ETV Bharat / politics

'విజయవాడకు వస్తే అరెస్టే' సీపీఎస్​ ఉద్యోగుల 'ఛలో విజయవాడ'పై ప్రభుత్వం ఉక్కుపాదం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 8:48 AM IST

Updated : Feb 18, 2024, 9:32 AM IST

cps_employees_chalo_vijayawada
cps_employees_chalo_vijayawada

CPS Employees Chalo Vijayawada: పోలీసుల అనుమతి నిరాకరణతో సీపీఎస్​ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. ఉద్యోగులు ఎవరైనా విజయవాడకు వస్తే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారిని అరెస్టు చేసేందుకు వాహనాలను సిద్ధం చేశారు.

CPS Employees Chalo Vijayawada: ఓట్ ఫర్ ఓపీఎస్‌ నినాదంతో సీపీఎస్​ఈఏ చేపట్టిన చలో విజయవాడపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటికే విజయవాడలోని ధర్నాచౌక్​ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ధర్నాచౌక్ వైపు ఎవరు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. చలో విజయవాడకు అనుమతి లేదని సీపీఎస్‌ ఉద్యోగులు విజయవాడకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. ఉద్యోగులు ఎవరైనా విజయవాడ వస్తే వారిని అరెస్ట్ చేసేందుకు వాహనాలను కూడా సిద్ధం చేశారు. పోలీసుల తీరుపై సీపీఎస్​ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్ చేసిన మోసంపై సీపీఎస్ ఉద్యోగులు మరోసారి రోడెక్కేందుకు సిద్ధమయ్యారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామంటూ గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చి చేతులెత్తేశారు. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నాలుగున్నరేళ్లుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. ఉద్యోగుల ఆందోళనతో ప్రభుత్వం సీపీఎస్​పై ఆలోచనలో పడింది.

సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతులు లేవు- వస్తే అరెస్టులే: డీసీపీ

సీపీఎస్ రద్దు అనేది సాధ్యం కాదని భావించి, ఉద్యోగులు, ఉపాధ్యాయల దృష్టి మళ్లీంచేందుకు సీపీఎస్ బదులు జీపీఎస్ అంటూ మరో గుదిబండను తెచ్చి సీపీఎస్ ఉద్యోగుల నెత్తిన రుద్దారు. ఇదేమని ఉద్యోగులు ప్రశ్నిస్తే సీపీఎస్ పై అప్పట్లో జగన్​కు అవగాహన లేదని అందుకే హామీ ఇచ్చారని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీపీఎస్​ను నిరసిస్తూ ఏపీసీపీఎస్​ఈఏ ఆధ్వర్యంలో నేడు సీపీఎస్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమయ్యారు.

పాత పెన్షన్ సాధనకు ఆదివారం ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మోతమోగిస్తున్నారు. సీపీఎస్, జీపీఎస్ రద్దు చేసి వెంటనే ఓపీఎస్ పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమం జరగకుండా ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. విజయవాడకు సీపీఎస్ ఉద్యోగులు వస్తారన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులకు, ఉద్యోగ సంఘ నాయకులకు పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నోటీసులు ఇస్తున్నారు. పోలీసుల తీరుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇచ్చిన హామీలను అడిగితేనే అంక్షలా - సీపీఎస్ ఉద్యోగులకు పోలీసుల నోటీసులు

ఛలో విజయవాడ జరగకుండా పోలీసులు సీపీఎస్​ ఉద్యోగుల ఇళ్లకు, వారు పనిచేసే ప్రదేశాలకూ వెళ్లి నేరుగా వెళ్లి నోటీసులు అందజేస్తున్నారు. ఛలో విజయవాడకు పోలీసు శాఖ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ అనుమతులు లేవని తెలిపారు. నోటీసులను కాదని విజయవాడ వెళ్లితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలో ఇదే నిదంగా నోటీసులిచ్చి, ఆపై విచారణ పేరిట స్టేషన్లకు పిలిపించి ఉద్యోగులను రోజంతా స్టేషన్లలోనే ఉంచేశారు. ఉద్యోగులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు.

గతంలో మాదిరే నేడు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులపై నిర్బంధకాండ ప్రయోగిస్తున్నారు. ఛలో విజయవాడ నేపథ్యంలో పోలీసులు విజయవాడలోని ధర్నా చౌక్​ను వారి ఆధీనంలోకి తీసుకున్నారు. సీపీఎస్​ ఉద్యోగులు ఎవరు ధర్నాచౌక్​కి రాకుండా బారీ గేట్లు అడ్డుగా పెట్టారు. ఎవరైనా ఉద్యోగులు వస్తే వారిని అరెస్ట్ చేసేందుకు వాహనాలను కూడా సిద్దం చేశారు.

విశాఖ వేదికగా జగన్ తీరుపై సీపీఎస్ అసోసియేషన్ ఆగ్రహం- ఇచ్చేది భిక్షకాదు, హక్కంటూ మండిపాటు!

ఛలో విజయవాడ కార్యక్రమంపై ప్రభుత్వం ఇన్ని నిర్భంధం విధించడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఓట్ ఫర్ ఓపీఎస్ పేరుతో ఏపీసీసీఎస్ఈఏ చేపట్టిన ఛలో విజయవాడకు తాము మద్దతు ఇస్తున్నామని, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా ఈ ప్రభుత్వం లేకుండా చేస్తుందని వారు ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన సీపీఎస్ ఉద్యోగులకు పోలీసులు ఎక్కడికక్కడ నోటీసులు ఇస్తున్నారు. నోటీసులివ్వడంతో పాటు పోలీసులు పదేపదే ఫోన్లు చేసి ఇబ్బందులు పెడుతున్నారని సీపీఎస్ ఉద్యోగులు వాపోతున్నారు. తాము శాంతియుతంగా చేపట్టే కార్యక్రమంలో పాల్గొనకుండా ప్రభుత్వం ఎందుకు నిర్భందాలు ప్రయోగిస్తుందో అర్థం కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓపీఎస్ సాధించే వరకు ఉద్యమం ఆగదు- సాగర సంగ్రామ దీక్షలో నినదించిన ఉద్యోగులు

సీపీఎస్ఈఏ చేపట్టిన ఛలో విజయవాడకు అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. నేడు జరిగే కార్యక్రమంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. పోలీసులు ఇలా భారీ మోహరించి ఉద్యోగులను భయాందోళనకు గురి చేయాలని ప్రభుత్వం భావిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తర్వాత తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియకుండా తాము ఉద్యోగాలు చేస్తున్నామని చెబుతున్నారు. తమకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు వచ్చే ఆర్ధిక ప్రయోజనాలకు కూడా ఈ ప్రభుత్వం కొర్రిలు వేస్తుందని మండిపడుతున్నారు.

ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదంతో నేడు తలపెట్టిన ఛలో విజయవాడకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. ఓపీఎస్ పునరుద్ధరించే వారికే తమ ఓట్లు వేస్తామని ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వం చేసిన మోసానికి వచ్చే ఎన్నికల్లో సర్కారుకు గుణపాఠం చెప్పడానికి ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఓట్ ఫర్ ఓపీఎస్ సదస్సు - 'సీపీఎస్​ రద్దు చేసే పార్టీకే ఓటు'

Last Updated :Feb 18, 2024, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.