ETV Bharat / state

కోటి రూపాయలకు వ్యాపారి టోకరా - లబోదిబోమంటున్న మిర్చి రైతులు - Merchant Cheated Mirchi Farmers

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 3:45 PM IST

Merchant Cheated Mirchi Farmers: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొళ్లికూళ్ల, వెంకటాపురం మిర్చి రైతులకు సుమారు కోటి రూపాయలు డబ్బులు ఇవ్వకుండా ఓ మిర్చి వ్యాపారి ఉడాయించాడు. రెండు గ్రామల్లోని 51 మంది రైతుల నుంచి కంచికచర్లకు చెందిన మిర్చి వ్యాపారి సుమారు కోటి రూపాయలు విలువైన మిరప పంటను కొనుగోలు చేశారు. నెల రోజులుగా డబ్బులు ఇవ్వకుండా తిప్పుకున్నారు. వ్యాపారి ఇంటికి వెళ్లగా పరారైనట్లు తెలియడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

Merchant Cheated Mirchi Farmers
Merchant Cheated Mirchi Farmers (ETV Bharat)

Merchant Cheated Mirchi Farmers: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట రైతులకు మిర్చి వ్యాపారి కోటి రూపాయల టోకరా పెట్టాడు. దీంతో రెండు గ్రామాల రైతులు లబోదిబోమంటున్నారు. వరుస తెగుళ్లతో గడిచిన మూడేళ్లుగా మిర్చి రైతులు నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది కూడా అరకొరగా వచ్చిన దిగుబడులతో పెట్టుబడులకు చేసిన అప్పులు తీరక అన్నదాతలు మరింత అప్పుల్లో కూరుకుపోయారు. ఇలాంటి తరుణంలో పెనుగంచిప్రోలు మండలం కొళ్లికూళ్ల, వెంకటాపురం గ్రామాలకు చెందిన రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసిన వ్యాపారి రైతులకు సుమారు కోటి రూపాయలు టోకరా పెట్టి పారిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

అందినచోట అప్పులు చేసి ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటంతా వ్యాపారి దోచేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రెండు గ్రామాలకు చెందిన సుమారు 51 మంది రైతుల నుంచి కంచికచర్లకు చెందిన మిర్చి వ్యాపారి మిర్చి కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించి రైతులకు రూ. 97 లక్షలు చెల్లించాల్సి ఉంది. నెల రోజుల వాయిదా పద్ధతిలో కొనుగోలు చేసి నెలల తరబడి రైతులను తిప్పుకున్నారు. విసుగు చెందిన రైతులు కంచికచర్లలోని వ్యాపారి ఇంటికి వెళ్లగా ఐపీ నోటీసు దాఖలు చేసి పరారైనట్లు రైతులు గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. అయిదు రోజుల క్రితం పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లో వ్యాపారిపై కేసు పెట్టారు. కలెక్టర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

కోటి రూపాయలకు వ్యాపారి టోకరా - లబోదిబోమంటున్న మిర్చి రైతులు (ETV Bharat)

పండుఈగతో మామిడి రైతుకు నష్టం - ఎరువులపై సబ్సిడీ ఇవ్వని ప్రభుత్వం - Loss Money to Mango Farmers

"గత 15 సంవత్సరాలుగా నరసారావు అనే వ్యక్తికి మిర్చి, పసుపు, పత్తి పంటను ఇస్తున్నాము. అదే నమ్మకంతో ఈ సారి మిర్చి ఇచ్చాము. 51 మంది రైతులకు దాదాపు 90 లక్షల రూపాయలకుపైగా ఇవ్వాలి. వాటిని ఇవ్వకుండా చాలా రోజులుగా తిప్పినాడు. కొన్ని రోజులు ఎలక్షన్ కోడ్ అన్నారు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. విత్తనాలు కొలుగోలు చేయడానికి కూడా డబ్బులు లేవు. అధికారులు స్పందించి మా డబ్బులు ఇప్పించకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఉంది". - నరసింహారావు, బాధిత రైతు

"మార్చి నెలలో వెంకట నరసారావు అనే వ్యక్తి మా దగ్గర నుంచి మిర్చి కొనుగోలు చేశారు. డబ్బులు ఇమ్మని అంటే వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఈ లోపు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తరువాత ఇస్తాను అన్నారు. ఎలక్షన్ అయిన తరువాత వ్యాపారి ఇంటికి వెళ్తే అక్కడ ఎవరూ లేరు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి ఉంది. కాబట్టి ప్రభుత్వ ఏదైనా చర్యలు తీసుకుని ఇటువంటి వారిని కఠినంగా శిక్షించి, మా డబ్బులు మాకు ఇప్పించాలని కోరుతున్నాము". - చంద్రశేఖర్, బాధిత రైతు

తారుమారైన కోనసీమ కొబ్బరి పరిస్థితులు - ధరల పతనంతో రైతన్న కుదేలు - Coconut Prices Fall in ap

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.