MP Kesineni Nani Comments: వాలంటీర్లు అధికార పార్టీకి వంతపాడితే అంగీకరించం : ఎంపీ కేశినేని
MP Keshineni Nani distributed tractors to farmers: వాలంటీర్ల వ్యవస్థపై విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 'వాలంటీర్లు ప్రజల కోసమే పని చేయాలి తప్ప అధికార పార్టీకి వంతపాడితే అంగీకరించం' అని అన్నారు. ప్రజల మంచి కోసం ఎవరైనా పనిచేస్తామంటే తాము స్వాగతిస్తామన్నారు. విజయవాడ పరిధిలోని రైతులకు ఎంపీ కేశినేని నాని ఈరోజు సబ్సిడీపై 2వ దశలో 25 ట్రాక్టర్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే.. రైతు ఆనందంగా ఉండాలన్నారు. రైతు బాగుండాలనేదే తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లను అందించారన్న కేశినేని.. టీడీపీ అధికారంలో లేకపోవడం వల్ల రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో సబ్సిడీపై సుమారు 1000 ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నామని, రాష్ట్రంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
వాలంటీర్లు ప్రజల కోసమే పని చేయాలి.. వైసీపీకి వంతపాడితే అంగీకరించం..విజయవాడ ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లతోపాటు మరెవరైనా ప్రజల కోసం పనిచేస్తే తాము స్వాగతిస్తామన్నారు. అలా కాకుండా అధికార పార్టీకి వంతపాడితే.. అంగీకరించేది లేదని తేల్పిచెప్పారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రైతు ఆనందంగా ఉండాలని, అందుకోసమే వీలైనంత మందికి సబ్సిడీపై ట్రాక్టర్లు అందిస్తున్నామన్నారు. అన్ని జిల్లాలకు చెందిన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.