Protest against MLC Duvvada Srinivas ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని అడ్డుకున్న మూలపేట పోర్ట్ నిర్వాసితులు..
Moolapet Port Residents Protest against MLC Duvvada Srinivas : శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్ట్ నిర్వాసితులు... వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు చుక్కలు చూపించారు. పోర్టు వాహనాలను అడ్డుకోవడంపై గ్రామస్థులతో చర్చించేందుకు టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి... దువ్వాడ శ్రీనివాస్ గ్రామానికి వచ్చారు. జీడి చెట్లకు 5వేల చొప్పున పరిహారం ఇస్తామని మాటిచ్చి, సగం కూడా చెల్లించడం లేదని గ్రామస్థులు ప్రశ్నించగా... తానెప్పుడూ అలాంటి హామీ ఇవ్వలేదని దువ్వాడ అన్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన గ్రామస్థులు... నమ్మకం ద్రోహం చేస్తున్నారంటూ నినాదాలు చేశారు. గ్రామం తరఫున సంప్రదింపులకు ఐదుగురు మాత్రమే రావాలని దువ్వాడ చెప్పడంపై మండిపడ్డారు. అందరి ముందు మాట్లాడాలని పట్టుబట్టారు. దువ్వాడ అనుచరులకు పోర్టు పనులు అప్పగించి, స్థానిక యువతకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిర్వాసితులకు జవాబు చెప్పలేక వాహనం ఎక్కి వెళ్లిపోయేందుకు యత్నించిన దువ్వాడ శ్రీనివాస్ ను... వెంబడించి మరీ గ్రామస్థులు అడ్డగించారు. ఈ సమాచారం తెలిసి పోలీసు సిబ్బందితో మూలపేటకు వచ్చిన డీఎస్పీ బాలచంద్రారెడ్డి... గ్రామస్థులను నిలువరించి ఎమ్మెల్సీని గ్రామం దాటించారు. సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ గ్రామంలో అడుగు పెట్టనివ్వబోమని మూలపేట వాసులు తెగేసి చెప్పారు.