ETV Bharat / bharat

'రామజ్యోతిని' వెలిగించిన మోదీ- పసిడి కాంతుల్లో అయోధ్య

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 10:36 PM IST

Updated : Jan 23, 2024, 6:35 AM IST

PM Modi Lights Ram Jyoti : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి దేశవ్యాప్తంగా ప్రధాని మోదీతో పాటు ప్రముఖ నాయకులు, ప్రజలు దీపాలను వెలిగించి రామనామ స్మరణ చేశారు. అత్యంత వైభవంగా నిర్వహించి రాముడిపై తమకున్న భక్తిని చాటుకున్నారు.

Pm Modi Lights Ram Jyoti
Pm Modi Lights Ram Jyoti

PM Modi Lights Ram Jyoti : రామ్​లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అందులో భాగంగా ప్రముఖ నాయకులు, ప్రజలు రాత్రి 'రామజ్యోతిని' వెలిగించి రామునిపై తమ భక్తిని చాటుకున్నారు. మరికొందరు బాణసంచా కాల్చి జై శ్రీరామ్‌ అనే నామస్మరణతో సంబరాలు చేసుకున్నారు.

ప్రధానమంత్రి మోదీ దిల్లీలోని తన నివాసంలో రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బాల రాముని చిత్రపటం ముందు జ్యోతులను వెలిగించారు. రాముడి చిత్రపటానికి హారతి ఇచ్చారు. వీటికి సంబంధించిన ఫొటోలను 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి రామనామస్మరణ చేస్తూ దీపోత్సవం జరుపుకొన్నారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠాపనను పురస్కరించుకొని తమిళనాడులోని చెన్నైలో ప్రజలు రహదారులపై ఆలయరూపంలో దీపాలను వెలిగించారు. ఆ వెలుగుల మధ్యలో రాముని చిత్రపటాన్ని ఉంచి రామనామ స్మరణచేస్తూ దీపోత్సవం జరుపుకొన్నారు.

రామ్​లల్లా ప్రాణప్రతిష్ఠాపనను పురస్కరించుకొని సరయూ ఘాట్​ వద్ద దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రామనామాన్ని పలికారు. రామ​జ్యోతి కార్యక్రమంలో భాగంగా ఛండీగఢ్‌లోని రాయ్‌పూర్‌లో ప్రజలు భారీ సంఖ్యలో మైదానం వద్దకు చేరి మట్టితో చేసిన ప్రమిదల్లో జ్యోతులు వెలిగించారు. మరికొంత మంది బాణసంచా పేల్చి రామునిపై తమ అభిమానాన్ని తెలిపారు. గుజరాత్‌ సీఎం భుపేంద్ర పటేల్‌ తన అధికార నివాసంలో దీపాలను వెలిగించి రాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు చేసుకున్నారు.

2.5 లక్షల నూనె దీపాలతో రామజ్యోతి
శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రామ్​లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన సందర్భంగా సీతాదేవి పుట్టినప్రాంతమైన నేపాల్​లోని జనక్​పుర్​లో 2.5 లక్షల నూనె దీపాలను వెలగించారు. ఆ దీపాలన్నింటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చి, చుట్టూ రంగోళీలు వేసి బాలరామునిపై తమకు ఉన్న భక్తిని చాటుకున్నారు.

ఘనంగా రామ్​లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం
శ్రీరామజన్మభూమి అయోధ్యలో చారిత్రక ఘట్ట ఆవిష్కృతమైంది. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. దిల్లీ నుంచి అయోధ్య వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ దుస్తులతో శ్రీరాముడి భవ్యమందిరానికి చేరుకున్నారు. రాముడికి ప్రత్యేక వస్త్రాలను తీసుకుని వచ్చి పండితులకు సమర్పించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య యాజమాన్‌గా మోదీ వ్యవహరించారు. ప్రధాని మోదీ సమక్షంలో ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రాలు, మంగళవాద్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ పక్కనే RSS అధినేత మోహన్ భగవత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆశీనులై పూజల్లో పాల్గొన్నారు.

కోట్లాది మంది కల సాకారం- అయోధ్యలో కొలువుదీరిన శ్రీరాముడు

'జనవరి 22 నవయుగానికి ప్రతీక- రాముడిని క్షమించమని కోరుతున్నా'

Last Updated : Jan 23, 2024, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.