CEO Meena Said Employees Used Postal Ballot Voting in ap : రాష్ట్రవ్యాప్తంగా 4,44,216 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా (CEO Mukesh Kumar Meena) స్పష్టం చేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ 6 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగిందని తెలిపారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో అత్యధికంగా 22 వేల 650 పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్, అత్యల్పంగా అమలాపురం పార్లమెంటు పరిధిలో 14,526 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయని తెలిపారు. పోలైన పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నామని మీనా పేర్కొన్నారు. డీబీటీ పథకాలకు నిధుల విడుదలపై సీఎస్ వివరణ ఇచ్చారని సీఈఓ మీనా తెలిపారు.
14 నియోజకవర్గాల్లో వందశాతం వెబ్ క్యాస్టింగ్ నిర్వహించాలని నిర్ణయించామని మీనా అన్నారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు సహా ఇంకొన్ని చోట్ల వెబ్ క్యాస్టింగ్ చేసేందుకు ఆయా జిల్లాల అధికారులు నిర్ణయించారని వివరించారు. అన్ని సౌకర్యాలతో ఉండేలా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో 28 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నాకు. పల్నాడు సహా అన్ని సున్నితమైన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో రెండేసి చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మీనా స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రం లోపలా, వెలుపలా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సీఈఓ కార్యాలయంతో పాటు జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్ల ద్వారా పోలింగ్ తీరును పర్యవేక్షించనున్నట్లు సీఈఓ మీనా పేర్కొన్నారు.