ETV Bharat / politics

'రాజు'లు ఏలిన నరసాపురం - ఆసక్తికరంగా రాజకీయ సమరం - Narasapuram LOK SABHA ELECTIONS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 12:55 PM IST

'రాజు'లు ఏలిన నరసాపురం- ఆసక్తికరంగా రాజకీయ సమరం
'రాజు'లు ఏలిన నరసాపురం- ఆసక్తికరంగా రాజకీయ సమరం

Narasapuram Constituency : గోదావరి నదీ తీరప్రాంతం, నదీ పాయలు సముద్రంలో కలిసే అందమైన దృశ్యాలు, పేరుపాలెం బీచ్, వేలాంకిణీ మాత మందిరం నరసాపురం నియోజకవర్గానికి హంగులు అద్దుతున్నాయి. కోస్తా అందాలకు అద్దంపట్టే పాలకొల్లు, భీమవరం ప్రాంతాలు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి.

Narasapuram Constituency : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంలో క్షత్రియ, కాపు సామాజిక వర్గాల ఓట్లర్లు విజేతలను నిర్ణయిస్తారు. ఇక్కడ ఆ రెండు వర్గాలకు చెందిన వారే ఎంపీగా ఎన్నికవడం వెనుక అసలు విషయం అదే. 1991లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్‌రాజు విజయం సాధించగా ఆ సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం సంక్షోభంలో పడటంతో విజయకుమార్‌రాజు నేతృత్వంలో ఐదుగురు టీడీపీ ఎంపీలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టారు. ఆ సమయాన నరసాపురం పేరు మార్మోగింది.

నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం (Narasapuram Lok Sabha constituency) 1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్‌ కేటగిరి స్థానం. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 8 సార్లు విజయం సాధించగా.. టీడీపీ 4, బీజేపీ 2, వైఎస్సార్సీపీ, సీపీఐ చెరోసారి గెలుపొందాయి.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు

  1. ఆచంట
  2. పాలకొల్లు
  3. నరసాపురం
  4. భీమవరం
  5. ఉండి
  6. తణుకు
  7. తాడేపల్లిగూడెం

ఓటర్ల వివరాలు

  • మొత్తం ఓటర్లు 14.62 లక్షలు
  • పురుషులు 7.17 లక్షలు
  • మహిళలు 7.44 లక్షలు
  • ట్రాన్స్‌జెండర్లు 74

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వీవీ శివరామరాజుపై వైఎస్సార్సీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు 32,676 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత పార్టీలో తనకు ఎదురైన పరిణామాల నేపథ్యంలో రఘురామ వైఎస్సార్సీపీకి దూరంగా ఉంటూ వచ్చారు.

narasapuram_loksabha
narasapuram_loksabha

ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా నరసాపురం బీజేపీకి కేటాయించారు. దీంతో ఆ పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను బరిలో దించింది. బీజేపీ నుంచి రఘురామ కృష్ణరాజు పేరు బలంగా వినిపించినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా సీనియర్‌ నేత వర్మ తెర మీదకు వచ్చారు. భీమవరానికి చెందిన శ్రీనివాసవర్మ ఎంతోకాలం నుంచి పార్టీలో ఉంటూ బీజేపీ వర్మగా గుర్తింపు పొందారు. పార్టీలో వివిధ స్థాయిల్లో ఆయన పని చేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన గూడూరి ఉమాబాల పోటీ చేస్తున్నారు. ఆమె న్యాయవాది. 1995 నుంచి ఆమె క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఉమాబాల తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం గమనార్హం.

ఇప్పటివరకు గెలుపొందిన అభ్యర్థులు

1957లో జరిగిన ఎన్నికల్లో ఉద్దరాజు రామమ్‌ (సీపీఐ), 1962 - దాట్ల. బలరామరాజు (కాంగ్రెస్‌), 1967 - దాట్ల. బలరామరాజు (కాంగ్రెస్‌), 1971 - ఎం.టి.రాజు (కాంగ్రెస్‌), 1977 - అల్లూరి సుభాష్‌ చంద్రబోస్‌ (కాంగ్రెస్‌)(ఐ), 1980 - అల్లూరి సుభాష్‌ చంద్రబోస్‌ (కాంగ్రెస్‌)(ఐ), 1984 - భూపతిరాజు. విజయ్‌కుమార్‌ రాజు (టీడీపీ) విజయం సాధించారు.

గత ఎన్నికల్లో విజేతలు - సమీప ప్రత్యర్థులు

  • 1989 - భూపతిరాజు. విజయ్‌కుమార్‌ రాజు (టీడీపీ) - నాచు శేషగిరి రావు (కాంగ్రెస్)
  • 1991 - భూపతిరాజు. విజయ్‌కుమార్‌ రాజు (టీడీపీ) - ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు (కాంగ్రెస్)
  • 1996 - కొత్తపల్లి. సుబ్బారాయుడు(టీడీపీ) - కనుమూరి బాపిరాజు (కాంగ్రెస్)
  • 1998 - కనుమూరి బాపిరాజు (కాంగ్రెస్‌) - కొత్తపల్లి సుబ్బారాయుడు (టీడీపీ)
  • 1999 - కృష్ణం రాజు (బీజేపీ) - కనుమూరి బాపిరాజు (కాంగ్రెస్​)
  • 2004 - చేగొండి. హరి రామ జోగయ్య (కాంగ్రెస్‌) - ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు (బీజేపీ)
  • 2009 - కనుమూరి బాపిరాజు (కాంగ్రెస్‌) - తోట సీతారామలక్ష్మి​ (టీడీపీ)
  • 2014 - గోకరాజు గంగరాజు(బీజేపీ) - వంకా రవీంద్రనాథ్​ (వైఎస్సార్సీపీ)
  • 2019 - రఘురామ కృష్ణరాజు (వైఎస్సార్సీపీ) - వేటుకూరి వెంకట శివరామరాజు (టీడీపీ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.