ETV Bharat / state

మా బాధలు పట్టవా ! - కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఆవేదన - Kidney Patients Problems

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2024, 12:54 PM IST

Kidney Patients Facing Problems in Srikakulam GGH : సిక్కోలు జీజీహెచ్‌లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం నిర్వహించే డయాలసిస్ కేంద్రాల నిర్వహణ లోపం రోగులకు శాపంగా మారింది. ఓ వైపు ఊపిరి తీసుకునేందుకు డయాలసిస్ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఏసీలు, ఫ్యాన్లు పని చేయడం లేదు. నెఫ్రోప్లస్ ఏజెన్సీ కింద పని చేస్తున్న సిబ్బంది తీరుతో రోగులు ఆర్థికంగానూ నష్టపోతున్నారు. మరోవైపు ఉచితంగా ఇవ్వాల్సిన ఇంజక్షన్లు సైతం రోగులనే తెచ్చుకోవాలంటున్నారు. దీంతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కష్టాలు మరింత రెట్టింపు అవుతున్నాయి.

Dialysis Patients Suffering in Srikakulam GGH
Dialysis Patients Suffering in Srikakulam GGH (ETV Bharat)

డయాలసిస్‌ రోగుల బాధలు పట్టవా? - సిక్కోలు జీజీహెచ్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు (ETV Bharat)

Kidney Patients Facing Problems in Srikakulam GGH : కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం నిర్వహించే డయాలసిస్ కేంద్రాలు నిర్వహణ లోపంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. డయాలసిస్ రోగులు ఊపిరి తీసుకోవడానికి ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఏసీలు, ఫ్యాన్లు పని చేయకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. మరోవైపు సిబ్బంది తీరుతో రోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంజక్షన్​ల నిల్వలు ఉన్నప్పటికీ డయాలసిస్ రోగులే ఇంజక్షన్లు కొంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. సిక్కోలు జీజీహెచ్ లో ఉన్న డయాలసిస్ కేంద్రంలో రోగులు పడుతున్న ఇబ్బందులపై 'ఈటీవీ భారత్ - ఈనాడు' పరిశీలనలో అనేక వాస్తవాలు బయటపడ్డాయి.

అక్కడి వెళ్తే కొత్త రోగాలు​! ఆందోళనలో బాధితులు - Patients problems in nellore GGH

సిక్కోలు జీజీహెచ్‌ డయాలసిస్ కేంద్రంలో నిర్వహణ లోపం : శ్రీకాకుళం జిల్లాకే పెద్దదిక్కైన ప్రభుత్వ సర్వజనాసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం నిర్వహణ లోపంతో రోగులు అవస్థలు పడుతున్నారు. కిడ్నీలు పాడైన వ్యక్తికి డయాలసిస్ చేసేటపుడు నాలుగు గంటలు సంబంధిత యంత్రాల వద్ద ఉండాలి. కానీ ఇక్కడ ఏసీలు, ఫ్యాన్లు పనిచేయక ఉక్కపోతను భరిస్తూనే రోగులు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. ఆసుపత్రి అధికారులు, డయాలసిస్‌ కేంద్రం నిర్వహిస్తున్న నెఫ్రోప్లస్ సిబ్బందికి సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్టాక్‌ ఉన్నా ఇంజక్షన్లను బైట నుంచి తెచ్చుకోమంటున్న సిబ్బంది : ఈ డయాలసిస్ విభాగంలో 19 డయాలసిస్ చేసే యంత్రాలు ఉన్నాయి. రోజుకి 60 మందికి పైబడి డయాలసిస్ చేస్తుంటారు. అయితే డయాలసిస్‌ కేంద్రం సిబ్బంది తీరుతో రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రక్తవృద్ధి కోసం రోగులకు ఎరిత్రోపాటిన్‌ ఇంజక్షన్లు సర్వజనాసుపత్రిలోని సెంట్రల్ డ్రగ్‌ స్టోర్సు నుంచి తెప్పించి నెఫ్రోప్లస్‌ సిబ్బంది ఉచితంగా ఇవ్వాలి. కానీ వాస్తవానికి నెఫ్రోప్లస్‌ సిబ్బంది అసలు ఇండెంట్‌ పెట్టలేదు. డయాలసిస్‌ కోసం వచ్చే తమతో మూడు నెలలుగా రూ.1,936 రూపాయల ఖరీదు చేసే ఇంజక్షన్‌ కొనిపిస్తున్నారని రోగులు వాపోయారు. ఉచితంగా ఇవ్వాల్సిన ఇంజక్షన్లను కొనమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

నేను మూడు నెలలుగా ఆసుపత్రికి వస్తున్నాను. ప్రతిసారి ఇంజెక్షన్‌ బయటే కొంటున్నాను. పేదలకు ఇంత ఖరీదైనా ఇంజెక్షన్‌ కొనడం ఎలా సాధ్యం. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఇవ్వడం లేదని తెలిసింది. ఇది సరి కాదు. -టి.శ్రీనివాసరావు, గార

డయాలసిస్‌ కోసం వచ్చేవారు ఇంజెక్షన్లు బయట నుంచి తెచ్చుకోవాలని చెప్పడం సరికాదు. ఆర్థిక భారం అవుతోంది. మా లాంటి పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంజెక్షన్లు, మందులు ఉచితంగానే ఇవ్వాలి. -ఎస్‌.రామారావు, రణస్థలం

"డయాలసిస్‌ కేంద్రంలో మూడు నెలలుగా ఇంజక్షన్లు ఇవ్వకపోవడాన్ని 'ఈటీవీ భారత్ - ఈనాడు' ద్వారా నా దృష్టికి వచ్చింది. వెంటనే ఈ విషయంపై ఉన్నతాధికారులను పంపి ఆరా తీయగా నెఫ్రోప్లస్‌ ఏజెన్సీ సిబ్బంది ఇండెంట్‌ పెట్టలేదని తేలింది. స్టాక్‌ ఉన్నా ఇండెంట్‌ పెట్టని సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం." - డాక్టర్‌ రమేష్‌ నాయుడు, డిప్యూటీ ఆర్ఎంవో, జీజీహెచ్‌

జీజీహెచ్‌లోని అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి : జీజీహెచ్‌లో జరుగుతున్న అక్రమాలపై అధికాలు సమగ్రమైన విచారణ జరిపించాలని డయాలసిస్ రోగులు కొరుకుంటున్నాను. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని విధుల నుంచి తొలగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఉచితంగా ఇంజక్షన్లు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు డయాలసిస్‌ కేంద్రాల నిర్వహణ లోపాల్ని సరిదిద్దాలని రోగులు కోరుతున్నారు.

'గుంటూరు మరణాల'పై వాస్తవాలు ముందుంచండి - న్యాయసేవాధికార సంస్థను ఆదేశించిన హైకోర్టు

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మహాప్రస్థానం వాహనాల కొరత - మృతదేహాల తరలింపునకు ఇక్కట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.