ETV Bharat / state

వైఎస్సార్సీపీకి నాలుగో సింహం దాసోహం - అధికార పార్టీ అరాచకాలను ప్రశ్నిస్తే కేసులే

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 8:59 AM IST

AP Police Support to YSRCP Leaders Anarchy: చూడు ఒక వైపే చూడు, రెండో వైపు చూడొద్దు అన్నట్లుగా సాగుతోంది ఏపీ పోలీసుల తీరు. ప్రతిపక్షాలు, మేధావులు, పౌరసంఘాలు, సామాజిక కార్యకర్తలు ఇలా ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్నమాట మాట్లాడినా కఠినమైన సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. మీడియాపైనే నేరుగా భౌతికదాడులకు దిగుతున్నా వారిపై నామమాత్రపు కేసులతోనే సరిపెడుతున్నారు పోలీసులు.

AP_Police_Support_to_YSRCP_Leaders_Anarchy
AP_Police_Support_to_YSRCP_Leaders_Anarchy

వైఎస్సార్సీపీకి నాలుగో సింహం దాసోహం - అధికార పార్టీ అరాచకాలను ప్రశ్నిస్తే కేసులే

AP Police Support to YSRCP Leaders Anarchy : చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అన్నట్లుగా సాగుతోంది ఏపీ పోలీసుల తీరు. ప్రతిపక్షాలు, మేధావులు, పౌరసంఘాలు, సామాజిక కార్యకర్తలు ఇలా ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్నమాట మాట్లాడినా కఠినమైన సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అదే అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు విపక్షాలతో పాటు ప్రశ్నించిన వారందిరిపైనా దాడులకు తెగబడ్డా, వారిని అంతం చేసేందుకు యత్నించినా అత్యధిక సందర్బాల్లో కేసులే పెట్టని పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో కేసులు పెట్టినా నామమాత్రపు సెక్షన్లతో మమ అనిపిస్తున్నారు. పోలీసుల అండతో రెచ్చిపోతున్న అధికార మూకలు ఏకంగా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపైనే నేరుగా భౌతికదాడులకు దిగుతున్నారు. ఇంత జరిగినా పక్షపాత వైఖరిని వీడని పోలీసులు మీడియాపై దాడి చేసిన వారిపైనా నామమాత్రపు కేసులతోనే సరిపెడుతున్నారు.

ఈనాడు కార్యాలయంపై మారణాయుధాలతో దాడి : కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు 250 మందికిపైగా వైఎస్సార్సీపీ గూండాలు దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో సుమారు గంటన్నరపాటు తీవ్ర విధ్వంసం సృష్టించారు. ఆస్తి నష్టం నేరం కింద కేసుతో సరిపెట్టేశారు. ఒక్క వ్యక్తిని మాత్రమే నిందితుడిగా పేర్కొన్నారు. 24 గంటలవుతున్నా ఒక్కర్నీ అరెస్టు చేయలేదు. పథకం ప్రకారమే ఎమ్మెల్యే అనుచరులైన వైఎస్సార్సీపీ గూండాలు నేరపూరిత కుట్రకు రూపకల్పన చేసి ఈనాడు కార్యాలయంపై మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. కార్యాలయం తాళాలు పగలకొట్టేందుకు యత్నించారు. సిబ్బంది ముందస్తుగా అప్రమత్తమై 'ఈనాడు' కార్యాలయానికి తాళాలు వేసి బయటకు వెళ్లటంతో ముప్పు తప్పింది.లేదంటే ఆ మూక విలేకరులపైన దాడికి పాల్పడి వారి ప్రాణాలకు హాని కలిగించి ఉండేది.ఇంత తీవ్ర విధ్వంసానికి పాల్పడితే కేవలం 50 రూపాయలు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ఆస్తి నష్టం నేరం కింద కేసు పెట్టి సరిపెట్టేశారు మన పోలీసులు.

