ETV Bharat / state

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈసీ సమీక్ష - అధికారులకు కీలక ఆదేశాలు - ECI reviews counting arrangements

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2024, 3:55 PM IST

ECI Review for Counting Arrangements : జూన్ 4న జరగబోయే, ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీని కోసం వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ఈసీ దిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్సు ద్వారా, ఈ సమీక్షలో సమీక్షలో సీఈవో ముఖేష్ కుమార్‌ మీనా పాల్గొన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపుపై సీఈసీ చర్చించారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు.

counting arrangements
counting arrangements (ETV Bharat)

ECI Review for Counting Arrangements : దేశవ్యాప్తంగా జరిగిన లోక్​సభ, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్​, సిక్కీం, ఒడిశా రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియపై ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం అందరి దృష్టి కౌంటింగ్ పైనే నెలకొని ఉంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను ఎలా లెక్కిస్తారు. ఎన్ని టేబుళ్లు వేస్తారు. ఎన్ని రౌండ్లు అనే విషయాన్ని ఎలా నిర్ధారిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 33 ప్రదేశాల్లో 350 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ ఫలితాల లెక్కింపును జూన్ 4 తేదీ ఉదయం 8 గంటల నుంచి చేపట్టనున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాక ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఏపీలో 350 కౌంటింగ్ కేంద్రాలు: ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 4 తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లు, హోం ఓటింగ్ కు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. చీమ చిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 33 చోట్ల 350 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ కొనసాగుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల లోపల, బయట సీసీ కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు. స్ట్రాంగ్ రూంలోకి వెళ్లేందుకు ఓకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండేలా ఏర్పాట్లు చేయడంతోపాటు స్ట్రాంగ్ రూంలకు రెండు తాళాలు వేసే వ్యవస్థను పెట్టారు. కౌంటింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపులో ప్రతీ అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసేలా ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది.

పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ: ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దీనికి ముందు నుంచే కౌంటింగ్ కు సంబంధించిన కసరత్తు మొదలు అవుతుంది. ఉదయం 5 గంటలకు లెక్కింపు చేయాల్సిన టేబుళ్లను సంబంధింత అధికారులకు కేటాయింపు చేస్తారు. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం కూడా చేయిస్తారు. లెక్కింపులో గోప్యత పాటిస్తామని ప్రమాణం చేసిన తర్వాత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ మెుదలు కానుంది. 8.30 గంటల వరకూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాక ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. పోస్టల్ ఓట్లు ఎక్కువ ఉండి సమయం పడితే ఆ లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా చేస్తారు. ఒక నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్‌లు లెక్కిస్తారని అంచనా.

జగన్​ అండతో సీఎస్ రూ.2 వేల కోట్ల విలువైన భూములు దోచేసినా చర్యల్లేవు: బోండా ఉమా - Bonda Uma on AP CS Land Scams

ఈవీఎంల ఓట్ల లెక్కింపు: నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు, వాటి పరిధిలో పోలైన ఓట్లు ప్రాతిపాదికన ఎన్ని రౌండ్‌లు లెక్కింపు చేయాలో రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఒక్కో రౌండ్‌కు 25 నుంచి 30 నిమిషాల సమయం వరకూ పడుతుంది. సగటున 14 – 15 టేబుళ్లపై లెక్కింపు చేసేలా నిర్ణయం అవుతుంది. ఒకసారి మొత్తం టేబుళ్లపై ఉన్న ఈవీఎంల లెక్కింపు పూర్తి అయితే ఒక రౌండ్ పూర్తయినట్టుగా నిర్ధారిస్తారు. లెక్కింపు టేబుళ్లకు అనుగుణంగా ఏజెంట్లను రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. ఒక రౌండ్ కు ఒక టేబుల్ కు 1200 ఓట్ల వరకూ లెక్కింపు జరిగే అవకాశముంది. ఒక్కో రౌండ్ కు దాదాపు 15 వేల ఓట్ల వరకూ లెక్కింపు జరిగే అవకాశముంది. ఈవీఎంలలోని రిజల్టు మీట నొక్కగానే కనిపించే ఓట్ల సంఖ్యతో పాటు అభ్యర్ధులకు వచ్చిన ఓట్లను లెక్కించి అధికారులు నమోదు చేసుకుంటారు. ప్రతీ రౌండ్ కు ఏజెంట్లు, మైక్రో అబ్జర్వర్ సంతకాలను తీసుకున్న తర్వాత ఎవరికీ అభ్యంతరం లేదన్న తర్వాతే ఫలితాలను వెల్లడిస్తారు. దీంతో పాటు ఈవీఎంల లెక్కింపు పూర్తి అయిన అనంతరం వీవీప్యాట్ స్లిప్ లను కూడా లెక్కించే ప్రక్రియను కూడా ఈసీ నిర్దేశించింది. ప్రతీ నియోజకవర్గంలోనూ పోలింగ్ కేంద్రాల నెంబర్లను లాటరీ తీసి అనంతరం ఆయా వీవీ ప్యాట్ ల స్లిప్పులను లెక్కించేలా నిర్ణయం తీసుకుంటారు. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ గా పిలిచే వీవీ ప్యాట్ లలో ఓటు వేసేటప్పుడే సదరు ఓటును ముద్రణ అవుతుంది. ఏదైనా వ్యత్యాసం ఉంటే రెండో మారూ లెక్కించిన అనంతరం ఫలితాన్ని నిర్ధారిస్తారు. వీవీ ప్యాట్ లలో స్లిప్పుల లెక్కింపు పూర్తి అయ్యేంత వరకూ అధికారికంగా ఫలితాలను ప్రకటించరు.

వేర్వేరు స్థానాల్లో కానీ లెక్కింపు: ఎన్నికల్లో ఒక రౌండ్ ఫలితాలు ఈసీ అధికారికంగా ప్రకటించేందుకు కనీసం 30 నిమిషాల సమయం అవసరం అవుతుంది. ప్రతీ రౌండ్ పూర్తి అయిన తర్వాత అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు, మైక్రో అబ్జార్వర్, ఎన్నికల పరిశీలకుల సంతకాల తర్వాతే ఫలితాల వెల్లడి ఉంటుంది. ఈవీఎంలలో వచ్చిన ఓట్లు, వీవీ ప్యాట్లలో వచ్చిన ఓట్లు సరిపోలాక ఏజెంట్లు ఎవరికి అభ్యంతరం లేదని చెప్పిన తర్వాత రిటర్నింగ్ అధికారి రౌండ్ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో ఏదైనా అభ్యంతరం ఉంటే ఓట్ల లెక్కింపు ఆలస్యం అయ్యే అవకాశముంటుంది. ఒక్కో ఈవీఎంలో 800 నుంచి 1200 ఓట్లు వరకూ నమోదు అయి ఉంటాయి. ప్రతీ రౌండ్ కూ 14 టేబుళ్ల చొప్పున సరాసరి 14,000 నుంచి 15,000 ఓట్ల ఫలితాలు వెల్లడి అవుతాయి. ప్రతీ నియోజకవర్గంలోనూ దాదాపు 17 నుంచి 20 రౌంట్లలోపు ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశముంది. ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి బాధ్యతనూ సదరు రిటర్నింగ్ అధికారి బాధ్యత వహిస్తారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఈ పరిస్థితిలో రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వివిధ అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఒకే చోట కానీ, వేర్వేరు స్థానాల్లో కానీ లెక్కింపు జరుగుతుంది.

ఎన్నికలు 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.