ETV Bharat / state

మాట తప్పడం, మడమ తిప్పడమే జగన్​ నైజం అంటున్న సిక్కోలువాసులు - PUBLIC FIRE ON CM JAGAN ASSURANCES

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 9:34 AM IST

cm_jagan_visit
cm_jagan_visit

CM Jagan Assurances to Srikakualm District : 'మీ కష్టాలు చూశాను. ఒక్క ఏడాది ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. సమస్యలన్నీ పరిష్కరిస్తాను' జగన్​ మాటలు నమ్మిన సిక్కోలు వాసులు ఒక్క అవకాశం ఇచ్చారు. కానీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ మరిచిపోయారు. పాదయాత్రలో, ముఖ్యమంత్రిగా జిల్లాకు వచ్చినప్పుడు అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని గొప్పలకు పోయారు. ఇక్కడి నేతలు అడిగిందే తడవుగా రూ. కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటనలు చేశారు. అయిదేళ్ల గడిచినా పూర్తి స్థాయిలో నిధులూ ఇవ్వలేదు. ఏ ఒక్క పనీ పూర్తి చేయలేకపోయారు.

సిక్కోలు వాసులపై సీఎం జగన్​ కపట ప్రేమ - అభివృద్ధిలో ఉత్త చేయే

CM Jagan Assurances to Srikakualm District : మాట తప్పను, మడమ తిప్పను అని పదేపదే ఊదరగొట్టే ముఖ్యమంత్రి జగన్‌ శ్రీకాకుళం జిల్లాకు లెక్కకు మిక్కిలి హామీలైతే ఇచ్చారు కానీ ఒక్కదాన్నీ అమలు చేయలేదు. ఐదేళ్లుగా జిల్లాలో ప్రాజెక్టులు పడకేసినా పైసా విదల్చకుండా నిర్లక్ష్యం చేశారు. అభివృద్ధిని అటకెక్కించారు. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా, అదీ ఇదీ అనే భేదం లేకుండా, అన్ని నియోజకవర్గాలకు, అన్ని వర్గాల ప్రజలకు మొండిచేయి చూపిన జగన్‌ నేడు సిక్కోలుకు ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

రూ.10 కోట్లన్నారు, రూపాయి ఇవ్వలేదు : శ్రీకాకుళం వచ్చిన ప్రతి సందర్భంలోనూ జిల్లాపై హామీల వర్షం కురిపించిన జగన్‌ మాటలకే పరిమితమయ్యారు. జిల్లాకు మణిహారంగా నిలిచే కోడి రామ్మూర్తి క్రీడా ప్రాంగణం పూర్తికి రూ. 10 కోట్లు మంజూరు చేస్తామన్న జగన్ హామీ నీటిమూటగానే మిలిగిపోయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంత మేర పనులు జరిగినా వైసీపీ పాలనలో అడుగు ముందుకు పడలేదు. రన్నింగ్ ట్రాక్ కోసం ప్రతిసారీ మట్టివేస్తున్నారు తప్పితే ఎలాంటి పనులు చేయలేదు. జిల్లాలో ఆడుదాం ఆంధ్ర క్రీడలు సైతం కనీస సౌకర్యాలు లేని ప్రదేశాల్లో జరిగాయి. ఒలంపిక్ పతక విజేతను కన్న జిల్లాకు కనీసం క్రీడా ప్రాంగణం లేకుండా పోయింది. దీని నిర్మాణానికి అవసరమైన నిధులకు బటన్ నొక్కే మనసు జగనన్నకు ఎందుకు రాలేదని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు.

