ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM Jagan Tour: సీఎం సభ పేరుతో అధికారుల నిర్వాకం.. దశాబ్దాల చెట్ల కొమ్మలు నరికివేత

By

Published : Jul 19, 2023, 6:58 PM IST

CM Jagan

CM Jagan Venkatagiri Tour updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 21వ తేదీన 'వైఎస్సార్ నేతన్న నేస్తం' 5వ విడత నిధులను తిరుపతి జిల్లా వెంకటగిరిలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు, మంత్రులు ముమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి హెలిప్యాడ్ కోసం విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో దశాబ్దాల వయస్సున్న పెద్ద పెద్ద చెట్ల కొమ్మలను నరికి తొలగించారు. దీంతో వెంకటగిరి ప్రజలు అధికారులు, మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణంలో శాశ్వత హెలిప్యాడ్ స్థలం ఉన్నప్పటికీ.. పచ్చదనం తొలగించి విశ్వోదయ కళాశాల వద్ద ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. సీఎం పర్యటన, బహిరంగ సభ పేరుతో రాణీపేట వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను పడగొట్టేశారని మండిపడ్డారు. త్రిభువని కూడలి వద్ద కాంస్య విగ్రహం పేరుతో విద్యుత్ స్తంభాలను పడగొట్టి తాగునీటి పైపులను ధ్వంసం చేశారని ఆరోపించారు. స్థానికులు మున్సిపల్ అధికారులను ప్రశ్నించగా.. జేసీబీతో పైప్‌లైన్ పనులను పునరుద్దరించారన్నారు. మరోవైపు ఈఎస్​ఎస్ కళాశాల సమీపంలోని విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్ చుట్టూ కమ్ముకొని ఉన్న కంప చెట్లను తొలగించిన అధికారులు.. దానికి తాత్కాలిక ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో ఎప్పుడు, ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details