మనవాడైతే ఓకే..! కాకపోతే, లోపల వేయ్..! విమర్శలపాలవుతున్న పోలీసుల తీరు

అదే విశాఖలో అధికార పార్టీ నాయకుల అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలిపే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు విశాఖపట్నంలో మంత్రి రోజా వాహనశ్రేణిపై చెప్పులు విసిరితే పోలీసులు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టేశారు. ఘటనాస్థలిలో లేని వారిని సైతం కేసులో ఇరికించి అర్ధరాత్రి వేళ ఇళ్లకు వెళ్లి మరీ వందల మందిని అరెస్టు చేశారు. గుంటూరులో మంత్రి విడదల రజిని పార్టీ కార్యాలయంపై ఎవరో అల్లరిమూకలు రాయి విసిరితే రాత్రికి రాత్రి ప్రతిపక్ష పార్టీలకు చెందిన 30 మందిని అరెస్టు చేశారు. సంబంధం లేనివారినీ అదుపులోకి తీసుకున్నారు. ఏడేళ్లలోపు శిక్షపడే అవకాశమున్న కేసులో అరెస్టు చేసి కోర్టు ముందుంచారు.

YSRCP Leaders Anarchy In Andhra Pradesh : ఈనాడు కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా ఐపీసీ సెక్షన్‌ 324 కింద కేసు ఎందుకు పెట్టలేదు? మారణాయుధాలతో అల్లర్లకు తెగబడితే ఐపీసీ 147, 148 సెక్షన్లు ఎందుకు వర్తింపజేయలేదు? ముందస్తు కుట్రతోనే దాడికి వచ్చారని స్పష్టంగా కనిపిస్తున్నా ఐపీసీ 120బీ సెక్షన్‌ పెట్టకపోవటమేంటి? అల్లర్లతో 'ఈనాడు' కార్యాలయాన్ని, ఆ ప్రాంతాన్ని అక్రమంగా నిర్బంధించిన వారిపై ఐపీసీ 341 సెక్షన్‌ పెట్టరా? వారంతా మారణాయుధాలతో అంతమొందించేందుకే వచ్చినట్లు కనిపిస్తుంటే హత్యాయత్నం నేరం ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసు పెట్టకపోవటమేంటి? వందల మంది దాడి చేయటానికి వస్తే ఒక్కర్నే నిందితుడిగా పెడతారా? ఈ దాడికి కుట్రదారయిన కాటసాని రాంభూపాల్‌రెడ్డిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదు? ఇది అధికార వైఎస్సార్సీపీకు కొమ్ముకాయటం కాదా? వారి అరాచకాలకు వత్తాసు పలకటం కాదా?

న్యూస్‌టుడే విలేకరిపై హత్యాయత్నం : ఇదే కాదు అమరావతి మండలం మల్లాది ఇసుక రీచ్‌లో అక్రమ తవ్వకాల బండారం బయటపెట్టేందుకు వెళ్లిన 'న్యూస్‌టుడే' విలేకరి తేలప్రోలు పరమేశ్వరరావుపై ఇసుక మాఫియా నడిపిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు హత్యాయత్నానికి తెగబడ్డారు. పెట్రోల్‌ తీసుకురండిరా.. తగలెట్టేద్దాం అంటూ ఆయనపై దాడి చేశారు.వారం రోజులవుతున్నా నిందితులెవర్నీ అరెస్టు చేయలేదు.హత్యాయత్నం సెక్షనే పెట్టలేదు.ప్రమాదకర మారణాయుధాలతో దాడి, అక్రమ నిర్బంధం సెక్షన్లతో సరిపెట్టేశారు. నిందితులైన వైఎస్సార్సీపీ నాయకులు వెంప శ్రీను, తులసి తిరుపతిరావు, భవిరిశెట్టి సునీల్, భవిరిశెట్టి నాగేశ్వరరావు తదితరులెవర్నీ అరెస్టు చేయలేదు.

హద్దులు మీరుతున్న పోలీసు అరాచకాలు

ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్ట్​పై దాడి : అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ నెల 18న జరిగిన 'సిద్ధం' సభ కవరేజీలో ఫొటోలు తీస్తున్న 'ఆంధ్రజ్యోతి' ఫొటో జర్నలిస్ట్‌ శ్రీకృష్ణపై వైఎస్సార్సీపీ గూండాలు అత్యంత ఆటవికంగా దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ జెండాలు కట్టి ఉన్న కర్రలతో సభా వేదిక నుంచి దాదాపు అరకిలోమీటరు వరకూ ఆయన్ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆయన్ను అంతమొందించేందుకు యత్నిస్తుంటే పోలీసులు కళ్లప్పగించి చూశారు. దాడి చేసిన వైఎస్సార్సీపీ నాయకులెవరో ఆ ఫొటోల్లో, వీడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఇప్పటి వరకూ పోలీసులు కేవలం ఒక్కర్నే, అది కూడా చాలా 'గౌరవంగా' అరెస్టు చేశారు.

