ETV Bharat / bharat

గంటకు ప్రైవేట్ ఫ్లైట్​ రెంట్​ రూ.5లక్షలు- మరి హెలికాప్టర్​కు నేతలు ఎంత చెలిస్తున్నారంటే? - Lok Sabha Polls Private Jets Demand

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 4:34 PM IST

Lok Sabha Polls Demand For Private Jets
Lok Sabha Polls Demand For Private Jets

Lok Sabha Polls Demand For Private Jets : లోక్‌సభ ఎన్నికల వేళ ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్ల డిమాండ్ దాదాపు 40 శాతం పెరిగింది. ఇదే అదనుగా వాటిని అద్దెకు ఇచ్చే కంపెనీలు రేట్లను పెంచేశాయి. దీంతో ఆయా కంపెనీల ఆదాయం మరో 15 నుంచి 20 శాతం మేర పెరిగిపోయింది.

Lok Sabha Polls Demand For Private Jets : లోక్‌సభ ఎన్నికల వేళ ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్ల డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. రాజకీయ నాయకులు, ఆయా పార్టీల నుంచి ఒక్కసారిగా ఆర్డర్లు వెల్లువెత్తుతుండటం వల్ల ఛార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్ల డిమాండ్ దాదాపు 40 శాతం ఎగబాకింది. దీనివల్ల వాటికి సంబంధించిన సేవలు అందించే కంపెనీల ఆదాయం మరో 15 నుంచి 20 శాతం మేర పెరగనుంది.

చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్ల సర్వీసులకు గంటల వారీగా ఛార్జీలను వసూలు చేస్తుంటారు. ప్రస్తుతం ఛార్టర్డ్ విమానానికి గంటకు రూ.4.5 లక్షల నుంచి రూ.5.25 లక్షలు, ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్‌కు గంటకు రూ.1.5 లక్షల నుంచి రూ.1.7 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మునుపటి ఎన్నికల సీజన్‌తో పోలిస్తే ఈ రేట్లు చాలా ఎక్కువ. సాధారణ సమయాల్లో వీటి ఛార్జీలు తక్కువే ఉంటాయి.

వెట్ లీజుకు సన్నాహాలు
ఛార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్ల లభ్యత తక్కువగా ఉన్నందున ప్రస్తుతం వాటి రేట్లు పెరిగాయన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సేవలందిస్తున్న కంపెనీలు మార్కెట్ అవసరాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతున్నాయి. వాటి నుంచి చిన్నసైజు విమానాలను 'వెట్ లీజు'కు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. విమానాన్ని సిబ్బంది, ఇన్సూరెన్స్‌ సహా అన్ని సౌకర్యాలను కలిపి లీజుకు ఇస్తే దాన్ని 'వెట్ లీజు' అని పిలుస్తారు. దీని వల్ల విమానం లేదా హెలికాప్టర్‌ను లీజుకు తీసుకునే సంస్థపై పెద్దగా నిర్వహణ భారం ఉండదు.

ఏపీ, యూపీ వంటి పెద్ద రాష్ట్రాల్లో!
సాధారణ సమయంతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో హెలికాప్టర్ల డిమాండ్ దాదాపు 25 శాతం పెరిగిందని రోటరీ వింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఆర్‌డబ్ల్యూఎస్‌ఐ) అధ్యక్షుడు (వెస్ట్రన్ రీజియన్) కెప్టెన్ ఉదయ్ గెల్లి తెలిపారు. "రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లను వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నాయి. ప్రత్యేకించి స్టార్ క్యాంపెయినర్లకు హెలికాప్టర్లను అందిస్తే తక్కువ సమయంలో సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాలను కవర్ చేయొచ్చనే అంచనాలతో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో హెలికాప్టర్ల వినియోగం ఎక్కువగా కనిపిస్తోంది" అని ఉదయ్ గెల్లి చెప్పారు.

రేట్లు డబుల్- గంటకు ఎంతంటే?
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే చార్టర్డ్ విమానాల డిమాండ్ 40 శాతం పెరిగిందని బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ (బీఏఓఏ) మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ ఆర్కే బాలి చెప్పారు. "సాధారణంగా సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లకు గంటకు రూ. 80వేల నుంచి రూ.90వేల వరకు రేటు ఉంటుంది. ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్లకు గంటకు రూ. 1.50 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు రేటు ఉంటుంది. ఇది ఎన్నికల సమయం అయినందున సింగిల్ ఇంజన్ హెలికాప్టర్లకు గంటకు ఏకంగా రూ.1.50 లక్షల వరకు రేటును వసూలు చేస్తున్నారు. ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్లకు గంటకు రూ. 3.5 లక్షలు తీసుకుంటున్నారు" అని బాలి వివరించారు. ఛార్టర్డ్ విమానాల అద్దె రేటు గంటకు రూ. 4.5 లక్షల నుంచి రూ. 5.25 లక్షల మధ్య ఉందన్నారు. సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌లో పైలట్‌ సహా 7 మంది కూర్చునే సౌకర్యం ఉంటుంది. ట్విన్ ఇంజన్ హెలికాప్టర్‌లో 12 మంది కూర్చోవచ్చు.

2019లో ఈ ఖర్చులో బీజేపీయే టాప్
2019-20 సంవత్సరానికిగానూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదిక ప్రకారం- ఆ పార్టీ విమానాలు, హెలికాప్టర్ల అద్దె చెల్లింపుల కోసం అప్పుడు ఎన్నికల్లో దాదాపు రూ.250 కోట్లకుపైగా ఖర్చు చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఖర్చు రూ.126 కోట్లు. అయితే ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆడిట్ నివేదికలో దీని వివరాలను ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఏడు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. 44 రోజుల పాటు దేశవ్యాప్తంగా మొత్తం 10.5 లక్షల పోలింగ్ బూత్‌లలో ఓట్ల పండుగ జరుగుతుంది. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.