All Party Leaders Protest in Nellore: కృష్ణపట్నం పోర్టును అదానీ కంపెనీ డర్టీ పోర్టుగా మార్చడంపై అఖిలపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వల్లనే పోర్టు మనుగడ కూడా ప్రశ్నార్థకమైందని ఆరోపించారు. అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, టీడీపీ నేత అబ్దుల్ అజీజ్, కాంగ్రెస్, సీపీఐ, జనసేన నేతలు పాల్గొన్నారు.
అనంతరం అఖిలపక్ష పార్టీల నేతలు కృష్ణపట్నం పోర్టు సీఈఓ జీజే రావుతో సమావేశమయ్యారు. కంటైనర్ టెర్మినల్‌ను తరలించడంపై సీఈవోని నిలదీశారు. రాజకీయాల కోసం తాము రాలేదని, పోర్టు కోసం 8600 ఎకరాల భూములను రైతులు ఇచ్చారని తెలిపారు. గ్రామాలు ఖాళీ చేసి మరీ రైతులు భూమిలిచ్చి త్యాగం చేశారని గుర్తు చేశారు.
కంటైనర్ టెర్మినల్ తరలించి బల్క్ కార్గో పెంచేశారని మండిపడ్డారు. తమిళనాడులో బల్క్ కార్గో వద్దంటే ఇక్కడ తెచ్చిపెట్టేస్తారా అని ప్రశ్నించారు. తమ భూమిలిచ్చి, ఊళ్లు ఖాళీ చేసి, అనారోగ్యాలు భరిస్తున్నామని తెలిపారు. పోర్టు బయట వైసీపీ నేతలు మాఫియాగా ఏర్పడి వసూళ్లకు పాల్పడుతుంటే పట్టించుకోరా అని నిలదీశారు. అదానీ వల్ల నెల్లూరు జిల్లాకి కీడు జరిగిందని ధ్వజమెత్తారు. నవయుగ కంపెనీ ఎంతో కష్టపడి పోర్టుని అభివృద్ది చేసిందని, సీఎం జగన్ వల్ల పోర్టుని వదిలి పోవాల్సి వచ్చిందని విమర్శించారు.
వ్యాపారం లేదు ప్చ్! వెళ్లిపోదామా- కృష్ణపట్నం పోర్టు ఉపసంహరణకు అదాని సంస్థ నిర్ణయం!
కాగా గత కొంతకాలంగా కృష్ణపట్నం పోర్టు ద్వారా సరకు రవాణా గణనీయంగా పడిపోయింది. ఆశించిన స్థాయిలో వ్యాపారం లేకపోవడంతో కంటైనర్ టెర్మినల్‌ను (Krishnapatnam Container Terminal) పాక్షికంగా ఉపసంహరించాలని పోర్టు యాజమాన్యం అదానీ సంస్థ నిర్ణయించింది. పోర్టు ఆగిపోతే ఖజానాకు వచ్చే ఆదాయం పడిపోతుంది. అంతేకాకుండా ఆ ప్రభావం వేలాది మంది ఉపాధిపైనా తీవ్ర ప్రభావం చూపనుంది.
2019-21 మధ్య ఎగుమతులు, దిగుమతులు 4 లక్షల మిలియన్ టన్నులకు పడిపోయాయి. ప్రస్తుతం సంవత్సరానికి లక్ష మిలియన్ టన్నులకు మించి సరకు రవాణా జరగడం లేదు. దీంతో రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా భారీగా పడిపోయింది. కృష్ణపట్నం పోర్టు నుంచి వివిధ దేశాలకు, బియ్యం, పొగాకు, గుంటూరు మిర్చి, పత్తి, రొయ్యల ఎగుమతి అవుతున్నాయి. అదే విధంగా మోటారు పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలతో పాటు, వివిధ పరిశ్రమలకు అవసరమైన పేపర్‌రోల్స్, ఫర్నిచర్, రసాయనాల దిగుమతి జరుగుతోంది.
సరకు రవాణా పడిపోవంతో కంటైనర్ టెర్మినల్‌ను బల్క్ కార్గోకు వినియోగించుకోవాలని అదానీ సంస్థ భావిస్తోంది. కంటైనర్ టెర్మినల్‌ను ప్రస్తుతం పాక్షికంగా ఉపసంహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కంటైనర్ టెర్మినల్ తరలింపుతో రాష్ట్రానికి పన్నుల రూపేణా వచ్చే ఆదాయం నష్టపోతున్నా సీఎం జగన్ పట్టించుకోరా అని తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్‌ను వ్యాపార ప్రయోజనాల కోసమే మూసేస్తున్నారు: సీఐటీయూ నేతలు
కృష్ణపట్నం పోర్టులో మనకు మిగిలింది బొగ్గు, బూడిదే- కంటైనర్ టెర్మినల్ మూసివేతపై అఖిలపక్షం ఆందోళన