ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీలో ఏరులై పారుతున్న మద్యం - మద్యపాన నిషేధం హామీ ఏమైంది జగన్? : మహిళా సమాఖ్య ప్రతినిధి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 3:01 PM IST

AP_Mahila_Samakhya_Akhila_ Bharat_Yuvajan_Samakhya_Demand_to_ Ban_Alcohol

AP Mahila Samakhya Akhil Bharat Yuvajan Samakhya Demand to Ban Alcohol: రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించి లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషం తెస్తామని వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ పదవిలోకి వచ్చిన తరువాత ఆ హామీని విస్మరించి ప్రజా జీవితాన్ని ఛిద్రం చేసిందని, వెంటనే మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య ప్రతినిధులు సంయుక్తంగా విశాఖలో ఆందోళన చేపట్టారు. మద్యాన్ని జగన్ ప్రభుత్వం ఆదాయ మార్గంగా చూస్తోంది కానీ ప్రజల జీవితాల గురించి పట్టించుకోవటం లేదని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రతినిధి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ దశల వారీగా మద్యపానం నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని మహిళా సమాఖ్య ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మహిళా సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ విశాఖలో నిరసన చేపట్టారు. మద్యపాన నిషేధం అమలు చేయాలని  నినాదాలు చేస్తూ మద్యాన్ని కింద వలకబోశారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన దశల వారీ మద్యపాన నిషేధ హామీ ఏమైందని సమాఖ్య ప్రతినిధులు ప్రశ్నించారు. వీధికో మద్యం షాపు ఉండటం వల్ల రోజువారి కూలీ చేసుకునే మగవాళ్లు ఇంటికి సరిగ్గా డబ్బులు ఇవ్వకుండా మద్యానికి బానిసలు అవుతున్నారని, దీనివల్ల కుటుంబ సభ్యులు సతమతం అవుతున్నారని మహిళలు వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా మద్యపానం నిషేధం అమలు చేయాలని మహిళలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details