ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాటపై నిలబడాలన్న రైతులు.. ప్రశ్నలొద్దంటూ ఎమ్మెల్యే వర్గీయుల దాడి

By

Published : Dec 30, 2022, 11:56 AM IST

Updated : Dec 30, 2022, 2:51 PM IST

YCP MLA Attack on Formers : రాజోలి జలాశయం భూసేకరణ పరిహారంపై ప్రశ్నించిన అన్నదాతలపై జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్లుగా నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు జలాశయం సామర్థ్యం తగ్గిస్తామనే కలెక్టర్ మాటలతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను ప్రశ్నించగా వైసీపీ వర్గీయులు రెచ్చిపోయి రైతులపై దాడి చేశారు.

RAJOLI
రాజోలి

మాటపై నిలబడాలన్న రైతులు.. ప్రశ్నలొద్దంటూ, దాడికి దిగిన ఎమ్మెల్యే వర్గీయులు

YCP MLA Attack on Formers : రాజోలి జలాశయం భూసేకరణ పరిహారంపై ప్రశ్నించిన అన్నదాతలపై జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్లుగా నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు జలాశయం సామర్థ్యం తగ్గిస్తామనే కలెక్టర్ మాటలతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే మాటను అధికార పార్టీ ఎమ్మెల్యేతో ప్రశ్నించగా వైసీపీ వర్గీయులు రెచ్చిపోయి రైతులపై దాడి చేశారు.

వైఎస్ఆర్ జిల్లా పెద్దముడియం మండలంలో రాజోలి జలాశయం భూసేకరణ పరిహారం కోసం ప్రశ్నించిన రైతులపై జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. పరిహారం గురించి కలెక్టర్‌ విజయరామరాజుతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, భూములిచ్చిన రైతులు కడప కలెక్టరేట్‌కు వెళ్లారు. జలాశయం సామర్థ్యం 2.95టీఎంసీలు కాకుండా 1.2 టీఎంసీలతోనే నిర్మించాలని ప్రభుత్వ ఆలోచన చేస్తోందని కలెక్టర్ తెలిపారు. దాంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని నిలదీశారు. 2.95 టీఎంసీలతో జలాశయం నిర్మిస్తేనే భూములిస్తామని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం చేయలేని ఎమ్మెల్యే కలెక్టర్‌ వద్దకు వచ్చి ఏం లాభమని అసహనం వ్యక్తం చేశారు. దాంతో ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహంతో ఊగిపోతూ రైతులపై చేయి చేసుకున్నారు. ఇరువురి మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

2008 డిసెంబరు 24న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కడపజిల్లా పెద్దముడియం మండలంలోని రాజోలి జలాశయానికి శంకుస్థాపన చేశారు. వివిధ కారణాలతో పనులు మాత్రం ముందుకు సాగలేదు. 2019 డిసెంబరు 23న సీఎం జగన్ 13 వందల 57 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2.95 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మాణానికి మళ్లీ శంకుస్థాపన చేశారు. మూడేళ్లవుతున్నా పాత కథే మళ్లీ పునరావృతం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 9 వేల ఎకరాలు ముంపునకు గురవుతాయని అంచనా వేయగా వాటిలో రైతుల భూములు 7 వేల ఎకరాల వరకూ ఉన్నాయి. చిన్నముడియం, గరిశలూరు, ఉప్పలూరు, బలపనగూడూరు, నెమళ్లదిన్నె గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతాయి. ఎకరాకు 12 లక్షల 50 వేలు ఇచ్చేందుకు రైతులతో ఒప్పందం జరగ్గా ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు.

"గతంలో ఎకరాకు 12 లక్షల 50 వేలు పరిహారం ఇచ్చేందుకు రైతులతో సంతకాలు తీసుకున్నారు,కానీ ఇప్పుడు ప్రాజెక్టు సామర్ద్యం తగ్గించి.. తక్కువ తక్కువ పరిహారం ఇస్తామని అంటున్నారు. తక్కువగా భూమి తీసుకున్నా.. మిగతా భూమి కూడా తమకు ఉపయోగపడదు.. ముందుగా అనుకున్నట్లే భూమిని తీసుకుని.. పరిహరం ఇవ్వాలి. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు చాల నష్టపోతారు."- రైతు, చిన్న ముడియం

"రాజోలి జలాశయం భూ సేకరణకు సంబంధించి పరిహారం వెంటనే చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు డిజైన్ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మార్చి నాటికి రైతులందరికి పరిహారం చెల్లిస్తాము."- సుధీర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే

కుందూనదిపై నిర్మిస్తున్న రాజోలి జలాశయాన్ని గతంలో చెప్పినట్లు 2.95 టీఎంసీలతో నిర్మించకపోతే భూములిచ్చేందుకు తాము అంగీకరించమని రైతులు తేల్చి చెప్పారు.

ఇవీ చదవండి

Last Updated : Dec 30, 2022, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details