ETV Bharat / state

ప్రపంచ శక్తిగా భారతదేశం- అందుకే మా చూపు మరింతగా ఇటువైపు : అమెరికా రాయబారి - US ENVOY ERIC GARCETTI INTERVIEW

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 12:47 PM IST

American Ambassador Eric Garcetti Interview 2024 : అమెరికా-భారత్‌ దేశాల ఉమ్మడి భాగస్వామ్యం యావత్‌ ప్రపంచానికి లాభదాయకమని భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి పేర్కొన్నారు. భారతదేశం ఓ ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తోందని, తాము దాన్ని స్వాగతిస్తోందని తెలిపారు. ఉభయ దేశాల సంబంధాలు రానున్న రోజుల్లో మరింత విస్తరిస్తాయని చెప్పారు. రాయబారిగా ఎరిక్‌ గార్సెట్టి ఇటీవల సంవత్సర పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘ఈనాడు - ఈటీవీ భారత్‌కు' ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

American Ambassador Eric Garcetti Interview 2024
American Ambassador Eric Garcetti Interview 2024 (ETV Bharat)

  • భారత్‌లో మీరు రెండు దేశాల సంబంధ బాంధవ్యాలను మరింత పటిష్ఠపరచడంలో మీ ప్రాధాన్యాంశాలు ఏమిటి ?

జవాబు : ప్రపంచవ్యాప్తంగా భారత్‌-అమెరికా సంబంధాలు ఎంతో ప్రభావవంతమైనవి. భారత్‌ ఓ ప్రపంచ శక్తిగా ఆవిర్భవించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. రెండు దేశాల ప్రజారక్షణ, సంపద పెంపు, పర్యావరణంలో మార్పులు తదితర అంశాలపై కలిసి పని చేయడమన్నది ప్రస్తుత ప్రాధాన్యాంశం. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడం నాకు బాగా సంతృప్తి ఇస్తోంది. ఇద్దరు మిత్రుల మధ్య ప్రతి విషయంలోనూ పూర్తి ఏకాభిప్రాయం ఉండకపోవచ్చుగానీ, మన ఉమ్మడి కలలు, ప్రజల సంక్షేమం తదితరాల విషయంలో ఇరుదేశాలను ఒకే తాటిపై ఉంచగల అంశాలపై ఉభయులకూ పూర్తిస్థాయి అవగాహన ఉంది. కలిసి పనిచేసినప్పుడు మాత్రమే ఇరు దేశాలకే కాకుండా ప్రపంచ దేశాలన్నింటికీ లాభదాయకం అమవుతుంది.

  • ఏడాది పూర్తి చేసుకున్నారు కదా - మీ అనుభవం ఏం చెబుతోంది?

జవాబు : నేను పూర్తి సంతృప్తితో ఉన్నాను. అమెరికా-భారత్‌ సంబంధాల విషయంలో ఈ సంవత్సరం సచరిత్రాత్మకమైనది. ఉభయ దేశాల సంబంధ బాంధవ్యాలు పలు అంశాల్లో చాలా మెరుగ్గా కొనసాగుతున్నాయి. ఉదాహరణకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైట్‌హౌస్‌ సందర్శన, దిల్లీలో నిర్వహించిన జీ-20 సదస్సుకు అమెరికా నాయకుల రాక, ఇలాంటి ఎన్నో విషయాలు మంచి సంబంధాలకు తార్కాణాలు. ఇవన్నీ రానున్న రోజుల్లో మరింత మెరుగైన బంధాలకు పటిష్ఠ పునాదులవుతాయి. ఓ దౌత్యవేత్తగా నేనున్నప్పుడే ఇవన్నీ జరగడం ఆనందకరం. ఇంకా చేయాల్సినవి, జరగాల్సినవీ ఎన్నో ఉన్నాయి.

  • అమెరికా-భారత్‌ మధ్య వినూత్న పరిశోధనలు, కాలుష్యరహిత ఇంధనం (క్లీన్‌ ఎనర్జీ), ఆరోగ్య సంరక్షణ వంటి కీలక విషయాల్లో ద్వైపాక్షిక సహకారం ఎలా ఉంది ?

