ETV Bharat / bharat

నేడే శ్రీరామనవమి - స్వామి ప్రసాదం పానకం, వడపప్పు ఇలా తయారు చేయండి - SRI RAMA NAVAMI NAIVEDYAM RECIPES

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 1:41 PM IST

Updated : Apr 17, 2024, 9:27 AM IST

Sri Rama Navami Panakam : కోదండరాముడి కల్యాణం నేడే. అంగరంగవైభంగా సీతారాముల కల్యాణం జరిపేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఈ పర్వదినాన స్వామివారికి నైవేద్యంగా పానకం, వడపప్పు సమర్పించి, భక్తులు ఆరగిస్తారు. మరి.. చక్కటి పానకం, వడపప్పు ఎలా తయారు చేయాలో మీకు తెలుసా?

Sri Rama Navami Panakam
Sri Rama Navami Panakam

Ram Navami Naivedyam Making Process : జగదభిరాముడి కల్యాణ వేడుక 'శ్రీరామనవమి'(Sri Rama Navami 2024)కి సర్వం సిద్ధమైంది. ఈ ఉత్సవం కోసం దేశంలోని రామభక్తులంతా ఏర్పాట్లు పూర్తి చేశారు. కోదండరాముడి కల్యాణాన్ని కళ్లారా చూసి తరించేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ శుభవేళ శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం, వడపప్పు, చలిమిడి.. వంటివి నైవేద్యంగా సమర్పించి.. ఆ తర్వాత వీటిని ప్రసాదంగా పంచిపెడతారు. మరి.. ఈ పానకం, వడపప్పు ఎలా తయారు చేయాలో తెలుసా?

పానకం తయారీకి కావాల్సిన పదార్థాలు :

 • బెల్లం తరుగు - అరకప్పు
 • నీళ్లు - రెండు కప్పులు
 • మిరియాలపొడి - పావు చెంచా
 • శొంఠిపొడి - పావుచెంచా
 • యాలకులపొడి - అరచెంచా
 • ఉప్పు - చిటికెడు
 • నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు
 • పచ్చకర్పూరం - చిటికెడు
 • తులసి ఆకులు - ఐదారు

పానకం తయారీ విధానం :

 • ముందుగా ఓ గిన్నెలో వాటర్ తీసుకొని అందులో బెల్లం తరుగు వేసుకొని పెట్టుకోవాలి.
 • బెల్లం పూర్తిగా కరిగిందనుకున్నాక వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
 • ఆ మిశ్రమంలో మిరియాల పొడి, యాలకుల పొడి, శొంఠి పొడి, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
 • అలాగే ఉప్పు, పచ్చకర్పూరం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి.
 • ఆ తర్వాత పానకాన్ని గ్లాసుల్లో పోశాక తులసి ఆకులు, కావాలంటే రెండు ఐస్​ముక్కలు వేసుకుంటే సరి.
 • అంతే.. ఎంతో రుచికరంగా ఉండే తియ్యతియ్యటి బెల్లం పానకం రెడీ..!

ఆరోగ్య ప్రయోజనాలు :

 • పానకంలో వేసే బెల్లం, మిరియాల పొడి, తులసి ఆకులు, శొంఠి... అన్నింటిలో ఔషధ గుణాలున్నాయి. కాబట్టి వేసవిలో వచ్చే శ్రీ రామనవమి పర్వదినాన ఈ పానకం తీసుకుంటే వేసవి తాపాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
 • అంతేకాకుండా.. బెల్లంలో ఐరన్, పొటాషియం, భాస్వరం తదితరాలు ఉన్నందున వెంటనే శక్తి లభిస్తుందని, రక్తహీనత బారిన పడనివ్వకుండా కాపాడుతుందని చెబుతున్నారు నిపుణులు.
 • అలాగే రక్తపోటును అదుపులో ఉంచడమే కాకుండా.. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందంటున్నారు. ఎసిడిటీ, జీర్ణసమస్యలూ దూరమవుతాయి. నెలసరి సమస్యలను తగ్గిస్తుంది.
 • ముఖ్యంగా ఎండలకు చిన్నారులు త్వరగా అలసిపోతుంటారు. ఆ నీరసం పానకంతో తగ్గుతుంది.
 • అలాగే మిరియాలు, తులసి ఆకుల్లో దగ్గు, కఫం తగ్గించే ఔషధ గుణాలుంటాయి.
 • శొంఠిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆకలిని పెంచుతాయి, రోగనిరోధక శక్తినిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

శ్రీరామ నవమికి నైవేద్యాలివిగో..!

వడపప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు :

 • ఒక కప్పు - పెసరపప్పు
 • మూడు చెంచాలు - తురిమిన కొబ్బరి
 • 2-3 పచ్చిమిర్చి - చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
 • చెంచా - నిమ్మరసం
 • రుచికి తగినంత - ఉప్పు
 • అలంకరణ కోసం - కొత్తిమీర

తయారీ విధానం :

 • ముందుగా ఒక బౌల్​లో గోరువెచ్చని వాటర్ తీసుకొని పెసరపప్పును అరగంట పాటు నానబెట్టుకోవాలి.
 • ఆ తర్వాత నీరు వడకట్టుకుని పెసరపప్పును పక్కన పెట్టుకోవాలి.
 • అనంతరం ఆ పప్పులో పైన పేర్కొన్న ఇతర పదార్థాలన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి.
 • ఆపై కొత్తిమీరను కొద్దిగా గార్నిష్ చేసుకోవాలి. అంతే.. రుచికరమైన వడపప్పు రెడీ..!

ఆరోగ్య ప్రయోజనాలు :

 • పెసరపప్పులో విటమిన్ ఎ, బి, సి, ఇ తో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్.. వంటి ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో వివిధ అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి.
 • అలాగే పెసరపప్పులో అధికంగా ఉండే ప్రొటీన్, ఫైబర్.. వంటివి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గించేందుకు సహకరిస్తాయని చెబుతున్నారు నిపుణులు.
 • అదేవిధంగా ఈ పప్పులో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు, ఇతర ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
 • జీర్ణవ్యవస్థను పటిష్ఠపరచడానికి పెసరపప్పు బాగా తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

రామయ్యకు.. భక్తితో నైవేద్యాలు చేయండిలా!

Last Updated :Apr 17, 2024, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.