జనసేన ఆందోళనను అడ్డుకున్న పోలీసులు-కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అరెస్ట్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2023, 1:43 PM IST
Janasena corporator Petehala Murthy Yadav Arrest: జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌ను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. వీఐపీ రోడ్డు నుంచి జీవీఎంసీ కౌన్సిల్‌కు వెళ్తుండగా ఆయన్ని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి, పోలీస్ బ్యారెక్స్‌లోని కల్యాణ మండపానికి తరలించారు. కౌన్సిల్‌లో ప్రజా సమస్యలు చెప్పుకునే హక్కు తమకు లేదా? అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. త్వరలోనే వైసీపీ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకోక తప్పదని మూర్తి యాదవ్ హెచ్చరించారు.
Police Stopped Nadendla Manohar: విశాఖ టైకూన్ కూడలి రోడ్డు మూసివేతకు సంబంధించి జనసేన నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకు విచ్చేస్తోన్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వీఐపీ రోడ్డులో పెద్ద ఎత్తున మోహరించి, జనసేన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నగరపాలక కౌన్సిల్ సమావేశానికి వెళ్తున్న జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌తోపాటు పలువురు మహిళా కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు. మరోవైపు ఆందోళనకు బయలుదేరినా పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్‌ను సైతం పోలీసులు నొవాటెల్ హోటల్ వద్ద అపేశారు. దీంతో మనోహర్ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు లేదా అని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపితే ఇబ్బందేంటని పోలీసులను నిలదీశారు.