ETV Bharat / state

'డొల్ల కంపెనీలు - హవాలా మార్గాలు' - సినిమాను తలదన్నేలా లిక్కర్ స్కాం

మద్యం ముడుపుల కోసం డొల్ల కంపెనీలు సృష్టించిన వైఎస్సార్సీపీ ముఠా - ముంబయి, దిల్లీ కేంద్రాలుగా అనామకుల పేర్లతో కల్పిత సంస్థలు

AP Liquor Scam Probe
AP Liquor Scam Probe (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 25, 2025 at 7:29 AM IST

|

Updated : June 25, 2025 at 8:02 AM IST

5 Min Read
Choose ETV Bharat

AP Liquor Scam Probe : వైఎస్సార్సీపీ హయాంలోని లిక్కర్ స్కాంలో మూలాలు, లావాదేవీలు తవ్వేకొద్దీ మరింత లోతుకు వెళ్తున్నాయి. మద్యం ముడుపుల్ని అంతిమ లబ్ధిదారులకు చేర్చేందుకు నిందితులు అనుసరించిన విధానాలు విస్తుగొలుపుతున్నాయి. దిల్లీ, ముంబయి కేంద్రాలుగా అనామకుల పేర్లతో డొల్ల కంపెనీలు సృష్టించి మరీ మద్యం ముడుపుల్ని మళ్లించారు. ఏపీఎస్​బీసీఎల్ నుంచి డిస్టిలరీల ఖాతాల్లోకి సొమ్ము జమ చేసి అక్కడి నుంచి డొల్ల కంపెనీలు, కల్పిత సంస్థల ఖాతాలకు చేర్చి చివరిగా హవాలా మార్గాల్లో అంతిమ లబ్ధిదారుకు అందజేశారు. ఈ లావాదేవీలన్నింటినీ ఆధారాలతో సహా సిట్ వెలికితీసింది.

మద్యం ముడుపుల కోసం డొల్ల కంపెనీలు సృష్టించిన వైఎస్సార్సీపీ ముఠా (ETV)

ప్రభుత్వంలోని కీలక నాయకులకు భారీగా లంచాలు కట్టబెట్టి బంగాళాఖాతంలోని చమురు నిక్షేపాలను వశం చేసుకునేలా డీల్ కుదుర్చుకుంటాడు ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త! కొంతమంది బిచ్చగాళ్ల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచి డొల్ల కంపెనీలు సృష్టించి వాటి ద్వారా ఆయా నేతల బినామీల ఖాతాల్లోకి ముడుపుల సొత్తు జమచేస్తుంటారు. ఆ లంచాల సొమ్మంతా చివరగా చేరాల్సిన నాయకుడికి చేరుతుంది! ఇటీవల విడుదలైన కుబేర సినిమా మూలకథ ఇది!

ఇలాంటి వ్యవహారాల్లో ఏళ్ల కిందటే వైఎస్సార్సీపీ ముఠా ఆరితేరింది. మద్యం కుంభకోణంలో వేల కోట్ల ముడుపులను కొల్లగొట్టేందుకు వాటిని అంతిమ లబ్ధిదారుకు చేర్చేందుకు కుబేర సినిమాను తలదన్నే నేర విధానాన్ని 2019-2024 మధ్య అమలు చేసింది. దీని కోసం ముంబయి, దిల్లీలో అనామకులు, చిరు వృత్తిదారులు, రోజువారీ కూలీలు, చిరుద్యోగులు, ఊరూవాడా లేకుండా తిరిగేవారి పేర్లతో పదుల సంఖ్యలో డొల్ల కంపెనీలు సృష్టించింది. వారి పేరుతో పెద్దపెద్ద బ్యాంకుల్లో ఖాతాలు తెరిచింది.

