతీగా, తటస్థంగా, చట్టప్రకారం పనిచేస్తే ఏపీ పోలీసు ఖ్యాతి ఇంకా పెరిగేది. దాన్ని గత అయిదేళ్లలో దిగజార్చింది కాక తిరిగి దబాయించడం మీకే చెల్లింది.

విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా, ఏఐజీ రవీంద్రనాథ్‌బాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. గత అయిదేళ్లలో వైసీపీతో అంటకాగి, ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసిన అధికారులకు ర్యాంకింగ్‌ ఇస్తే అందులో కాంతిరాణా అగ్రగామిగా నిలుస్తారని, రవీంద్రనాథ్‌బాబు ముందువరుసలో ఉంటారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలుగుదేశం నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైకాపా నాయకులు హత్యాయత్నానికి తెగబడితే, ఆ నాయకులపై ఈగ వాలకుండా కాంతిరాణా కొమ్ముకాసి, కేసును నిర్వీర్యం చేశారన్న ఫిర్యాదులున్నాయి.

సంకల్పసిద్ధి కేసులో అధికారపార్టీ నాయకుల్ని తప్పించారని, చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్‌ దండయాత్రగా వెళ్తే ఆయన్ను నిలువరించలేదు సరికదా పరోక్షంగా సహకరించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్‌ డెలివరీ చేసిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అసలు మొదట్లో అరెస్టు చేయకుండా కాపాడింది రవీంద్రనాథ్‌బాబే అన్న ఫిర్యాదులున్నాయి. ఈ కేసు గురించి ప్రెస్‌మీట్‌లో చెబుతూ 'అనంతబాబు గారు' అంటూ ఆయన పట్ల అత్యంత గౌరవమర్యాదలు రవీంద్రనాథ్‌బాబు ప్రదర్శించారు. ఇంతలా దిగజారిన ఇలాంటి అధికారులు వాస్తవానికి అద్దంపట్టేలా వార్తలు రాసిన మీడియాకు నీతి పాఠాలు చెప్పడం దారుణం కాక మరేంటి?

మళ్లీ వైఎస్సార్సీపీ 'బంటు'లకే పట్టం - స్వామి భక్తి చాటిన సీఎస్ జవహర్ రెడ్డి - ECI Appoints IPS Officers in Andhra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.