ETV Bharat / politics

ఆ అభ్యర్థులందరూ కోటీశ్వరులే - ఎవరెవరికి ఎన్ని ఆస్తులున్నాయంటే - MLA Candidates Election Affidavit

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 11:10 AM IST

MP And MLA Candidates Properties: రాష్ట్రంలో పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. వీరిలో కొందరు వ్యాపారవేత్తలు, వైద్యులు, వృత్తి నిపుణులు తమ ఆస్తులను కోట్లలో చూపించారు. పోలీసు కేసులు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో ప్రస్తావించారు.

MP And MLA Candidates Properties
MP And MLA Candidates Properties

MP And MLA Candidates Properties : రాష్ట్రంలో పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. వీరిలో కొందరు వ్యాపారవేత్తలు, వైద్యులు, వృత్తి నిపుణులు తమ ఆస్తులను కోట్లలో చూపించారు. పోలీసు కేసులు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో ప్రస్తావించారు.

పెమ్మసాని చంద్రశేఖర్‌ : తన మొత్తం ఆస్తుల విలువ రూ.5,700 కోట్లుగా ఉన్నట్లు గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయనకు రూ.2,316 కోట్ల విలువైన చరాస్తులుండగా భార్య శ్రీరత్న పేరిట రూ.2,280 కోట్ల చరాస్తులు ఉన్నాయి. భార్యాభర్తలిద్దరికీ చెరో రూ.1,200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. చెరో రూ.519 కోట్ల అప్పులు ఉన్నాయి.వీటితోపాటు రూ.6.11 కోట్ల విలువైన 4 కార్లు, బ్యాంకు ఖాతాలో చెరో రూ.5.9 కోట్లు ఉన్నాయి. మొత్తం 6.86 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి.

గుంటూరు జిల్లాలో రూ.2.67 కోట్ల విలువైన సాగుభూమి, హైదరాబాద్‌లో రూ.28.1 కోట్ల భూమి, రూ.29.73 కోట్ల విలువైన వాణిజ్య భవనం, దిల్లీలో రూ.72 కోట్ల విలువైన భవనం. అమెరికాలో రూ.6.82 కోట్ల భూమి ఉన్నాయి. శ్రీరత్న పేరిట కృష్ణాజిల్లాలో రూ.2.33 కోట్ల విలువ చేసే సాగుభూమి. దిల్లీలో రూ.34.82 కోట్ల విలువైన భవనం. అమెరికాలో రూ.28.26 కోట్ల నివాస భవనాలు ఉన్నాయి.

సీఎం జగన్ ఆస్తులు రూ. 529 కోట్లు - చేతిలో రూ. 7 వేలే - CM Jagan Election Affidavit

వెలంపల్లి శ్రీనివాసరావు : విజయవాడ సెంట్రల్‌ వైఎస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.22.66 కోట్లు. ఆయన పేరున రూ.16.32 కోట్లు, భార్య శ్రీవాణి పేరిట రూ.6.33 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయి. శ్రీనివాస్‌పై రూ.3.14 కోట్లు, శ్రీవాణి పేరుతో రూ.64.85 లక్షల అప్పు ఉంది. వెలంపల్లి ఐటీ సంస్థకు రూ.9.32 లక్షలు బకాయి ఉన్నారు. 2019లో ఆయనపై 2 కేసులుండగా, ఈసారి ఏమీ లేవని పేర్కొన్నారు. వెలంపల్లి పేరిట మెర్సిడెస్‌ బెంజ్‌ (రూ.1.55 కోట్లు), కియా కార్నివాల్‌ (రూ.39.46), మహీంద్ర స్కార్పియో (రూ.16.63 లక్షలు) కార్లు, ఏడు లారీలు, ఒక ఆటో, ఒక వ్యాన్‌ ఉన్నాయి. బంగారు నగలు భార్య పేరిట 800 గ్రాములు (రూ.52లక్షలు), అతని పేరిట 200 గ్రాముల చొప్పున ఉన్నాయి.

