ETV Bharat / state

'ఓట్ల లెక్కింపు రోజున తీవ్ర అల్లర్లకు కుట్ర- పిన్నెల్లి బెయిల్​కు అనర్హుడు' - MLA Pinnelli Case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2024, 7:01 AM IST

Arguments in High Court on MLA Pinnelli Case: ఈవీఎం ధ్వంసం కేసులో పోలీసులు అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు ఆ సమయంలో విధించిన షరతులను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉల్లంఘించారని పీపీ కోర్టుకు నివేదించారు. ఫలితంగా ఆయన కదలికలపై పోలీసులు నిఘా ఉంచలేకపోయారని చెప్పారు. అందువల్ల మరో మూడు కేసుల్లో ముందస్తు బెయిలు పొందేందుకు పిటిషనర్‌ అనర్హుడని పీపీ స్పష్టం చేశారు. అయితే వాదనలకు సమయం సరిపోకపోవడంతో హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది.

mla_pinnelli_case
mla_pinnelli_case (ETV Bharat)

Arguments in High Court on MLA Pinnelli Case: మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను పగలగొడుతూ అడ్డంగా దొరికిపోయిన కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ పొందిన మాచర్ల వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనపై నమోదు చేసిన మరో మూడు కేసుల్లో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై రెంటచింతల పోలీసులు పిన్నెల్లితో పాటు మరో 15 మందిపై ఐపీసీ 307- హత్యాయత్నంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

'మాపై ఒత్తిడి ఉంది' - పిన్నెల్లి బాధితుల ఎఫ్‌ఐఆర్ తీసుకునేందుకు నిరాకరించిన పోలీసులు - Police Rejected Pinnelli Victim FIR

పోలింగ్‌ తర్వాతి రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. అడ్డుకోబోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరిచారు. సీఐ ఫిర్యాదు మేరకు పిన్నెల్లి, ఆయన తమ్ముడు, అనుచరులపై 307 తదితర సెక్షన్ల కింద కారంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను బద్దలుకొట్టి బయటకొస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లిని చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ ప్రశ్నించగా ఆమెను తీవ్రంగా దుర్భాషలాడారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 506, 509, ఆర్‌పీ చట్టం సెక్షన్‌ 131 కింద కేసు నమోదు చేశారు.

మూడు కేసుల్లో ముందస్తు బెయిలు కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఆదివారం జరిగిన అత్యవసర విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో పిటిషనర్‌పై బహుళ ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారన్నారు. ఈవీఎంను పగలగొట్టిన కేసులో జూన్‌ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారని చెప్పారు. పోలీసుల తరఫున పీపీ నాగిరెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు విధించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారని దీంతో పోలీసులు ఆయన కదలికలపై నిఘా ఉంచలేకపోయారని తెలిపారు.

తాడిపత్రి అల్లర్లపై పొంతన లేని జవాబులు - అనంతపురం ఏఆర్‌ అదనపు ఎస్పీపై వేటు

'ఓట్ల లెక్కింపు రోజున తీవ్ర అల్లర్లకు కుట్ర- పిన్నెల్లి బెయిల్​కు అనర్హుడు' (ETV Bharat)

అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎస్పీ నుంచి తనకు సూచనలు అందాయని పేర్కొన్నారు. పిన్నెల్లి తీవ్ర నేరాలకు పాల్పడ్డారని మధ్యంతర బెయిలు మంజూరు చేయొద్దని వాదించారు. ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉందని కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. సీఐ నారాయణస్వామి తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ హత్యాయత్నం లాంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఓ కేసులో సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తుచేశారు.

బెయిలు మంజూరు సమయంలో పిన్నెల్లి పూర్వ నేరచరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికలలో సైతం పిన్నెల్లి ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తెచ్చారు. ముందస్తు బెయిలు పొందేందుకు పిటిషనర్‌ అనర్హుడని చెప్పారు. వాదనల కొనసాగింపునకు విచారణను కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. సీఐ నారాయణస్వామిపై పిన్నెల్లి, ఆయన అనుచరులు దాడిచేసి గాయపరిచిన కేసు వివరాలను పరిశీలించాలని ఈ సందర్భంగా పీపీకి న్యాయమూర్తి సూచించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ఆదివారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

వైఎస్సార్​సీపీ చేస్తున్న రిగ్గింగ్‌ను అడ్డుకోవడమే నేను చేసిన తప్పా: మాణిక్యరావు - Manikya Rao on Pinnelli brothers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.