సాగర తీరంలో కొలువైన హెలికాప్టర్ మ్యూజియం - ఇది యుద్ధ కథలెన్నో చెబుతుంది!
విశాఖ సాగర తీరంలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన హెలికాప్టర్ మ్యూజియం - సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2025 at 11:22 PM IST
Helicopter Museum Ready for Inauguration on Visakha: విశాఖ సాగర తీరంలో పర్యాటకులను ఆకర్షించేందుకు మరో ప్రాజెక్టు సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న సబ్‌మెరైన్, యుద్ధవిమానంతో పాటు నేవీలో సుదీర్ఘ కాలం సేవలందించిన 'యుహెచ్3హెచ్' హెలికాప్టర్ నగర వాసులను అలరించనుంది. రాష్ట్రంలోనే మొదటిసారిగా నావికాదళం సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీఎంఆర్డీఏ కుర్సుర, టీయూ 142 యుద్ధ విమానం మ్యూజియాలను నిర్వహిస్తోంది. తాజాగా టీయూ 142 యుద్ధ విమానం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో 'యూహెచ్3హెచ్' హెలికాప్టర్ మ్యూజియం నిర్మించారు.
నావికాదళంలో సేవలందించిన ఈ హెలికాప్టర్ ఎలా పనిచేస్తుంది యుద్ధ సమయాల్లో ఎలాంటి సేవలు అందిస్తుంది ఎలాంటి యుద్ధ పరికరాలను మోసుకెళుతుంది గగనతలంలో అది చేసే విన్యాసాలను ఈ మ్యూజియం ద్వారా సందర్శకులు తెలుసుకోవచ్చు. హెలికాప్టర్‌లో ఉపయోగించిన సామగ్రిని కూడా ప్రదర్శనకు ఉంచారు. ఇందులో ఇంజిన్‌తో పాటు అత్యవసర సమయంలో ఉపయోగించే స్ట్రెచర్, నావికాదళ సిబ్బంది నీటిలో దిగే సమయంలో ఉపయోగించే రబ్బర్ బోటు, తదితర సామగ్రి ఇందులో ఉన్నాయి.
ఒక వేళ నావికాదళ సిబ్బంది ప్రమాదం బారిన పడితే వారిని రక్షించేందుకు ఉపయోగించే వస్తువులను కూడా ప్రదర్శనకు ఉంచారు. ఆవరణలో ఆకర్షణీయమైన మొక్కలు ఏర్పాటు చేశారు. బయట ల్యాండ్ స్కేపింగ్‌ను తీర్చిదిద్దారు. వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్‌గోపాల్, కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్ మ్యూజియం పనులను నిత్యం పర్యవేక్షించడంతో పనులు శతశాతం పూర్తయ్యాయి. త్వరలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