కేశినేని శ్రీనివాస్‌(నాని) : విజయవాడ లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్‌(నాని) కుటుంబ స్థిర, చరాస్తులు రూ.77.32 కోట్లు. ఇందులో స్థిరాస్తులు రూ.69.26 కోట్లు, చరాస్తులు రూ.8.06 కోట్లు. అప్పులు రూ.38.69 కోట్లు. నాని పేరుతో రూ.35.04 కోట్లు, భార్య పావని పేరుతో రూ.1.37 కోట్ల అప్పులున్నాయి. నాని పేరుతో మరో రూ.2.27 కోట్ల అప్పు వివాదంలో ఉంది. మెర్సిడెస్‌ బెంజ్‌, రేంజ్‌ రోవర్‌, మహీంద్రా థార్‌, టాటా సఫారీ, టాటా హారియర్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ రకం 6 లగ్జరీ కార్లున్నాయి. నానిపై ఒక క్రిమినల్‌ కేసు ఉంది.

దూలం నాగేశ్వరరావు : కైకలూరు ఎమ్మెల్యే ఆస్తి రెట్టింపుఏలూరు జిల్లా కైకలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు దంపతుల ఆస్తులు 2019తో పోల్చితే రెట్టింపయ్యాయి. నాగేశ్వరరావు పేరిట ఆస్తి రూ.17.80 కోట్లు కాగా, భార్య వీరకుమారి ఆస్తి రూ.15.80 కోట్లు. 2019లో వీరి ఉమ్మడి ఆస్తి 14.63 కోట్లు. 2019లో ఆయనపై 3 పోలీసు కేసులుండగా ఇప్పుడు లేవు. భార్య పేరిట 1.01 కిలోల బంగారముంది. ఇరువురికీ రూ.10 లక్షల చొప్పున అప్పులున్నాయి.

దీపం ఉండాగనే ఇళ్లు చక్కపెట్టుకున్న వైఎస్సార్సీపీ నేతలు - రోజా ఆస్తులు ఎంతో తెలుసా? - RK Roja Properties

సింహాద్రి చంద్రశేఖరరావు : మచిలీపట్నం లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖరరావు ఆస్తులు రూ.138.41 కోట్లు. ఇందులో రూ.21.64 కోట్లు హిందూ అవిభక్త కుటుంబ(హెచ్‌యూఎఫ్‌) ఆస్తి. సింహాద్రి పేరున రూ.42.32 కోట్లు, భార్య నీలిమ పేరుతో రూ.14.04 కోట్ల చరాస్తులున్నాయి. సింహాద్రి పేరుపై రూ.34.81 కోట్లు, నీలిమ పేరున రూ.25.60 కోట్ల స్థిరాస్తి ఉంది. ఆయనపై అప్పులు, పోలీసు కేసులు లేవు.

పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి : రాజంపేట లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రూ.వేల కోట్ల కాంట్రాక్టులు చేస్తున్నారు. మిథున్‌రెడ్డి, లక్ష్మీదివ్య దంపతుల చరాస్తులు రూ.47.54 కోట్లు, స్థిరాస్తులు రూ.163.79 కోట్లు. రుణాలు రూ.54.44 కోట్లు. వీరికి పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌తో పాటు వివిధ కంపెనీల్లో రూ.13.91 కోట్ల పెట్టుబడులున్నాయి. పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ కింద రూ.11,955 కోట్ల విలువైన 55 కాంట్రాక్టు పనులు చేస్తుండగా, వీటిలో ఏపీలోనే రూ.6,646 కోట్ల విలువైన 41 పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు, కడప.. ముఖ్యంగా పుంగనూరు, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో ఎక్కువగా పనులు చేపట్టారు. ఆయనపై పోలీసు కేసుల్లేవు.

ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి : కాకినాడ నగర వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబ ఆస్తులు రూ.76.01 కోట్లు. వీటిలో చరాస్తులు రూ.11.89 కోట్లు, స్థిరాస్తులు రూ.64.11 కోట్లు. అప్పులు రూ.51.45 కోట్లు. 3.43 కిలోల బంగారం, 260 కిలోల వెండితో పాటు తన పేరిట ఇన్నోవా కారు, భార్య పేరిట హోండా సిటీ, వెర్న కార్లు ఉన్నట్లు చూపారు. ఆయనపై ఎలాంటి కేసులూ లేవు.

కురసాల కన్నబాబు : కాకినాడ గ్రామీణ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు ఎలాంటి స్థిరాస్తులూ లేవు. అతనితో పాటు కుటుంబ సభ్యుల పేరిట రూ.2.32 కోట్ల చరాస్తులు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. కన్నబాబు వద్ద 100 గ్రాములు, భార్య వద్ద అర కిలో, కుమార్తె వద్ద 300 గ్రాముల బంగారం ఉంది. రూ.21.58 లక్షల విలువైన కారు, ఉంది.

కాకాణి గోవర్ధన్‌రెడ్డి : నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైఎస్సార్సీపీ అభ్యర్థి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై 7 పోలీసు కేసులుండగా.. వాటిలో రాపూరు, నెల్లూరు ఠాణాల పరిధిలో ఓటర్లకు కల్తీ మద్యం సరఫరా చేయడంపై సీఐడీ పెట్టిన 4 కేసులు విచారణలో ఉన్నాయి. ఫోర్జరీ, చట్టసభల నిబంధనల ఉల్లంఘన వంటి కేసులూ ఉన్నాయి. కాకాణి కుటుంబ ఆస్తులు రూ.28.66 కోట్లు. అందులో మంత్రి పేరున రూ.2.43 కోట్లు, భార్య విజిత పేరిట రూ.2.36 కోట్ల చరాస్తులు ఉన్నాయి. గోవర్ధన్‌రెడ్డిపై రూ.13.70 కోట్లు, భార్య పేరున రూ.10.17 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. వీరికి అప్పుల్లేవు.

మేకపాటి విక్రమ్‌రెడ్డి : ఆత్మకూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిపై దేశవ్యాప్తంగా 8 కేసులున్నాయి. కేరళలో టోల్‌ వసూళ్లలో అక్రమాలు, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో చెక్‌ బౌన్స్‌, కంపెనీ వ్యవహారాల్లో అక్రమాలు, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వంటి అక్రమాలపై ఈడీ, ఐటీ కేసులు నమోదయ్యాయి. వీరి కుటుంబ ఆస్తుల విలువ రూ.209.22 కోట్లు. విక్రమ్‌రెడ్డి పేరున రూ.191.33 కోట్లు, భార్య వైష్ణవిరెడ్డి పేరుతో రూ.17.82 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయి. వీరికి రూ.32.64 కోట్లు అప్పు ఉంది.

కొడాలి నాని : గుడివాడ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్‌ కొడాలి నాని కుటుంబ స్థిర, చరాస్తుల మొత్తం రూ.16 కోట్లు. అప్పులు రూ.4.92 కోట్లు. మరో రూ.5.51 కోట్ల అప్పు వివాదంలో ఉంది. దంపతుల పేరుతో 2.14 కిలోల బంగారముంది. నానికి 3 లారీలు, ఒక ఫార్చ్యూనర్‌, 2 మహీంద్రా స్కార్పియోలు, ఒక మహీంద్రా జీపు, ఒక అంబాసిడర్‌ కారు ఉన్నాయి. నానిపై 2005-2018 మధ్య 5 కేసులు నమోదు కాగా, వాటిలో 4 కేసులను 2023-2024 మధ్య కొట్టేశారు. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించిన కేసులో గుడివాడ కోర్టు శిక్ష వేయగా, దీనిపై ఎగువ కోర్టులో అప్పీల్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఒక్క కేసే పెండింగ్‌లో ఉంది. నాని పదో తరగతి ఫెయిల్‌ అయ్యారు.

