ETV Bharat / state

ఈసీ ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వం - పింఛన్​ కోసం అవ్వాతాతలు ఇబ్బందులు - Pension Problems in ap

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 8:26 PM IST

Pension Distribution Issue in AP : ప్రభుత్వ నిర్లక్ష్యానికి సామాజిక పింఛన్‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసీ సూచనల మేరకు సచివాలయాల వద్ద పింఛన్‌ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా పింఛన్ల కోసం వచ్చిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Pension_Distribution_Issue_in_AP
Pension_Distribution_Issue_in_AP

ఈసీ ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వం - పింఛన్​ కోసం అవ్వాతాతలు ఇబ్బందులు

Pension Distribution Issue in AP : రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే పింఛన్ దారులకు అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో అవ్వా, తాతలు, దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇంటివద్దకే వెళ్లి పింఛన్‌ సొమ్మును అందజేయాలన్న ఆదేశాలు ఎక్కడా అమలు చేయలేదు. ఫలితంగా వారంతా సచివాలయాల వద్దకు వచ్చి అవస్థలు పడ్డారు.

చివరికి అనుకున్నదే సాధించారు - అవ్వాతాతలను ఎండలో నిలబెట్టారు!

ఉదయం 9 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉన్నా బ్యాంకు నుంచి ఇంకా సొమ్ము తమ చేతికి రాలేదని మధ్యాహ్నం రావాల్సిందిగా చాలామందిని సచివాలయ సిబ్బంది వెనక్కి పంపారు. మరికొన్నిచోట్ల గంటల తరబడి వేచిచూసేలా చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ, కంచికచర్ల సచివాలయాల వద్ద కనీసం ఎండ నుంచి రక్షణకు టెంట్లు కూడా ఏర్పాటు చేయలేదు.

బ్యాంకు నుంచి డబ్బులు జమ కాలేదు : కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గ్రామ సచివాలయాల వద్ద కనీసం సమాచారం ఇచ్చేవారు కరవయ్యారు. వృద్ధుల కోసం కనీసం తాగునీరు ఏర్పాటు చేయలేదు. దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు ఇళ్ల వద్దే పింఛన్ పంపిణీ చేయాల్సి ఉండగా వారికి సమాచారం ఇవ్వకపోవడంతో వారంతా సచివాలయాలకు చేరుకుని పడిగాపులు కాశారు. మొవ్వ సచివాలయంలో పై అంతస్తులో పింఛన్లు ఇవ్వడంతో వృద్ధులు మెట్లు ఎక్కి పైకిరాలేక ఇబ్బందిపడ్డారు. పింఛన్ల పంపిణీకి కింద ఏర్పాట్లు చేయాలన్న కనీస అవగాహన అధికారులకు లేదు. గుంటూరు జిల్లాలో మధ్యాహ్నం వరకు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం సొమ్ముల జమ చేయలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా బ్యాంకుల్లోనూ నగదు అందుబాటులో లేకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి.

పింఛన్‌దారులను ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతుంది. సచివాలయాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయకపోగా బ్యాంకు నుంచి డబ్బులు రాలేదంటూ తిప్పిపంపుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ల సొమ్ము ఖాతాల్లో వేయాల్సిన ప్రభుత్వం ఎందుకు జమచేయలేదు.ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టలేదు. ఉదయాన్నే సచివాలయాల వద్దకు రావాలని సమాచారం ఇచ్చి ఇప్పుడు నగదు లేదని చెప్పడమేంటో అర్థం కావటం లేదు. - పింఛన్ లబ్ధిదారులు, అనంతపురం జిల్లా

ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయకపోవడం వల్ల పింఛన్‌దారులందరికి చెల్లింపులు నిలిచిపోయాయి. లబ్ధిదారులకు కనీస సమాచారం ఇవ్వలేదు. దీంతో ఉదయం నుంచి సచివాలయాల వద్ద చేరుకుని ఎదురుచూస్తున్నాం. ప్రతినెలా 31న బ్యాంకులో డబ్బులు జమ చేసే ప్రభుత్వం ఈసారి కావాలనే 3వ తేదీ వచ్చినా జమ చేయటం లేదు. - పింఛన్ లబ్ధిదారులు, అల్లూరి జిల్లా

పింఛన్ల కోసం పడిగాపులు : వృద్ధులకు, నడవలేని స్థితిలో ఉన్నవారికి, దివ్యాంగులకు ఇళ్లవద్దకే వెళ్లి పింఛన్‌ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా ప్రకాశం జిల్లాలో అలాంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదు. కనీసం బ్యాంకులో సొమ్ము జమ కాలేదని పింఛన్‌దారులకు ముందస్తుగా చెప్పకపోవడంతో వారంతా సచివాలయాల వద్దకు చేరుకుని ఇబ్బందులు పడ్డారు.

వైఎస్సార్సీపీ కుట్ర - వృద్దులను మంచాలపై తీసుకువస్తూ టీడీపీపై విషప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.