ETV Bharat / sports

IPL 2024 ఈ సారైనా పంజాబ్ తలరాతమారేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 10:45 PM IST

IPL 2024 Punjab kings strengthness and Weakness : ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపీఎల్) మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే భారీ అంచనాలతోనే బరిలోకి దిగి చివరికి ఉసూరుమనిపించే జట్టు ఉందంటే అది పంజాబ్ కింగ్స్. మరి ఈ సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ జట్టు బలాబలాలపై ఓ లుక్కేద్దాం.

IPL 2024 ఈ సారైనా పంజాబ్ తలరాతమారేనా?
IPL 2024 ఈ సారైనా పంజాబ్ తలరాతమారేనా?

IPL 2024 Punjab kings strengthness and Weakness : ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపీఎల్) మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో ప్లేయర్స్ అంతా తమ ఫ్రాంచైజీ కాంపౌండ్​కు చేరుకుని ప్రాక్టీస్ సెషన్​ను మొదలుపెట్టేశారు. మొత్తం పది జట్లు బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ పదిలో ఐపీఎల్ ప్రారంభం సీజన్ నుంచి ఉన్న ఆ జట్టు మాత్రం చాలా తక్కువ సార్లు ప్లేఆఫ్స్‌ చేరింది. ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేదు. ప్రతిసారి సీజన్‌కు ముందు మాత్రం బెస్ట్ ప్లేయర్స్​తోనే బరిలోకి దిగుతుంది. కానీ చివరకు మాత్రం ఉసూరుమనిపిస్తుంది. అదే పంజాబ్ కింగ్స్. మరి 17వ సీజన్‌లో అయినా ఆ జట్టు ట్రోఫీని అందుకుంటుందో లేదో తెలీదు కానీ పట్టుదలతో మాత్రం బరిలోకి దిగుతోంది. ఈ సందర్భంగా ఈ జట్టు బలాబలాలపై ఓ లుక్కేద్దాం.

ఇప్పటివరకు ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్​కు రెండు సార్లు మాత్రమే అర్హత సాధించింది. 2008లో సెమీస్‌, 2014లో ఫైనల్‌ చేరింది. మిగతా 14 సీజన్లలో ఒక్కసారి కూడా లీగ్‌ దశ దాటలేదు. గత సీజన్‌లో అయితే ఎనిమిదో స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌ల్లో 6 గెలిచి, 8 మ్యాచుల్లో పరాజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ కొత్త సీజన్‌ కోసం వేలంలో కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ నెల 23న దిల్లీ క్యాపిటల్స్‌తో తమ మొదటి మ్యాచ్​లో తలపడనుంది.

టీమ్ బలాల విషయానికొస్తే ఐపీఎల్​లో ఇతర ఏ జట్టుకు లేని బలమైన పేస్‌ విభాగం పంజాబ్‌ జట్టుకు ఉండటం విశేషం. ఇప్పటికే టీమ్​లో కగిసో రబాడ, అర్ష్‌దీప్‌ సింగ్‌, సామ్‌ కరన్‌, నేథన్‌ ఎలిస్‌ ఉండగా వేలంలో హర్షల్‌ పటేల్‌, క్రిస్‌ వోక్స్‌ను తీసుకుంది. హర్షల్‌ కోసమైతే ఏకంగా రూ.11.75 కోట్లు వెచ్చించింది. వోక్స్‌ను రూ.4.2 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఇద్దరు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఆడగలరు.

కెప్టెన్‌ ధావన్‌, లివింగ్‌స్టోన్‌, బెయిర్‌స్టో, జితేశ్‌ శర్మలతో బ్యాటింగ్‌ విభాగం బలంగానే ఉంది. గాయం కారణంగా గత సీజన్‌కు దూరమైన బెయిర్‌స్టో తిరిగొచ్చాడు. ఇది కలిసి రావొచ్చు. గత సీజన్​లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ధావన్‌ (373) మరోసారి అదరగొట్టేందుకు రెడీగా ఉన్నాడు. లివింగ్‌స్టోన్‌ ఒంటిచేత్తో రాణించగలిగే సత్తా ఉంది. జితేశ్‌ శర్మ గత సీజన్‌లో రాణించి టీమ్‌ఇండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. రూ.8 కోట్ల దక్షిణాఫ్రికా టీ20 స్పెషలిస్టు బ్యాటర్‌ రొసో రాకతో బ్యాటింగ్‌ మరింత బలంగా తయారైంది. కరన్‌, లివింగ్‌స్టోన్‌, వోక్స్‌, సికందర్‌ రజా, హర్షల్‌ రూపంలో బలమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు.

బలహీనతలు విషయానికొస్తే సమష్టితత్వం కొరవడటం ఆ జట్టును బాగా దెబ్బతీస్తుంటుంది. ఇంగ్లాండ్‌ ప్లేయర్స్​ వోక్స్‌, బెయిర్‌స్టో, కరన్‌, లివింగ్‌స్టన్‌, ఫామ్‌లో లేరు. ఇది జట్టుకు మైనస్​. నాణ్యమైన స్పిన్నర్ల కొరత కూడా ఉంది. గత సీజన్‌లో స్పిన్నర్లు రాహుల్‌ చాహర్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌ కలిసి కేవలం 17 వికెట్లు మాత్రమే తీశారు. సికందర్‌ రజా, లివింగ్‌స్టోన్‌ ఉన్నప్పటికీ, అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌ లోటు అలానే ఉంది. ఫారెన్​ ప్లేయర్స్ నుంచి నలుగురిని తుది జట్టులోకి తీసుకోవడం కూడా మైనస్సే.

జట్టు : శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), బెయిర్‌స్టో, జితేశ్‌ శర్మ, లివింగ్‌స్టోన్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, రొసో, హర్‌ప్రీత్‌ భాటియా, క్రిస్‌ వోక్స్‌, శశాంక్‌ సింగ్‌, అశుతోష్‌ శర్మ, విశ్వనాథ్‌ ప్రతాప్‌, అథర్వ, తనయ్‌ త్యాగరాజన్‌, సామ్‌ కరన్‌, రిషి ధావన్‌, శివమ్‌ సింగ్‌, సికందర్‌ రజా, హర్‌ప్రీత్‌ బ్రార్‌, ప్రిన్స్‌ చౌదరి, రబాడ, అర్ష్‌దీప్‌ సింగ్‌, రాహుల్‌ చాహర్‌, నేథన్‌ ఎలిస్‌, హర్షల్‌ పటేల్‌, విద్వత్‌ కవేరప్ప.

WPL 2024 ముంబయిపై ఆర్సీబీ విజయం

కోహ్లీకి బీసీసీఐ బిగ్ షాక్​ - 2024 టీ20 వరల్డ్​ కప్ అతడు కనపడడా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.