ETV Bharat / state

రాష్ట్రంలో సగానికి తగ్గిన తెల్ల బంగారం సాగు - సహకరించని ప్రకృతి, ఆదుకోని పాలకులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 1:23 PM IST

Updated : Jan 31, 2024, 1:39 PM IST

cotton_cultivation
cotton_cultivation

Cotton Cultivation Area and Yield is Decreasing: అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి! ఆపై నకిలీల ఘాటు! పంట చేతికందాక దళారుల పోటు! అందుకే ఆంధ్రప్రదేశ్‌లో పత్తి సాగు విస్తీర్ణం, దిగుబడి ఏటికేడు తగ్గిపోతోంది. దాదాపు సగానికి సగం పడిపోయింది. ఐదేళ్లలో పత్తి రైతుకు కలిసొచ్చిందే లేదు మద్దతుగా ఉండాల్సిన ప్రభుత్వం మొహం చాటేయడంతో పత్తి రైతు చిత్తవుతున్నాడు.

రాష్ట్రంలో సగానికి తగ్గిన తెల్ల బంగారం సాగు - సహకరించని ప్రకృతి, ఆదుకోని పాలకులు

Cotton Cultivation Area and Yield is Decreasing: ఆంధ్రప్రదేశ్‌లో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 16 లక్షల 40 వేల ఎకరాల్లో పత్తి సాగైంది. 25లక్షల 8 వేల బేళ్ల తెల్ల బంగారం ఉత్పత్తి జరిగింది. అదే 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి పత్తి సాగు విస్తీర్ణం 10లక్షల 67వేల ఎకరాలకు పడిపోయింది. దిగుబడి కూడా 11లక్షల 58 వేల బేళ్లు దాటకపోవచ్చని అంచనా. సాధారణ విస్తీర్ణంతో పోల్చితే సాగు విస్తీర్ణం దాదాపు 34 శాతం తగ్గింది. నాలుగేళ్ల క్రితం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6.87లక్షల ఎకరాల్లో పత్తి వేయగా ఈ ఏడాది 2లక్షల 76వేల ఎకరాలకే పరిమితమైంది.

పతనం దిశగా తెల్ల బంగారం ధర - మార్కెట్లలో రైతులకు స్వాగతం పలుకుతున్న సమస్యలు

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లోనూ సాగు గణనీయంగా తగ్గింది. దిగుబడులూ దిగజారుతున్నాయి. అధిక వర్షాలతో పత్తి కాయ కుళ్లిపోయి ఒకేడాది వానల్లేక మరో ఏడాది నష్టాలొస్తున్నాయి. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో వర్షాభావంతో ఎకరాకు సరాసరిన రెండు క్వింటాళ్లు కూడా దక్కలేదు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ పత్తి దిగుబడులు ఎకరాకు నాలుగైదు క్వింటాళ్లకు మించడం లేదు. తగ్గుతున్న దూది దిగుబడులే పత్తి రైతుల దీనావస్థకు దర్పణం పడుతున్నాయి. 2019-20 సంవత్సరంలో ఎకరాకు 259కిలోల దూది వస్తే 2022-23లో అదికాస్తా 149 కిలోలకు పడిపోయింది.

పత్తి చేలల్లో 'పులి' రాకతో పారిపోతున్న వానరాలు - ఫలించిన రైతుల ఆలోచన

పత్తి సాగులో 20ఏళ్ల క్రితం ఎదురైన సంక్షోభ పరిస్థితులే పునరావృతం అవుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2018-19 సంవత్సరంలో ఎకరాకు పెట్టుబడి 25వేలు ఐతే ఇప్పుడు 35వేల రూపాయలకు పెరిగింది. ఇక ఎరువులు, పురుగు మందులు డీజిల్, ఇతర సేద్య ఖర్చులు 40% పెరిగాయి. ఇన్ని సవాళ్ల మధ్య సాగుచేసినా దళారుల దందాలో రైతులు నెట్టుకురాలేక అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు. 20 ఏళ్ల క్రితం హైబ్రిడ్‌ రకాల పత్తి సాగుతో రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పులపాలయ్యారు. ఇప్పుడదే పరిస్థితి మళ్లీ మొదలైంది. గులాబీపురుగు విజృంభించి రైతుల్ని కుంగదీస్తోంది రైతులు నష్టపోతుంటే.. పురుగుమందుల తయారీ సంస్థలు కోట్లు ఆర్జిస్తున్నాయి.

లాభాలొస్తున్నాయని పత్తి సాగుపై మొగ్గు చూపిన రైతన్నలు... అంతలోనే!

ఉమ్మడి కర్నూలు, గుంటూరు, పల్నాడు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో కల్తీ విత్తనాలతో రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారు. పరీక్షలు చేసిన నాణ్యమైన విత్తనాలనే రైతులకు ఇస్తామన్న ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోవడం లేదు. పత్తి రైతుల్ని నకిలీ విత్తనాల వ్యాపారులకు, పురుగుమందుల సంస్థలకు అప్పగించి చోద్యం చూస్తోంది. 2021-22 నుంచి 2023-24 మధ్య 414 విత్తన నమూనాల్ని నాణ్యతలేనివిగా గుర్తించారు. కానీ 157 కేసులే నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలో గులాబీ పురుగుతో నష్టపోయిన రైతులకు అక్కడి ప్రభుత్వాలు గతంలో సాయం అందించాయి. జగన్‌ ప్రభుత్వానికి ఆ ఉదారత కూడా లేకపోయింది. పత్తిపై మార్కెట్‌ రుసుము వసూళ్లు తప్పితే రైతుల్ని ఆదుకుందామనే ఆలోచనే వైసీపీ ప్రభుత్వానికి లేదు. గులాబీ పురుగును తట్టుకుని, అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తన రకాలను అందించే దిశగా పరిశోధనలు కొరవడ్డాయి.

Last Updated :Jan 31, 2024, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.