బొత్స ఝాన్సీ : విశాఖ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీపై ఎలాంటి కేసులూ లేవు. ఆమెకు ఆస్తులు ఎన్నున్నాయో.. అప్పులూ అంతే ఉన్నట్లు చూపించారు. ఆమెకు రెండు కార్లు (రూ.73.33 లక్షలు, రూ.8 లక్షలు), 325 తులాల బంగారం, భర్త బొత్సకు ఒక కారు (రూ.15.95 లక్షలు), 31 తులాల ఆభరణాలున్నాయి. ఇద్దరి పేరున రూ.21.19 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. చరాస్తుల్లో ఝాన్సీ పేరుతో రూ.4.75 కోట్లు, బొత్స పేరుతో రూ.3.78 కోట్లు ఉన్నాయి. ఝాన్సీ చేతిలో రూ.4.50 లక్షలు, మంత్రి వద్ద రూ.4.75 లక్షల నగదు ఉంది. స్థిరాస్తుల్లో ఝాన్సీ పేరుతో రూ.4.46 కోట్లు, భర్త పేరుతో రూ.6.75 కోట్ల విలువైన భవనాలు, భూములున్నాయి. ఝాన్సీకి రూ.2.32 కోట్లు, బొత్సకు రూ.1.92 కోట్ల అప్పులున్నాయి.

భరత్‌రామ్‌ : రాజమహేంద్రవరం నగర వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ భరత్‌రామ్‌ కుటుంబ సభ్యుల ఆస్తులు రూ.95.02 కోట్లు. 2019లో భరత్‌ దంపతుల ఆస్తుల వివరాలు చూపించగా, ఈసారి హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌)గా పేర్కొంటూ అందరి ఆస్తులను ప్రస్తావించారు. 2019లో భరత్‌ దంపతుల చరాస్తులు రూ.3.60 కోట్లు. ప్రస్తుతం భరత్‌ పేరిట రూ.7.99 కోట్లు, భార్య పేరిట రూ.35 లక్షలు, హెచ్‌యూఎఫ్‌లో రూ.15 లక్షలున్నాయి. బీఎండబ్ల్యూ ఎక్స్‌-7 (రూ.1.15 కోట్లు), జాగ్వార్‌ (రూ.31.93 లక్షలు) కార్లు ఉన్నాయి. 2019లో భరత్‌ పేరిట రూ.42.21 కోట్ల స్థిరాస్తి ఉండగా, ఇప్పుడు అతని పేరిట రూ.33.69 కోట్లు, హెచ్‌యూఎఫ్‌ పేరిట రూ.52.84 కోట్లు మొత్తంగా రూ.86.53 కోట్ల ఆస్తిని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక భరత్‌పై 3 కేసులు నమోదయ్యాయి.

అంబటి రాంబాబు : పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైఎస్సార్సీపీ అభ్యర్థి, మంత్రి అంబటి రాంబాబు చర, స్థిరాస్తులు ఐదేళ్లలో పెరిగాయి. రాంబాబు, విజయలక్ష్మి దంపతులకు 2019లో చెరో కారు ఉండగా, ప్రస్తుతం రాంబాబు పేరుపై 3 కార్లున్నాయి. ఆయన పేరిట చరాస్తులు 2019లో రూ.1.12 కోట్లు కాగా, నేడు 3.41 కోట్లు. దంపతుల స్థిరాస్తులు 2019లో రూ.6.63 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.25.07 కోట్లు. మంత్రికి రూ.6.82 కోట్లు, భార్యకు రూ.4.37 కోట్ల అప్పు ఉంది. మంత్రి రాంబాబుపై 2 కేసులుండగా, వాటిలో సంక్రాంతి సంబరాల పేరుతో టికెట్లు అమ్ముతూ లక్కీ డ్రా నిర్వహించడంపై ఒక కేసు నమోదైంది.

