ETV Bharat / state

వైఎస్సార్సీపీలో చేరుతావా, చస్తావా??- ఎస్సై వేధింపులు తాళలేక మత్స్యకారుడు బలవన్మరణం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 7:00 AM IST

SI Harassment Fisherman Dead: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారి పోలీసు అధికారినన్న ఇంగితజ్ఞానాన్ని మరిచి వేధింపులకు పాల్పడటంతో ఓ మత్స్యకారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు.

SI_Harassment_Fisherman_Dead
SI_Harassment_Fisherman_Dead

SI Harassment Fisherman Dead: ఆయనో ఎస్సై.. పోలీసు అధికారినన్న ఇంగితజ్ఞానం మరిచి వైఎస్సార్సీపీ కార్యకర్తలా మారారు. టీడీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయించి వాటిని అడ్డు పెట్టుకొని వారిని వైఎస్సార్సీపీలో చేరతారా.. లేకుంటే చస్తారా అంటూ వేధించడం ఆయనకు నిత్యకృత్యం. ఆ ఎస్సై దాష్టీకానికి ఓ నిరుపేద మత్స్యకారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ దారుణం రాష్ట్రంలోని మరో చంబల్‌ లోయగా, అరాచకానికి అడ్డాగా మారిన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగింది.

మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం బంగారుపెంట తండాకు చెందిన మత్స్యకారులు దశాబ్దాల కిందట విశాఖ నుంచి వలసొచ్చారు. నదిలో చేపల వేట సాగిస్తూ, జీవనం సాగించే వీరికి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ఆ పార్టీ నాయకులు కొందరు తెలంగాణ మద్యాన్ని ఏపీలోకి తీసుకొస్తూ వీరి బోట్లు ఎక్కుతున్నారు. నిరాకరిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసులు, సెబ్‌ అధికారులు దాడులు చేసినప్పుడు మద్యం అక్రమ రవాణా చేస్తున్న అధికార పార్టీకి చెందిన వారిని తప్పించి బోట్లు నడుపుతున్న మత్స్యకారులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు.

Harassment: 'నేను పోలీసు.. నీవు ఒంటరిదానివి'.. అదనపు కట్నం కోసం ఎస్సై వేధింపులు

ఇదే తరహాలో వెల్దుర్తి పోలీసులు మత్స్యకారుడు దుర్గారావుపై నెల క్రితం కేసు నమోదు చేశారు. ఆయన హైకోర్టును ఆశ్రయించి బెయిల్‌ తెచ్చుకున్నారు. అయినా సరే ఎస్సై శ్రీహరి నుంచి వేధింపులు ఆగలేదు. దుర్గారావును పదే పదే స్టేషన్‌కు పిలిపించి, టీడీపీను వీడి వైఎస్సార్సీపీలో చేరాలని ఒత్తిడి చేసేవారని, లేదంటే తనకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని ఫోన్‌చేసి వేధిస్తుండేవారని బాధితుడి కుటుంబీకులు వాపోయారు. వైఎస్సార్సీపీలో చేరలేదన్న కోపంతో వేధించేవారని, ఆ బాధలు భరించలేకే దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.

హైకోర్టు నుంచి బెయిల్‌ పొందిన దుర్గారావు ఆదివారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సి ఉందని మత్స్యకారులు తెలిపారు. అక్కడికి వెళ్తే ఎస్సై శ్రీహరి చిత్రహింసలకు గురిచేస్తారన్న భయంతో చేపల వేటకు వెళ్లాడని చెప్పారు. బోటులో నది మధ్యలోకి వెళ్లి.. వల తీగలను మెడకు చుట్టుకొని, ఉరేసుకుని నదిలోకి దూకాడని తెలిపారు. దుర్గారావును రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దుర్గారావు మృతదేహంతో వెల్దుర్తి పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వెళ్లిన మత్స్యకారులు స్టేషన్‌ వద్ద జాతీయ రహదారిపై మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. ఎస్సై వేధింపుల వల్లే దుర్గారావు చనిపోయారని.. న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలుగుదేశం మాచర్ల ఇన్‌ఛార్జ్‌ బ్రహ్మారెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఘటనా స్థలికి చేరుకున్న గురజాల డీఎస్పీ పల్లపురాజు.. మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోవాలని.. ధర్నా చేయొద్దంటూ సముదాయించారు. 2 గంటలపాటు నిరసన తెలిపిన తర్వాత మత్స్యకారులు అక్కడ నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లారు.

యువకుడిపై పోలీసు అత్యాచారం.. ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.