ETV Bharat / state

విజిలెన్స్‌కు విస్తృతాధికారాలు ఎలా ఇస్తారు: హైకోర్టు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 8:44 AM IST

wide powers to Vigilance functions
wide powers to Vigilance functions

wide powers to Vigilance functions: విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్​ అధికారాలకు సంబంధించి నారా లోకేశ్ వేసిన పిటీషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. గెజిడెడ్ అధికారులకు అపరిమిత అధికారాలు కల్పించాలని కోరడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పదమూడు చట్టాలపై అధికారాలు కల్పించాలని ఐజీ కోరడం ఏమిటని ప్రశ్నించింది. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది.

విజిలెన్స్‌కు విస్తృతాధికారాలు ఎలా ఇస్తారు: హైకోర్టు

wide powers to Vigilance functions: విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్​లో పనిచేస్తున్న గెజిటెడ్ అధికారులందరికి అపరిమిత అధికారాలు కల్పించాలని కోరుతూ ఆశాఖ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) కొల్లి రఘురామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖను హైకోర్టు ప్రాథమికంగా ఆక్షేపించింది. చట్టబద్ధంగా కల్పించాల్సిన అధికారాలను కార్యనిర్వాహక ఉత్తర్వులు ద్వారా దఖలు పరచడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. ఐజీ అభ్యర్ధన మేరకు విస్తృతాధికారాలు కల్పించడం ఏవిధంగా సాధ్యం అని వ్యాఖ్యానించింది. పదమూడు చట్టాలపై అధికారాలు కల్పించాలని ఐజీ కోరడం ఏమిటని ప్రశ్నించింది. ఆయా చట్టాల అమలుకు ఇప్పటికే అధికార యంత్రాంగం ఉందని గుర్తుచేసింది. ఐజీ అభ్యర్ధన ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని గుర్తుచేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు.

చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలి: రాష్ట్రంలోని ఏ కార్యాలయాల్లోనైనా ప్రవేశించి తనిఖీలు, జప్తులు, రికార్డుల సీజ్, సమాచార సేకరణ, తదితర విషయాల్లో విస్తృతాధికారాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 5న లేఖ రాశారు. ఈ లేఖను సవాలు చేస్తూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. లేఖ ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ తీసుకున్న చర్యలను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ఎన్నికల వేళ టీడీపీ నాయకులు, మద్దతుదారులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకునేందుకు, తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్కు అధికారాన్ని కట్టబెట్టాలని కోరుతున్నారన్నారు.
విజిలెన్స్ అధికారుల వేధింపులు.. కడపలో నూనె మిల్లు యజమాని ఆత్మహత్య



వ్యాపారాలను లక్ష్యంగా చేసుకునేందు: శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మరళీధరరావు వాదనలు వినిపించారు. 13 చట్టాలపై అధికారాలను కల్పించాలని ఐజీ లేఖ రాశారన్నారు. విచారణాధికారాలు, క్రమశిక్షణాధికారాలు రెండు తనకే దఖలు పరచాలని కోరుతున్నారన్నారు. సోదాలు చేస్తాను అధికారం కల్పించండి అని దిగువస్థాయి అధికారి పై అధికారిని (ప్రభుత్వాన్ని కోరడానికి వీల్లేదన్నారు. ఏపీ జీఎస్టీ, వ్యాట్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, గనులు తదితర చట్టాలను అమలు చేసేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం ఉందన్నారు. ఎన్నికల వేళ ప్రతిపక్షపార్టీలకు చెందిన నేతలు, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకునేందు అపరిమిత అధికారాలను కోరారన్నారు. ప్రైవేటు వ్యక్తులు, వారి వ్యాపారాల్లో జోక్యం చేసుకునే అధికారం విజిలెన్స్కు ఉండదన్నారు.
RTC Employees Bills Peding: లంచం ఇస్తే సరి.. లేకుంటే నెలల తరబడి వేచి చూడాల్సిందే



ఎప్పుడైనా ఉత్తర్వులు రావొచ్చు: ప్రభుత్వశాఖల్లో జరిగే అవకతవకలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ విచారణలు చేసి శాఖాధిపతులకు నివేదిక మాత్రమే ఇవ్వగలదన్నారు. ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాల్లో జోక్యం చేసుకును అవకాశం కల్పిస్తే అత్యంత ప్రమాదకరమవుతుందన్నారు. అధికారాలను కట్టబెట్టేందుకు ప్రక్రియ వేగంగా సాగుతోందన్నారు. ఎప్పుడైనా ఉత్తర్వులు రావొచ్చన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు సుమన్, మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ ఐజీ లేఖ మాత్రమే రాశారన్నారు. ఈ వ్యవహారంపై విధానపరమైనన నిర్ణయం తీసుకోవాలని న్యాయశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించిందన్నారు. ఈ నేపథ్యంలో 13 శాఖాధిపతుల సమ్మతి పొందాల్సిన అవసరం ఉందని సీఎస్ పేర్కొన్నారన్నారు. లేఖపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

వైసీపీ వీధిరౌడీల్లా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది - ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ ఘటనపై లోకేశ్ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.