ETV Bharat / politics

విజయవాడలో నువ్వా నేనా? - కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని - Kesineni Brothers Political War

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 10:27 AM IST

Kesineni Brothers Political War: భార్యాభర్తలు, అన్నదమ్ములు, తండ్రీ కొడుకులు ఎన్నికల్లో పోటీ చేసిన సంఘటనలు ఉన్నాయి. వీటిలో ఒకే పార్టీ నుంచి వేర్వేరు నియోజకవర్గాలలో పోటీ పడ్డ సందర్భాలే ఎక్కువ. కానీ ఇక్కడ అన్నదమ్ములు ఒకే స్థానం నుంచి వేర్వేరు పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. వారే కేశినేని సోదరులు. స్థానం విజయవాడ లోక్‌సభ.

Kesineni_Brothers_Political_War
Kesineni_Brothers_Political_War

Kesineni Brothers Political War: విజయవాడ లోక్​ సభ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వడ్డే శోభనాద్రీశ్వరరావు, పర్వతనేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్‌ లాంటి వ్యక్తులు లోక్‌సభకు ఇక్కడి నుంచే వెళ్లారు. అలాంటి స్థానంలో కేశినేని బ్రదర్స్‌ ఢీ కొంటున్నారు. నువ్వానేనా అన్నట్లు పోరు మారింది. కుటుంబ తగాదాలు వ్యక్తిగత విభేదాలుగా మారి అవి రాజకీయంగా ఇప్పుడు రూపుదాల్చాయి.

విజయవాడ లోక్‌సభకు టీడీపీ కేశినేని శివనాధ్‌(చిన్ని) పేరు ప్రకటించింది. మరోవైపు సిటింగ్‌ ఎంపీగా ఉన్న కేశినేని శ్రీనివాస్‌(నాని) వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇద్దరూ సొంత అన్నదమ్ములు కావడం. రెండు ప్రధాన పార్టీలకు ప్రాతినిధ్యం వహించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా ఇదే చర్చ జరుగుతున్నా వైసీపీ నుంచి సీటు మార్చే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపించింది. తాజాగా ఆయన పేరు ఖరారు చేయడంతో పోటీ రసవత్తరంగా మారింది.

ఒకే జాతి పక్షులన్నీ ఒక గూటికి చేరినట్లు సైకోలంతా జగన్ పంచన చేరారు: కేశినేని

ఇద్దరి ప్రయాణం మొదలైంది ఇలా: 2009లో రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తితో ట్రావెల్స్‌ వ్యాపారం చూసే కేశినేని శ్రీనివాస్‌(నాని) చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అందులో కొంతకాలమే ఉన్నారు. విజయవాడ సీటు నానికి దక్కలేదు. 2013లో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్న రోజుల్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరావు ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసి పార్టీలో చేరారు. 2014లో విజయవాడ లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు. 2019లోనూ టీడీపీ తరఫున విజయం సాధించారు. రెండు సార్లు వరసగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.

ఈ ఎన్నికల్లో అన్నకు తోడుగా కేశినేని శివనాథ్‌(చిన్ని) ఎన్నికల ప్రచారంలో పాల్గొని, ఆర్థిక వ్యవహారాలు చూసే వారు. సోదరులు విడిపోయిన తర్వాత హైదరాబాద్‌లో సొంతంగా కేశినేని డెవలపర్స్‌ స్థాపించి సీఈఓగా చిన్ని ఉన్నారు. శివనాధ్‌ బీటెక్‌ చదవగా, నాని కేవలం ఇంటర్​తోనే ఆపేశారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఎక్కడో ఆర్థికంగా విభేదాలు వచ్చాయి. తర్వాత అవి కుటుంబానికి పాకాయి. క్రమేపీ కేసుల వరకు వెళ్లాయి. 2022లో ఒంగోలులో మహానాడు దీనికి ఆజ్యం పోసింది. ఈ మహానాడుకు విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని హాజరు కాలేదు. కేశినేని చిన్ని హాజరయ్యారు. దీనికి ఆయన ఎంపీ స్టిక్కర్‌ ఉన్న వాహనం తీసుకెళ్లారని దానిపై ఇక్కడ పటమట పోలీసు స్టేషన్‌లోనూ, హైదరాబాద్‌లో చిన్ని భార్య మీద ఎంపీ స్వయంగా ఫిర్యాదు చేసి ఎప్‌ఐఆర్‌ కట్టించారు. ఇది తారా స్థాయికి చేరింది. నాటి నుంచి టీడీపీలో చిన్ని క్రియాశీలకంగా ఎదగడం ప్రారంభించారు.

