ETV Bharat / state

వర్షాకాలం వస్తోందంటేనే వణుకు- బుగ్గవంక రక్షణగోడకు మోక్షం ఎప్పుడో? - KADAPA BUGGAVANKA

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 11:30 AM IST

Kadapa Buggavanka Wall Construction Incomplete: వర్షాకాలం వస్తుందంటేనే కడప నగర వాసుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎపుడు ఏ వరద నగరాన్ని ముంచెత్తుతుందోననే ఆందోళన వారిని వెంటాడుతూనే ఉంది. 2001, 2019లో కడప బుగ్గవంకను పోటెత్తిన వరద బీభత్సం కడప వాసులను కోలుకోలేని దెబ్బ తీసింది. నాటి చేదు జ్ఞాపకాలు నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. జూన్ నుంచి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరికలతో ఈ ప్రాంత వాసులు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు. మూడేళ్ల నుంచి పాలకులు బుగ్గవంక రక్షణ గోడలు నిర్మించడంలోనే కాలయాపన చేస్తున్నారు తప్పితే పూర్తిస్థాయిలో వరద ముంపు నుంచి పరివాహక ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించలేక పోతున్నారనే విమర్శలు ఉన్నాయి.

Kadapa Buggavanka Wall Construction Incomplete
Kadapa Buggavanka Wall Construction Incomplete (ETV Bharat)

Kadapa Buggavanka Wall Construction Incomplete : కడప బుగ్గవంక ఈ పేరు వినగానే 2001 సెప్టెంబరులో నగరాన్ని ముంచెత్తిన వరదలే గుర్తుకు వస్తాయి. అందరూ నిద్రిస్తున్న సమయంలో వచ్చిన ఈ వరద పదుల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. దాంతో పాటు కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఎందరో జీవితాలు రోడ్డునపడ్డాయి. ఆ చేదు జ్ఞాపకాలు 18 ఏళ్ల తర్వాత మరోసారి ప్రజలను కకావికలం చేసింది. 2019 నవంబర్​లో మరోసారి కడప బుగ్గవంకకు భారీ వరద పోటెత్తింది. ఈసారి ప్రజలు ప్రాణాలు కాపాడుకున్నారు గానీ భారీగా ఆస్థి నష్టం సంభవించింది. వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. తిండిగింజలు సైతం వరదలో కొట్టుకు పోయి కట్టుబట్టలతో మిగిలిన దీన స్థితి ఐదేళ్ల కిందట సంభవించింది. దాంతో తేరుకున్న పాలకులు వెంటనే బుగ్గవంకకు రక్షణ గోడలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.

బుగ్గవంకకు రక్షణ గోడలు లేక.. పొంచి ఉన్న పెనుముప్పు

వర్షాకాలం వస్తోందంటేనే వణుకు- బుగ్గవంక రక్షణగోడకు మోక్షం ఎప్పుడో? (ETV Bharat)

కడప నగరంలోని రవీంద్రనగర్, నాగరాజుపేట, గుర్రాలగడ్డ, వినాయకనగర్ ప్రాంతాల్లోని బుగ్గవంక పరివాహక ప్రాంతాల్లో వంకకు రెండు వైపుల నాలుగు కిలోమీటర్లు రక్షణ గోడల నిర్మాణం మూడేళ్ల కిందట చేపట్టినా నేటికి అసంపూర్తిగానే ఉంది. బుగ్గవంక సుందరీకరణ పేరుతో 80 కోట్ల రూపాయలు పైగానే అంచనాలు వేసి పనులు చేపట్టినా ఇంకా పూర్తి కాలేదు. రక్షణ గోడల నిర్మాణం కోసం వంకకు ఇరువైపుల ఉన్న దాదాపు 300 మంది ఇళ్లను నేలమట్టం చేశారు. వారందరికీ ప్రభుత్వ స్థలంలో ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పినా కొండలు, గుట్టల్లో స్థళాలు చూపించడంతో చాలామంది అక్కడికి వెళ్లలేక అద్దె ఇళ్లలో తలదాచుకుంటున్నారు.

People Demand for Buggavanka Bridge రక్షణ గోడ కట్టారు.. ప్రయాణించే వంతెన నిర్మించడం మరిచారు

రవీంద్రనగర్ నుంచి కడప నగరంలోకి రావాలంటే బుగ్గవంక మీద వంతెన నిర్మించడానికి ఏడాది కిందట సీఎం జగన్ 20 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. కానీ నేటికీ పనులు మొదలు కాలేదు. ఫలితంగా రవీంద్రనగర్ వాసులు ఏడాది పాటు బుగ్గవంక మురుగు కాల్వ గొట్టం నుంచి రాకపోకలు సాగిస్తుండగా ఇపుడు దాన్ని కూడా మూసివేశారు. చుట్టూ రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ కడప పాత బస్టాండుకు చేరుకోవాల్సిన పరిస్థితి రవీంద్రనగర్ వాసులది. కాగితాలపెంట వద్ద రక్షణగోడ నిర్మించలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వంకకు భారీ వరద వస్తే కాగితాల పెంటలోకి వస్తుందని వాపోతున్నారు. పాలకులు కేవలం హామీలకే పరిమితం అవుతున్నారు తప్పితే శాశ్వత చర్యలను త్వరితగతిన పూర్తి చేయలేక పోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప నగరాన్ని కూడా అభివృద్ధి చేసుకోలేక పోయారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. బుగ్గవంక సైతం సమస్యల నిలయంగా మారిందని స్థానికులు అంటున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చే నూతన ప్రభుత్వం అయినా బుగ్గవంక సమస్యను తీర్చాలని నగరవాసులు కోరుతున్నారు.

Krishna Lanka Poor people House Sites Issue ఎన్నికలకు ముందు ఇళ్ల పట్టాలు ఇస్తామన్న వైసీపీ నేతలు.. అధికారం వచ్చాక హామీలను మరిచారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.