"మంత్రి ధర్మాన ప్రసాద్​ కోరిక మేరకు స్టేడియం నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని ఉత్తుత్తి హామీలు ఇచ్చారు. అనంతరం స్టేడియం నిర్మాణం కోసం ఎలాంటి పనులను చేపట్టలేదు. ఎన్నికలు సమీస్తున్న వేళ టెండర్లు పిలిచి స్టేడియం నిర్మాణ పనులు చేపట్టినట్లు కొత్త డ్రామాలకు తెరలేపారు " -సిక్కోలు క్రీడాకారుడు

రహదారిని గాలికొదిలేశారు : శ్రీకాకుళం, ఆమదాలవలస ప్రధాన రహదారి పనులు నిలిచి ఏళ్లు గడిచాయి. దారంతా గుంతలతో ప్రమాదకరంగా తయారైంది. అయిదేళ్లలో 24 మంది మృత్యువాత పడ్డారు. 81 మంది క్షతగాత్రులయ్యారు. ఒప్పందం ప్రకారం రహదారిని 2021 డిసెంబర్ నాటికే పూర్తిచేయాల్సి ఉన్నా రూ.14 కోట్లును గుత్తేదారులకు బకాయిలు విడుదల చేయకపోవడంతో పనులు నిలిపేశారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. సభాపతి తమ్మినేని సీతారాం, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నా కనీసం రహదారి వేయించలేకపోయారని స్థానికులు విమర్శిస్తున్నారు.

జలాశయాల నిర్వహణను పట్టించుకోని జగన్​ - ఐదేళ్లలో తొమ్మిది దుర్ఘటనలు - JAGAN NEGLECTED IRRIGATION PROJECTS

గంగపుత్రులకు పంగనామాలు : సీఎం హోదాలో తొలిసారి శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన జగన్ హార్బర్, జెట్టి నిర్మాణానికి హామీ ఇచ్చారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీదిరి అప్పలరాజు తన సొంత నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మంచినీళ్లపేట హార్బర్‌కు జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేసినా పనులు మాత్రం సాగలేదు. నామమాత్రంగా ప్రహరీ గోడ కట్టి ఆపై గాలికొదిలేశారు. గతేడాది ఏప్రిల్‌లో మూలపేట పోర్టు పనుల శంకుస్థాపన చేసిన జగన్‌ అప్పటి నుంచి వాటిని పట్టించుకోలేదు. బుడగట్లపాలెం హార్బర్ నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన జగన్‌ ఐదేళ్ల పాటు గాలికొదిలేసి ఎన్నికల ముందు పనులు ప్రారంభించారు.

సాగునీటికి సెలవిచ్చేశారు : వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం కింద అదనపు పరిహారం అందజేస్తామని చెప్పిన జగన్​ భూసేకరణ చట్టం పరిహారం కాకుండా ఎకరాకు లక్ష మాత్రమే ఇచ్చారు. అందులోనూ సాంకేతిక కారణాలతో రూ.కోటి 15 లక్షలు నిలిచిపోయాయి. యూత్ ప్యాకేజీ కింద రూ. కోటి 31 లక్షలు నిలిచాయి. ఇవికాకుండా భూ పరిహారం రూ.12.16 కోట్లు. యూత్ ప్యాకేజీ రూ.11.98 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. తిత్లీ తుఫానులో బాధితులకు రెట్టింపు పరిహారం హామీ పరిహాసంగా మారింది. జిల్లాలోని 12 మండలాల్లో 6 వేల 6 వందల 14 మంది లబ్ధిదారులకు ఇంతవరకు చెల్లింపులు చేయలేదు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ రాజకీయకక్ష సాధింపులకు పాల్పడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.

