ETV Bharat / state

ఏడాదిలో 341 రోజులు అప్పులే - కాగ్ హెచ్చరించినా డోంట్​ కేర్​

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 7:10 AM IST

Andhra Pradesh Debts: 'నా దారి రహదారి' అనడం రజనీకాంత్‌ స్టైల్‌ అయితే, తన దారి అప్పుల దారి అంటూ రాష్ట్రాన్ని ఊబిలోకి తోయడం జగన్‌ రివాజుగా మారింది ! ఆర్థిక నిర్వహణ సక్రమంగా లేకపోతే మనిషైనా, వ్యవస్థ అయినా రోడ్డున పడాల్సిందే ! అలాంటిది ప్రభుత్వమే దారితప్పితే ఆంధ్రప్రదేశ్‌లా తయారవుతుందని చెప్పాల్సి వస్తుందేమో ! అందుకే ఇదేం పద్ధతి అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరును కాగ్‌ ఎప్పుడో ఎండగట్టింది. అయినా జగన్‌ వినకపోగా, మరింత ఎక్కువగా అప్పులు తెస్తూ, వాటిపై భారీగా వడ్డీలూ చెల్లిస్తున్నారు. నాలుగేళ్లు గడిచేసరికి ఏకంగా 341 రోజులు అప్పులతోనే కాలం గడిపే స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు. వైఎస్సార్సీపీ సర్కార్‌ అయిదేళ్ల కాలంలో నాలుగేళ్ల ఆర్థిక లెక్కలను కాగ్‌ ఖరారు చేసింది.

Andhra_Pradesh_Debts
Andhra_Pradesh_Debts

ఏడాదిలో 341 రోజులు అప్పులతోనే - కాగ్ అప్పుడే హెచ్చరించినా తగ్గని జగన్

Andhra Pradesh Debts: ఆర్థిక నిర్వహణ ఎలా ఉండకూడదో జగన్‌ సర్కార్‌ను చూస్తే సరిపోతుందేమో ! చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా, ఖజానా ఖాతాలో కనీస నిల్వ కూడా లేకుండా ఏమిటీ అప్పులు, చేబదుళ్లు అంటూ గతంలోనే కాగ్‌ ఎంగడట్టింది. కొంత జాగ్రత్తపడితే ఈ వడ్డీల బాధ తప్పుతుంది కదా అని సలహా ఇచ్చింది. రోజూ చేబదుళ్లు తీసుకుంటూ వడ్డీల రూపంలో వృథా ఖర్చులు చేస్తున్నారని విస్తుపోయింది. ఎప్పుడో 2021లో లెక్కలు చూసిన తర్వాతే కాగ్‌ అలా చెప్పింది. జగన్‌ సర్కార్‌ ఆ మాట వినకపోగా, మరింత ఎక్కువగా అప్పులు తెస్తూ భారీగా వడ్డీలూ చెల్లిస్తోంది.

2019-20లో ఏడాది మొత్తం 221 రోజులే ఇలా చేబదుళ్లు తీసుకుంటే నాలుగేళ్లు గడిచేసరికి ఏకంగా 341 రోజులు అప్పులలోనే రాష్ట్రాన్ని ముంచారు. అప్పు పుడితేనే పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు, ఏ కార్యక్రమానికైనా నిధులివ్వాలంటే రుణం తీసుకోవాల్సిందే. ఆఖరికి ఉద్యోగులు రిజర్వు బ్యాంకు వెబ్‌సైట్‌ చూసుకుని, రాష్ట్రం అప్పు ఎప్పుడు తెస్తుంది, ఎంత తీసుకుంటోంది, మనకు జీతం ఎప్పుడు వస్తుంది అని లెక్కలు వేసుకునే రోజులు వచ్చాయి. ఒక ప్రణాళిక లేకుండా ఎప్పుడూ ఆర్బీఐ నుంచి చేబదుళ్లు తీసుకుంటూ రాష్ట్ర ఖజానాను నడపాల్సి రావడంతో ఏటా వాటిపై చెల్లించే వడ్డీల భారమూ పెరిగిపోతోంది. సర్కార్‌ పెద్దలు మాత్రం అబ్బే అలాంటిదేం లేదంటారు.

కొత్త ఏడాదికి అప్పులతో స్వాగతం పలికిన సీఎం జగన్

జగన్‌ ప్రభుత్వం ఏ ఏడాది ఎన్ని రోజులు చేబదుళ్లు, అప్పులు తీసుకువచ్చింది ? ఎన్ని రోజులు ఓవర్‌ డ్రాఫ్ట్‌లో రాష్ట్రం మునిగిపోయింది అన్న లెక్కలు గమనిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ రుణాలు, గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తెచ్చే రుణాలే కాదు రోజువారీ నిర్వహణ కోసం రిజర్వు బ్యాంకు ఇచ్చే చేబదుళ్లు, ప్రత్యేక సదుపాయం రుణాలూ తీసుకుంటుంది. ఓవర్‌డ్రాఫ్ట్‌ వెసులుబాటు వినియోగించుకుంటుంది. వీటిని ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తుండాలి. ఆ చేబదుళ్లకు వడ్డీలూ కట్టాలి. అదీ ఒక రకమైన అప్పే.

రిజర్వు బ్యాంకు ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం, వేస్‌ అండ్‌ మీన్స్, ఓవర్‌ డ్రాఫ్ట్‌ అనే 3 తరహాలుగా రుణ వెసులుబాటు కల్పిస్తుంది. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోయినా, ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం కింద 400 కోట్లు వరకు వాడుకోవచ్చు. ఈ మొత్తం మన రిజర్వు నిధిని బట్టి ఉంటుంది. ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం వాడేసుకున్న తరువాత కూడా రిజర్వు బ్యాంకు నుంచి చేబదుళ్లు తీసుకోవచ్చు. 2వేల 252 కోట్ల మేర ఇలా తీసుకోవచ్చు. ఆ మొత్తం కూడా వాడుకున్న తర్వాత దాదాపు చేబదుళ్ల మొత్తమే ఓవర్‌ డ్రాఫ్ట్ట్‌గా వాడుకోవచ్చు.

ఏపీ ఆర్థిక గణాంకాలపై కాగ్ నివేదిక - ఏడాదిలో 152 రోజులు ఓవర్ డ్రాఫ్ట్

ఓడీలోకి వెళ్లిన తర్వాత 5 రోజుల్లోపు ఆ అప్పు మొత్తం ఆర్బీఐకి చెల్లించి బయటపడాలి. అలా చేబదుళ్లు, ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం సొమ్ములూ వెనక్కు చెల్లిస్తూ, మళ్లీ ఆ సదుపాయాల కింద అంతే మొత్తంలో వాడుకుంటూ నడిపిస్తూ ఉంటారు. ఈ చేబదుళ్లు తీసుకోకుండా ఆర్థిక నిర్వహణ సరిగ్గా చేసుకుంటే వడ్డీల భారాలు ఉండవు. ఏదైనా ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం 14 రోజుల పాటు ఓవర్‌ డ్రాఫ్ట్‌ వెసులుబాటును వినియోగించుకోవచ్చు. 3 నెలల కాలంలో 36 రోజులకు మించి ఓడీ సౌకర్యం ఉండకూడదు. రిజర్వు బ్యాంకు కల్పించిన 3 తరహాలుగా రుణ వెసులుబాటు వాడుకుని జగన్‌ సర్కార్‌ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది.

రాష్ట్ర అప్పులు తీర్చాల్సింది ప్రజలే - ఒక్కొక్కరిపై ఎంత భారం ఉందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.