ETV Bharat / bharat

బిహార్​లో NDA సీట్ల పంపకం పూర్తి- మెజారిటీ స్థానాల్లో బీజేపీ పోటీ- ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 7:26 PM IST

Updated : Mar 18, 2024, 8:54 PM IST

NDA Seat Sharing In Bihar : బిహార్​లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర బీజేపీ ఇన్​ఛార్జి వినోద్​ తావ్​డే వివరాలు వెల్లడించారు. పొత్తులో భాగంగా బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయంటే?

NDA Seat Sharing In Bihar
NDA Seat Sharing In Bihar

NDA Seat Sharing In Bihar : బిహార్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి సీట్ల పంపకం పూర్తి అయ్యింది. ఈ మేరకు బీజేపీ బిహార్‌ ఇన్‌ఛార్జ్‌ వినోద్‌ తావ్‌డే ప్రకటించారు. మెుత్తం 40 లోక్‌సభ సీట్లు ఉన్న బిహార్‌లో 17 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. నీతీశ్​ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేయనుంది. దివంగత రాంవిలాస్‌ పాసవాన్ కుమారుడు చిరాగ్‌ పాసవాన్​కు చెందిన లోక్‌ జనశక్తి- రాంవిలాస్‌ పార్టీ ఐదు స్థానాల్లో బరిలోకి దిగనుంది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన ఉపేంద్ర కుష్వాహా, హిందుస్థానీ అవామ్ మోర్చా చెరో సీటులో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్ హాజీపుర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ చీఫ్‌ రాజ్‌ తివారీ తెలిపారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని కూటమిలోని పార్టీలు వెల్లడించాయి.

అయితే తాజా సీట్ల సర్దుబాటు వల్ల మొదటిసారి బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లైంది. 2019లో ఈ రెండు పార్టీలు చెరో 17 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఇక అప్పుడు ఒకటిగా ఉన్న రాం విలాస్​ పాసవాన్​ నేతృత్వంలోని లోక్​ జనశక్తి ఆరు స్థానాల్లో పోటీ పడింది. బీజేపీ, ఎల్​జేపీ తాము పోటీ చేసిన అన్ని సీట్లు గెలవగా, జేడీయూ 18 స్థానాల్లో విజయం సాధించింది. ఇదిలా ఉండగా, సీట్ల పంపకం వివరాలు తెలియజేసిన వినోద్​ తావ్​డే, ఈ లోక్​సభ ఎన్నికల్లో బిహార్​లో మొత్తం 40 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

కర్ణాటకలో జేడీఎస్​ అంసతృప్తి!
ఎన్నికలకు దగ్గర పడుతున్నతున్న సమయంలో మిగిలిన అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్డీఏ మిత్ర పక్షాలతో సీట్ల సర్దుబాటుపై సన్నాహాల చేస్తోంది. అయితే కర్ణాటకలో బీజేపీతో పొత్తులో ఉన్న జేడీఎస్​కు రెండు స్థానాలే ఇస్తారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీట్ల పంపకంపై ఆ పార్టీ అధ్యక్షుడు హెచ్​డీ కుమారస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు నుంచి నాలుగు సీట్లు ఇస్తారని నమ్మకం ఉన్నట్లు తెలిపారు. పొత్తులో జేడీఎస్​ను గౌరవంగా చూడవలసిన అవసరాన్ని పార్టీ నేతలు కుమారస్వామికి చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా జేడీఎస్​కు 18 లోక్​సభ స్థానాల్లో బలం ఉన్న విషయం అర్థమయ్యేలా బీజేపీతో మాట్లాడాలని సూచించినట్లు తెలుస్తోంది.

తమిళనాడులో ఇండియా కూటమి పొత్తు ఫైనల్
రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం తమిళనాడులో కాంగ్రెస్​- అధికార డీఎంకేల మధ్య సీట్ల పంపకం పూర్తైంది. ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్​ పార్టీకి 9 స్థానాల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించింది స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే పార్టీ. శివగంగ, కడ్డలోర్​, క్రిష్ణగిరి, కన్యాకుమారీ సహా మొత్తం 9 చోట్లా వచ్చే లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ పోటీ చేయనుందని డీఎంకే ప్రకటించింది. ఇరు పార్టీల నేతలు ఈ అగ్రీమెంట్​పై అన్నా అరివాలయంలోని డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో సంతకాలు చేశారు.

Last Updated : Mar 18, 2024, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.