జవాబు : రెండు దేశాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. క్లీన్‌ ఎనర్జీ సాంకేతికత అంటే విద్యుత్ బ్యాటరీలు, సోలార్‌ ప్యానెళ్ల రంగంలో 2030 నాటికల్లా భారత్‌ 500 గిగావాట్ల ఉత్పాదనకు చేరువయ్యేలా చూడాలన్నది మా సంకల్పం. వ్యాక్సిన్ల విషయానికి వస్తే ఇప్పటికే భారత్‌ నుంచి అనేక దేశాలకు టీకాలు సరఫరా అవుతున్నాయి. ఈ రంగంలో భారత్‌ కంపెనీలతో మా దేశ కంపెనీల భాగస్వామ్యం కొనసాగుతోంది. మరిన్ని రంగాల్లో సహకారానికి అవకాశముందని యూఎస్‌-ఇండియా ఇనిషియేటివ్‌ ఆన్‌ క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వేదికగా ఉభయ దేశాల నేతలు తెలిపారు. ఆ దిశగా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇలా చేయడం ప్రపంచం మొత్తానికి మంచి చేయూత అవుతుంది.

టీవల హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా చార్మినార్‌ వద్ద ఎరిక్‌ గార్సెట్టి
టీవల హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా చార్మినార్‌ వద్ద ఎరిక్‌ గార్సెట్టి (ETV Bharat)
  • ఇండో-పసిఫిక్‌ ప్రాంతాల్లోని సవాళ్ల నేపథ్యంలో- సముద్ర జలాలు, తీరప్రాంత రక్షణ, ఉగ్రవాదానికి విరుగుడైన కౌంటర్‌ టెర్రరిజం తదితర అంశాల్లో భారత్‌ పోషిస్తున్న భూమికను మీరెలా చూస్తున్నారు ?

జవాబు : అమెరికా-భారత్‌లు రెండూ ఉగ్రవాద బాధిత దేశాలే. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నిర్మూలనకు ఈ ఇరుదేశాల కృషి అనివార్యం. కౌంటర్‌ టెర్రరిజం, సరిహద్దులను సంరక్షించుకోవడం, సముద్ర జలాలు తదితర అంశాలన్నింటిలోనూ అమెరికా నుంచి భారత్‌కు తగిన మద్దతు ఉంటుంది. భద్రత, క్లీన్‌ ఎనర్జీ, అంతరిక్ష పరిశోధనలు వంటి వాటిపై రెండు దేశాలకు చెందిన ఇద్దరిద్దరు(2+2) ప్రతినిధి బృందాలతో ప్రతినిత్యం చర్చలు కొనసాగుతున్నాయి. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌; క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌; ఇండియా-యూఎస్‌ యాక్సలరేషన్‌ ఇకో సిస్టం వంటి వేదికలపైనా భారత రక్షణ, పారిశ్రామిక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.

  • పర్యావరణ మార్పులు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతాల్లో స్వేచ్ఛా వాణిజ్యం సహా పలు అంశాల్లో ఉభయ దేశాల మధ్య సహాయ సహకారాలను మీరెలా చూస్తున్నారు ?

జవాబు : ఇండో-పసిఫిక్‌ ప్రాంతాల్లో స్వేచ్ఛా వాణిజ్యంపై అమెరికా-భారత్‌ దేశాలది ఒకే దృక్పథం. సెమీ కండక్టర్ల సాంకేతికత ఇచ్చిపుచ్చుకోవడం, అత్యాధునిక రక్షణ ఉపకరణాల తయారీ, సరఫరా వ్యవస్థల రూపకల్పనల్లో సంయుక్త భాగస్వామ్యం వంటివి ఈ కోవలోనివే. భారతీయ వ్యోమగాములకు నాసా ద్వారా శిక్షణ, ఇంధన వనరులు, వ్యవసాయం, ఆరోగ్యం, సాంకేతికత వంటి అంశాలపై పరిశోధనల్లో ఉభయ దేశాల విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యం, ఇలా చాలా అంశాలున్నాయి. ఇరు దేశాలతో పాటు క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌లో భాగమైన ఆస్ట్రేలియా, జపాన్‌లూ సంయుక్తంగా పనిచేస్తే, వ్యాక్సిన్ల తయారీ మొదలుకొని వాతావరణ, పర్యావరణ సంరక్షణలో భాగస్వామ్యం, సాంకేతికత అభివృద్ధిలో మరింత ఊతం లభించి ఇంకా పురోగతి సాధించవచ్చు. అందుకు అవసరమైన కార్యక్షేత్రాన్ని ఇప్పటికే సిద్ధం చేశాం. ఇవి సమస్త మానవాళి పురోగతికీ ఉపయుక్తమైన విషయాలు.