గత నెల 7న అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కవరేజికి వెళ్లిన 'ఈనాడు' ఫొటోగ్రాఫర్‌ సంపత్, 'న్యూస్‌టుడే' విలేకరులు ఎర్రిస్వామి, భీమప్ప, 'ఈటీవీ' విలేకరి మంజునాథ్‌పై వైఎస్సార్సీపీ వారు 150 మంది దాడి చేశారు. వెంబడించి మరీ పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు పక్కనే ఉన్నా వారిని నిలువరించలేదు. కేసు నమోదు చేసినా ఒక్కర్నీ అరెస్టు చేయలేదు. తాడిపత్రిలో 2022 జూన్‌ 11న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి ఓ గుత్తేదారుపై దాడి చేస్తుంటే చిత్రీకరించినందుకు 'న్యూస్‌టుడే' విలేకరి ఎర్రస్వామిపై దాడి చేశారు. దీనిపై కేసు నమోదై ఏడాదిన్నరవుతున్నా ఇప్పటికీ ఎవర్నీ అరెస్టు చేయలేదు.

టీడీపీపై దాడి : గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబరు 19న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విజయవాడ తూర్పు ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌ అనుచరులు దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో పలువురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. రెండేళ్లవుతున్నా ఈ కేసులో ఒక్కరినీ పోలీసులు అరెస్టు చేయలేదు. సీసీటీవీ ఫుటేజీలున్నా నిందితుల్ని గుర్తించలేకపోయారు.

విజయవాడలో టీడీపీ నాయకుడు చెన్నుపాటి గాంధీ కంటిని వైఎస్సార్సీపీ వారు ఇనుపచువ్వతో పొడిస్తే హత్యాయత్నం కేసే అవసరం లేదని పోలీసులు తేల్చేశారు. గన్నవరంలో పార్టీ కార్యాలయం, టీడీపీ కార్యకర్త నివాసంపై వైఎస్సార్సీపీ నాయకులు చేసిన దాడికి నిరసన తెలిపేందుకు వెళ్లిన ప్రతిపక్ష పార్టీ నాయకులపై మాత్రం హత్యాయత్నం కేసులు పెట్టేశారు. కొన్ని ఘటనల్లో పోలీసులే ఫిర్యాదుదారులుగా మారిపోయి వైఎస్సార్సీపీకు కొమ్ముకాస్తున్నారు.

బాధితులపై కేసులు : చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా 2022 ఆగస్టులో టీడీపీ వారిపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దాడిచేసిన వారిని వదిలేసి, ఈ ఘటనలో బాధితులైన టీడీపీ కార్యకర్తలు, నాయకులు 65 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు పెట్టి అరెస్టులు చేయడం గమనార్హం. అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ వాహనశ్రేణిపై రాళ్లు విసిరి, కర్రలతో దాడి చేసిన వారిని 11 నెలలు గడిచినా ఇప్పటికీ పట్టుకోలేదు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు పుంగనూరులో బీసీవై అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ ఇంటిపై 3 గంటలపాటు దాడి చేసి, విధ్వంసం సృష్టిస్తే రెండు రోజుల వరకూ కేసే లేదు. ఆ తర్వాత 11 మందిపైనే కేసు పెట్టినా వారినీ అరెస్టు చేయలేదు. రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై మాత్రం అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు.

చంద్రబాబు ఇంటిపైకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జోగి రమేష్‌ తన అనుచరులతో దండయాత్రగా వెళ్లి రాళ్లు, కర్రలతో దాడి చేయిస్తే ఆయన్ను వదిలేశారు. పైగా ప్రతిఘటించిన ప్రతిపక్ష శ్రేణులపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు బనాయించారు. డీజీపీ, శాంతిభద్రతల డీజీపీకి ఈ అరాచకాలు కనిపించట్లేదా?

అధికార పార్టీ ఆగడాలపై ఫిర్యాదు చేస్తే.. బాధితుడినే బంధించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.