Lawyers Agitation: రాష్ట్ర ప్రభుత్వం హామీలను నెరవేర్చాలని న్యాయవాదుల ఆందోళన
Lawyers Agitation On Their Demands: ప్రభుత్వం న్యాయవాదులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడ, అమలాపురంలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల్ని కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులపై దాడులను అరికట్టేందుకు అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న ప్రభుత్వం.. కేవలం 25కోట్లను మాత్రమే విడుదల చేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. లా నేస్తం నిధులను బకాయిలు లేకుండా చెల్లించాలని కోరారు. లా నేస్తాన్ని ప్రతి నెలా చెల్లించటం లేదని ఆరోపించారు. ప్రభుత్వం న్యాయవాదులకు హెల్త్ కార్డులు, ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నూతనంగా నిర్మించిన విజయవాడ కోర్టులో కనీస వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులు మరణిస్తే.. మృతుల కుటుంబ సభ్యులకు అందించే నగదు కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని గుర్తుచేశారు.