నారా లోకేశ్‌ : మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌ కుటుంబ ఆస్తులు రూ.542.17 కోట్లు. ఇందులో లోకేశ్‌ పేరిట చరాస్తులు రూ.341.68 కోట్లు. స్థిరాస్తులు రూ.92.31 కోట్లు. అప్పు రూ.18.44 కోట్లు. భార్య బ్రాహ్మణికి రూ.45.06 కోట్ల చరాస్తులు, రూ.35.59 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె అప్పు రూ.14.34 కోట్లు. వీరి కుమారుడు దేవాన్ష్‌ చరాస్తులు రూ.7.35 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.20.17 కోట్లు. ముగ్గురి పేరుతోనూ హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌లో షేర్లు ఉన్నాయి. రాష్ట్రంలో వివిధ ఠాణాల్లో లోకేశ్‌పై 23 కేసులున్నాయి.

శ్రీభరత్‌ : విశాఖపట్నం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్‌, భార్య తేజస్విని పేరిట ఆస్తుల విలువ రూ.393.41 కోట్లు. చరాస్తుల్లో భరత్‌ పేరిట రూ.16.89 కోట్లు, తేజస్విని పేరుతో రూ.48.36 కోట్లు ఉన్నాయి. వెరసి రూ.65.26 కోట్లు. శ్రీభరత్‌ పేరిట 7 కిలోల బంగారం, 51.80 కిలోల వెండి, తేజస్విని పేరుతో 5.3 కిలోల బంగారం, 52.50 కిలోల వెండి ఉంది. భరత్‌కు కియా, ఆడి క్యూ-7 మోడల్‌ కార్లున్నాయి. స్థిరాస్తుల్లో శ్రీభరత్‌ పేరున రూ.183.95 కోట్లు, భార్య పేరుతో రూ.44.20 కోట్ల ఆస్తులున్నాయి. భరత్‌ అప్పు రూ.36 లక్షలు. తేజస్విని అప్పు రూ.1.52 కోట్లు. బెంగళూరులోని ఓ ఠాణాలో శ్రీభరత్‌పై 2 పోలీసు కేసులున్నాయి.

పొంగూరు నారాయణ : నెల్లూరు నగరం టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ, రమాదేవి దంపతుల మొత్తం ఆస్తి రూ.824.05 కోట్లు. నారాయణ పేరిట చరాస్తులు రూ.78.66 కోట్లు. రమాదేవి పేరిట ఉన్నవి రూ.100.87 కోట్లు. ఆయన స్థిరాస్తులు రూ.207.50 కోట్లు. రమాదేవి స్థిరాస్తులు రూ.437.02 కోట్లు. నారాయణకు రూ.62.43 కోట్లు, భార్యకు రూ.127.16 కోట్ల అప్పులున్నాయి. నారాయణపై 8 కేసులున్నాయి. వీటిలో వరకట్న వేధింపులు, విద్యార్థి ఆత్మహత్య, రాజధాని అమరావతి వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులున్నాయి.

వసంత వెంకట కృష్ణప్రసాద్‌ : ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్‌పై 6 పోలీసు కేసులున్నాయి. వీటిలో సీబీఐ, ఈడీ కేసులు 2 ఉన్నాయి. వసంత స్థిరాస్తులు రూ.91.94 కోట్లు. భార్య పేరిట రూ.9.87 లక్షలు, కుమారుడి పేరిట రూ.6.18 కోట్లు, కుమార్తె పేరిట రూ.2.33 కోట్ల ఆస్తులున్నాయి. చరాస్తుల్లో అతని పేరిట రూ.81.18 కోట్లు, భార్య పేరిట రూ.6.70 కోట్లు, కుమారుడి పేరిట రూ.18.35 కోట్లు, కుమార్తె పేరున రూ.24 లక్షల చొప్పున ఉన్నాయి. వీరి అప్పులు రూ.48 కోట్లు.