  • అంతర్జాతీయంగా సప్లై-చైన్‌ మేనేజ్‌మెంట్‌లో భారత్‌ పాత్రను ఎలా చూస్తున్నారు?

జవాబు : ఒక దేశం నుంచి మరో దేశానికి ఇచ్చిపుచ్చుకోవడాల్లో తేడాలొచ్చినప్పుడు పరిస్థితులు ఎంతో సంక్లిష్టంగా మారి, ఎలాంటి గొడవలు ఉత్పన్నమవుతాయన్నది ఇటీవలే కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని బాధించినప్పుడు స్పష్టమైంది. ఎగుమతులు, దిగుమతులు కొనసాగుతున్నప్పుడే అన్ని దేశాలూ ప్రయోజనం పొందుతాయి. ఒక దౌత్యవేత్తగా. భారత్‌ తన దేశీయ మార్కెట్‌తోపాటు ప్రపంచ మార్కెట్‌కూ తన ఉత్పాదనల్ని సరఫరా చేయాలని ఆశిస్తాను.

అమెరికా కొన్ని అవసరాల కోసం భారత్‌ వైపు చూస్తోంది. ఉదాహరణకు మాకు అవసరమైన జనరిక్‌ ఔషధాల్లో 40 శాతం ఉత్పాదన భారత్‌లోనే జరుగుతోంది. విద్యుత్‌ వాహనాలు, సోలార్‌ సెల్స్‌ లాంటి అంశాల్లోనూ ఇదే జరగాలన్నది మా అభిలాష. గత సంవత్సరం మా మధ్య పెండింగ్‌లో ఉన్న ఏడు వాణిజ్య సంఘర్షణలను డబ్ల్యూటీవో వేదికగా పరిష్కరించుకున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికాదీ అదే వేగం. రెండు దేశాల మధ్య మంచి సౌహార్ద సంబంధాలకు అవకాశముంది. కొన్ని కీలక అంశాల్లో రెండింటి మధ్య సారూప్యత, సమన్వయం ఉన్నాయి. అందుకే మా కంపెనీలు ఇక్కడ ఫోకస్‌ పెడుతున్నాయి.

అమెరికా వీసాల జారీలో తెలంగాణ, ఏపీ ప్రజలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వీసాల జారీలో జాప్యమవుతోంది

జవాబు : మొదటిసారి జారీ చేసే బీ1/బీ2 వీసాలు మినహా మిగతా అన్ని వీసాల జారీలోనూ జాప్యాన్ని దాదాపుగా నివారించగలిగాం. బీ1/బీ2ల జారీలోనూ జాప్యాన్ని కనీసం 75 శాతానికిపైగా కుదించగలిగాం. వారాంతాల్లోనూ మా ఉద్యోగులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. భారత్‌లో వీసాలకు డిమాండ్‌ ఇంకా ఎక్కువగానే ఉంటోంది. తగినంత మంది ఉద్యోగుల నియామకం ఓ సవాల్‌గా ఉంది. అయినా మరిన్ని ఎక్కువ వీసాల జారీకి కృషి చేస్తాం.

  • మరింత మెరుగైన ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మీ అభిప్రాయం ఏమిటి

జవాబు : వివిధ అంశాలను రెండు దేశాలు సంయుక్త కృషితో సాధిస్తే ప్రయోజనాలు బహుముఖంగా ఉంటాయి. అవి ఏమిటనే విషయంలో ఇరుపక్షాలకూ స్పష్టమైన అవగాహన ఉంది. వాటిని సాధించాలన్న కోరిక కూడా బలంగా ఉంది. ఉభయ దేశాల మధ్య బంధంతో ఒనగూరే ప్రయోజనాలు అమెరికా ప్లస్‌ ఇండియా అన్నట్టుగా కాదు, బహుముఖంగా ఉంటాయి. ఇలా ఉమ్మడిగా కృషి చేస్తే ఇరువురికే కాదు, ప్రపంచానికే లాభసాటిగా పరిణమిస్తుందన్నది నా ప్రగాఢ విశ్వాసం.

66వేల మంది భారతీయులకు అమెరికా సిటిజెన్​షిప్- ఆ లిస్ట్​లో​ రెండో దేశంగా ఇండియా - American Citizenship To Indians

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.