'అన్నొస్తే అంతే!' - అనకాపల్లి ప్రజలకు తప్పని అవస్థలు - CM Jagan Bus Yatra

వంశధార స్టేజ్ -2 , ఫేజ్- 2 ప్రాజెక్టుకు టీడీపీ హయంలోనే భూసేకరణకు అవసరమైన రూ.422 కోట్లు మంజూరు చేసి గ్రామాలకు తరలించారు. 85 పాయింట్ 5 శాతం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. మిగిలిన పనులను సైతం వైసీపీ పూర్తి చేయలేకపోయింది. అలాగే కరకట్ట పనులను గాలికొదిలేసింది. రూ.1000 కోట్లతో వంశధార ఎడమ ప్రధాన కాలువ ఆధునీకరణ కోసం అధికారులు పంపిన ప్రతిపాదనలను పక్కనపడేశారు. టీడీపీ హాయాంలో రూ.400 కోట్లు మంజూరు చేసి అఫ్ షోర్ ప్రాజెక్టు భూసేకరణతో పాటు ఆర్ ఆండ్ ఆర్ పనులు పూర్తిచేశారు. కానీ జగన్ వచ్చిన తరువాత ప్రాజెక్టుల జాబితాలో చేర్చి అయిదేళ్లపాటు ఎటువంటి పనులు చేయకూడదని జీవో విడుదల చేసింది. ఎన్నికల ముందు టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో రాజకీయ లబ్ది కోసం మరలా పనులు ప్రారంభిస్తున్నట్లు నాటకానికి తెరలేపారు తప్పితే ఒక్కపనీ చేయలేదు. రంగసాగరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదు. వంశధార కాలువపై ఎత్తిపోతల పథకాలకు నీరు నిలిపి వేసి ఆయకట్టును ప్రశ్నార్ధకంగా మార్చేశారు.

"సీఎం జగన్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశధార ప్రాజెక్టులు పనులు ప్రారంభం కూడా చేయలేదు. బడ్జెట్​లో కనీసం కేటాయింపులు కూడా చేయలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం జగన్​ అబద్దాలు చెబుతున్నారు" -సిక్కోలు రైతు

ఉత్తరాంధ్రపై మాటల్లోనే జగన్​ ప్రేమ - అభివృద్ధిలో ఉత్త చేయే

సంతబొమ్మాలి మండలం వడ్డితాండ్రలో మత్స్యకారులు 2010 నుంచి ధర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పాదయాత్రలో శిబిరాన్ని సందర్శించిన జగన్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన 1108 జీవో రద్దుకు హామీ ఇచ్చారు. కానీ అయిదేళ్లుగా వారికి వారికి న్యాయం జరగలేదు. 1108 జీవో రద్దు కాలేదు.

ఆమదాలవలసలోని చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తానని జగనన్న చెప్పిన మాట చేదు మూటగానే మిగిలింది. చక్కెర కర్మాగారం పరిశీలన కోసం త్రిసభ్య కమిటీ నియమించారు. ఈ కమిటీ పరిశీలన తర్వాత షుగర్‌ ఫ్యాక్టరీని అమ్మకానికి పెడుతున్నారన్న సమాచారంతో రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వ్యవహారం అక్కడికి ఆగిపోయింది. టెక్కలి మండలం రావివలసలో మెట్కోర్ ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమను తెరిపిస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక న్యాయస్థానం ద్వారా వేరే యాజమాన్యం పరిశ్రమను ప్రారంభించింది. దీన్ని కొద్దిరోజులు నడిపాక మరలా పరిశ్రమను మూసేశారు. జిల్లాలో గ్రానైట్ క్వారీలు పరిశ్రమలను ఆదుకుంటానన్న జగన్ అధికారంలోకి వచ్చాక పన్నుల భారం పెంచారు. పరిశ్రమలను తరిమేసి 75 శాతం ఉద్యోగాలు పోగొట్టిన జగన్‌ కొత్తగా ఉద్యోగ కల్పన ఎలా చేస్తారని యువకులు ప్రశ్నిస్తున్నారు.

జగన్​ హామీల డ్రామాలకు నిదర్శనం వరికపూడిశెల- పల్నాడు గడ్డకు వైఎస్సార్సీపీ తీరని ద్రోహం - Varikapudishela Project

పరిశోధనలు లేని కిడ్నీ కేంద్రం : జిల్లాలోని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పలాసలో 200 పడకల కిడ్నీ పరిశోధన కేంద్రం నిర్మిస్తామని ఇచ్చిన మాట తూతూమంత్రంగా మిగిలింది. ఇక్కడే కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయిదేళ్లలో ఆసుపత్రి భవనాన్ని అయితే నిర్మించారు కానీ పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని నూతన భవనంలోకి మార్చలేదు. కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసే నిపుణులు, సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకం జరగలేదు. కళింగ నేలపై కపట ప్రేమ చూపిన జగన్‌ నేడు సిక్కోలుకు ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.