సమస్యలు వింటూ, వినతులు స్వీకరిస్తూ - 218వ రోజుకు లోకేశ్ యువగళం పాదయాత్ర
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 10, 2023, 1:36 PM IST
Nara Lokesh Yuvagalam Padayatra in Kakinada District : కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. తొండంగి మండలం ఒంటిమామిడి నుంచి యాత్రను ప్రారంభించిన యువనేత స్థానికుల సమస్యలు వింటూ వారిలో భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. పెద్దసంఖ్యలో యువకులు, మహిళలు పాదయాత్రలో భాగమవుతున్నారు. శృంగవృక్షం, తిమ్మాపురం మీదుగా తేటగుంట వరకు ఈ పాదయాత్ర సాగనుంది.
పాదయాత్రలో మత్స్యకారులు, హేచరీల యజమానులు, తీరప్రాంత గ్రామాల ప్రజలు, వివిధ సామాజిక వర్గాల వారు లోకేశ్‌ను కలిసి సమస్యలపై వినతులు అందించారు. అలాగే తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలు వేలాదిగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. సైకోపోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు యాత్రలో హోరెత్తాయి. ఇప్పటికి 2,990.4 కి.మీ యాత్ర పూర్తిచేసుకున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. యాత్రలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, చిక్కాల రామచంద్రరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, వనమాడి కొండబాబు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తదితరులు పాల్గొన్నారు.