YSRCP Liquor Scam Updates : మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు నాటి ప్రభుత్వ పెద్దలకు చెల్లించాల్సిన దాంట్లో కొంత మొత్తాన్ని డొల్ల కంపెనీల ఖాతాల్లోకి పంపించింది. వాటి నుంచి మరికొన్ని డొల్ల కంపెనీల ఖాతాల్లోకి ఆ సొమ్మును చేర్చింది. అలా అంచెలంచెలుగా ముడుపుల సొత్తంతా అంతిమ లబ్ధిదారుకు, అతని బినామీలకు అందజేసింది. సిట్ అధికారులు ఆయా కంపెనీల రిజిస్టర్డ్ చిరునామాలు, బ్యాంకు కేవైసీ పత్రాల్లోని చిరునామాలకు వెళ్లి పరిశీలించగా అక్కడ ఆ కంపెనీల ఆనవాళ్లు కూడా లేవు. ఆయా కంపెనీల్లో డైరెక్టర్లుగా పేర్కొన్న వ్యక్తులెవరో కూడా అక్కడివారెవరికీ తెలియదు.

మద్యం ముడుపులను మళ్లించేందుకు వైఎస్సార్సీపీ ముఠా వినియోగించిన డొల్ల కంపెనీలన్నీ దాదాపు ఒకే చిరునామాతో ఉన్నాయి. ఆ కంపెనీలు, వాటి డైరెక్టర్ల పేర్లతో ఒకే బ్యాంకులో ఖాతాలున్నాయని సిట్ గుర్తించింది. అయితే రికార్డుల్లో పేర్కొన్న చిరునామాల్లో అలాంటి కంపెనీలేవీ లేవని తేల్చింది. ఓల్విక్ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 51వ అంతస్తు, జీఆర్​డీ శ్రీజీ ఆర్కేడ్‌, టాటా రోడ్‌-23, రోక్సీ సినిమాస్‌ దగ్గర, ఒపెరా హౌస్‌, గిర్‌గావ్‌, ముంబయి చిరునామాతో రిజిస్టరై ఉంది.

బ్యాంకు కేవైసీ పత్రాల్లో ప్లాట్ నంబర్ 2ఎఫ్, 3వ ఫ్లోర్‌, నందలాల్ మేన్షన్‌, షేక్‌ మెమన్‌ వీధి, చంపాగలీ, ఎంజే మార్కెట్, ముంబయి అడ్రస్​గా ఉంది. ఈ సంస్థ డైరెక్టర్లుగా రికార్డుల్లో ఉన్న ప్రేమ్‌ప్రకాశ్‌ యాదవ్, అరవింద్‌కుమార్‌ గౌడ్‌ ఎవరో, ఎక్కడివారో, అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. ముంబయిలోని కొలాబా బ్రాంచ్‌ ఎస్‌ బ్యాంకులో ఈ సంస్థ పేరిట ఉన్న ఖాతాలోకి అదాన్‌ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్‌ నుంచి భారీ మొత్తాల్లో ముడుపుల సొమ్ము అనేక విడతల్లో జమ చేశారు. అక్కడి నుంచి యష్‌ బులియన్, ట్రిఫ్ఫెర్‌ ఎంటర్‌ప్రైజెస్, న్యూమోంట్‌ గోల్డ్‌ అండ్‌ జ్యూయలరీ, దీపక్‌ ఎంటర్‌ప్రైజెస్, కీరాజ్‌ ఎంటర్‌ప్రైజెస్, శ్రీజీ ఇన్ఫోటెక్‌ వంటి డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు.