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి : నెల్లూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కుటుంబ ఆస్తులు రూ.716.31 కోట్లు. వీటిలో ప్రభాకర్‌రెడ్డి పేరుతో రూ.639.26 కోట్ల చర, స్థిరాస్తులుండగా, భార్య ప్రశాంతిరెడ్డి పేరుపై రూ.77.05 కోట్లున్నాయి. ఉమ్మడి రుణం రూ.197.29 కోట్లు. రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లున్నాయి. ప్రభాకర్‌రెడ్డిపై ఆదాయ పన్నుకు సంబంధించి 6 కేసులున్నాయి. హైదరాబాద్‌లోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో ఓ కేసు పెండింగ్‌లో ఉంది.

మండలి బుద్ధప్రసాద్‌ : కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన అభ్యర్థి, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ స్థిరాస్థి విలువ రూ.33 లక్షలు. చరాస్తుల విలువ రూ.12 లక్షలు. అప్పులు రూ.32.50 లక్షలు. భార్య పేరిట 300 గ్రాముల బంగారం ఉంది. కుటుంబ ఉమ్మడి ఆస్తి రూ.77 లక్షలు.

కింజరాపు అచ్చెన్నాయుడు : శ్రీకాకుళం జిల్లా టెక్కలి టీడీపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి పేరిట రూ.1.32 కోట్లు, భార్య విజయమాధవి పేరిట రూ.4.68 కోట్ల చరాస్తులున్నాయి. అచ్చెన్న పేరిట రూ.2.31 కోట్లు, ఆమె పేరిట 6.13 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. అప్పులు అచ్చెన్నకు రూ.42.90 లక్షలు, భార్యకు రూ.3.36 కోట్లు ఉన్నాయి. ఆయన పేరిట రాష్ట్రవ్యాప్తంగా పలు స్టేషన్లలో 23 పోలీసు కేసులున్నాయి.

తంగిరాల సౌమ్య : ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, దళిత నాయకురాలు తంగిరాల సౌమ్యపై 23 కేసులు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక 2020 నుంచి ఆమె తరచూ ధర్నాలు, ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ కారణంగా నందిగామ, కంచికచర్ల, వీరులపాడు, ఇబ్రహీంపట్నం, గన్నవరం ఠాణాల్లో కలిపి 23 కేసులు నమోదయ్యాయి.

వంగలపూడి అనిత : అనకాపల్లి జిల్లా పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితపై 2019 తర్వాత 6 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు ఒక కేసు ఉండేది. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా వివిధ ఆందోళనల్లో పాల్గొన్న ఆమెపై విశాఖ, పులివెందుల, తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు, నర్సీపట్నం, నక్కపల్లి, నందిగామ స్టేషన్లలో ఈ కేసులున్నాయి. ఆమె పేరిట చరాస్తులు రూ.35.64 లక్షలు. స్థిరాస్తి (ఇల్లు) విలువ రూ.1.06 కోట్లు. బ్యాంకుల్లో రూ.1.07 కోట్ల అప్పు ఉంది.

యరపతినేని శ్రీనివాసరావు : పల్నాడు జిల్లా గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుపై 2019లో ఒక్క కేసూ లేకపోగా, ఈ ఐదేళ్లలో 22 కేసులు నమోదయ్యాయి. అతని చరాస్తులు రూ.16 లక్షలు, స్థిరాస్తులు రూ.4.కోట్లు, రూ.43 లక్షల అప్పు ఉంది.

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి : మరోవైపు తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి రూ.1,178.72 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం ఆయన భార్య సంగీతారెడ్డి పేరిట రూ.3,203.9 కోట్ల ఆస్తులు ఉన్నాయి. విశ్వేశ్వర్‌రెడ్డి భూములు, భవనాల విలువ రూ.71.35 కోట్లు. అప్పులు మొత్తం రూ.1.76 కోట్లు. విశ్వేశ్వర్‌రెడ్డిపై 4 కేసులు ఉన్నాయి.

'బుట్టా రేణుక నిరుపేద - ఆస్తులు మాత్రం రూ.161.21 కోట్లు' - Ysrcp Candidate Butta Renuka

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.