వైసీపీ అధికారంలో పేదలకు తీవ్ర ఇబ్బందులు: కేశినేని చిన్ని

వచ్చే ఎన్నికల్లో నువ్వానేనా: ఇద్దరూ టీడీపీలోనే ఉన్నా, కేశినేని చిన్ని 2022 నుంచే ఎన్టీఆర్‌ జిల్లాలో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రధానంగా అన్నదానం చేయడానికి అన్న క్యాంటీన్‌లు పెద్ద ఎత్తున చేపట్టి సంచార వాహనాల ద్వారా అన్నదానం చేసేవారు. దీన్ని అన్ని నియోజకవరాలకు విస్తరించారు. నియోజకవర్గ ఇంఛార్జులను కలుపుకొంటూ ముందుకెళ్లారు. మరోవైపు ఎంపీగా ఉన్న కేశినేని నాని చంద్రబాబుపై, లోకేశ్​పై ట్వీట్ల ద్వారా విమర్శలు గుప్పించే వారు. దిల్లీ విమానాశ్రయంలో అధినేత చంద్రబాబుకు పూలబొకే ఇచ్చే క్రమంలో కేశినేని నాని అసహనం వ్యక్తం చేశారు. ఇది పార్టీలో చర్చనీయాంశమైంది.

చంద్రబాబు ఆరెస్టు వ్యవహారంలోనూ వివాదస్పదంగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. తిరువూరు టీడీపీ ‘రా కదిలిరా’ సభకు చిన్నికి ఇంఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో నాని దానికి హాజరు కాలేదు. వెంటనే వైసీపీలో చేరిపోయారు. వైసీపీ నుంచి పార్టీ కండువా కప్పుకోకముందే విజయవాడ లోక్‌సభకు అభ్యర్థిగా ప్రకటించారు. 2019లో గెలిచిన తర్వాత తాను సొంత ఇమేజ్‌తో గెలిచానని, అందరూ ఓడిపోతే తాను ఒక్కడినే గెలిచానంటూ ‘అహం’ ప్రదర్శించారనేది పార్టీలో ఉన్న విమర్శ.

వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ అన్నదమ్ముల మధ్య నువ్వానేనా అన్నట్లు ఉంది. నిన్నటి వరకు వైసీపీ అధినేత సీఎం జగన్‌ను విమర్శించిన కేశినేని నాని ఇప్పుడు ఆయనను కీర్తిస్తున్నారు. అమరావతి కావాలన్న ఆయన ఇప్పుడు వైసీపీకి వంతపాడుతున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. తన సోదరుడిని పిట్టలదొరగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు కేశినేని చిన్ని ఇవేవీ పట్టించుకోకుండా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. అన్నా క్యాంటీన్లు, వైద్య శిబిరాలు, కుట్టు మిషన్లు పంపిణీ, జాబ్‌మేళాలు నిర్వహించడం ద్వారా జనంలోకి వెళ్లారు. ఎంపీ మాత్రం టాటా ట్రస్టు అంటూ 2014 నుంచి 2019 మధ్య ఇచ్చిన ట్రాక్టర్లు, ఇతర కార్యక్రమాలు చెబుతుంటారు.

కేశినేని నాని జగన్‌కు పాలేరు, ఇన్‌ఛార్జిలకు అసిస్టెంట్: కేశినేని చిన్ని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.