  • నైస్న మల్టీ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 3వ ఫ్లోర్, మంత్రి బిల్డింగ్, షేక్‌ మెమన్‌ వీధి, చంపాగలీ, ఎంజే మార్కెట్, ముంబయి చిరునామాతో రిజిస్టరైంది. ఈ సంస్థ డైరెక్టర్ల పేరిట ఉన్న ఖాతాలకు డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీలు ముడుపుల సొమ్ము జమ చేశాయి. వాటి నుంచి విశ్వకర్మ ఎంటర్‌ప్రైజెస్, దీపక్‌ ఎంటర్‌ప్రైజెస్, గౌరవ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే డొల్ల కంపెనీల ఖాతాల్లోకి నిధులు మళ్లాయి.
  • అలాగే విశాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ అనిల్‌కుమార్‌ విశ్వకర్మ అనే వ్యక్తి పేరుతో, డోర్‌ నంబర్‌-2, మూడో ఫ్లోర్, నందలాల్‌ మేన్షన్, షేక్‌ మెమన్‌ వీధి, ఎంజే మార్కెట్, ముంబయి చిరునామాతో రిజిస్టరై ఉంది. దీని ఖాతాల్లోకి డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి ముడుపుల సొమ్ము జమయ్యాయి. అక్కడి నుంచి పలు డొల్ల కంపెనీల్లోకి మళ్లింది.
  • క్రిపాటి ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే మరో కంపెనీనందలాల్‌ మేన్షన్, షేక్‌ మెమన్‌ వీధి, చంపాగలీ, ఎంజే మార్కెట్, ముంబయి చిరునామాతో రిజిస్టరైంది. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీలు ముడుపుల సొమ్మును దీని ఖాతాల్లో జమ చేశాయి. ఆ డబ్బును ట్రిఫ్ఫెర్‌ ఎంటర్‌ప్రైజెస్, న్యూమోంట్‌ గోల్డ్‌ అండ్‌ జ్యూయలరీ, మలిష్క గోల్డ్‌ అండ్‌ జ్యూయలరీ ప్రైవేట్‌ లిమిటెడ్, విక్సో ఎంటర్‌ప్రైజెస్, లావిష్‌ ఎంటర్‌ప్రైజెస్, ప్రయాగ్‌ కార్పొరేషన్‌ అనే డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించి చివరిగా అంతిమ లబ్ధిదారుకు చేర్చారు.
  • ట్రిఫ్ఫెర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, న్యూమోంట్‌ గోల్డ్‌ అండ్‌ జ్యూయలరీ ప్రైవేట్‌ లిమిటెడ్, కీరాజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా షేక్‌ మెమన్‌ వీధి, చంపాగలీ, ఎంజే మార్కెట్, ముంబయి చిరునామాతోనే రిజిస్టరయ్యాయి. వీటన్నింటికీ ఎస్‌ బ్యాంకులోనే ఖాతాలున్నాయి. న్యూమోంట్‌ గోల్డ్‌ అండ్‌ జ్యూయలరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రిజిస్టర్డ్‌ చిరునామాకు సిట్‌ అధికారులు వెళ్లి పరిశీలించగా అక్కడ టైనా ఎక్స్‌పోర్ట్స్‌ నడుస్తోంది. సియా ట్రేడింగ్, ఆస్తా ఎంటర్‌ప్రైజెస్, చందన్‌ ట్రేడింగ్‌ వంటి కంపెనీలేవీ ఉనికిలో లేవు. ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే వీటిని నెలకొల్పారు.

విదేశాల్లోని ఖాతాలకు తరలింపు : ముడుపుల సొమ్మును డొల్ల కంపెనీల ద్వారా కల్పిత సంస్థల్లోకి మళ్లించుకుని చివరిగా అంతిమ లబ్ధిదారుకు చేర్చేందుకు వైఎస్సార్సీపీ మద్యం ముఠా ఇలాంటి హవాలా మార్గాలను ఎంచుకుంది. హవాలా ఏజెంట్లు, నిధుల రూటింగ్, లేయరింగ్‌లో ఆరితేరిన వారిని అడ్డం పెట్టుకుని డొల్ల కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడింది. ఈ సొత్తులో ఎక్కువ భాగం విదేశాల్లోని ఖాతాలకు తరలించిందని సిట్‌ గుర్తించింది.

వైఎస్సార్సీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, లీలా డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు ముఖ్యమైనవి. 2019-2024 మధ్య ఏపీఎస్​బీసీఎల్ వీటికి వరుసగా రూ.732 కోట్లు, రూ.1,569.52 కోట్లు చెల్లించింది. నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సినదాంట్లో కొంత మొత్తాల్ని ఈ సంస్థలు పలు డొల్ల కంపెనీల ద్వారా అందజేశాయి.

లిక్కర్ స్కాంలో వేళ్లన్నీ ఆ 'మాస్టర్ ​మైండ్' వైపే!

వైఎస్సార్సీపీ గాయాలు - 'కల్తీ మద్యం' మరణ మృదంగానికి వీధినపడ్డ 25 కుటుంబాలు

Last Updated : June 25, 2025 at 8:02 AM IST