bandi srinivasa rao - APNGOs: ఉద్యోగుల డిమాండ్లంటే జోక్‌గా మారిందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు వాపోయారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని.. ఇలాగే కొనసాగితే... త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని... ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఏడాదిన్నర కాలంగా ఉద్యోగుల పరిస్థితి బాగోలేదని, అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ఇటీవల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కడపకు వచ్చిన ఆయనకు ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ర్యాలీ నిర్వహించి ఆత్మీయ అభినందన సభ, సత్కారం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్న ఉద్యోగులను సంక్షోభంలో పడేస్తున్నారని బండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడం లేదని వాపోయారు.
జీతాల విషయంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల సాకు చెబుతోందని, అయితే మొదట ఫించన్లకు చెల్లించాక తరువాత ఉద్యోగులకు ఇవ్వాలని కోరామన్నారు. ఐదు డిఏలు, టిఏలు, పోలీసులకు సంబంధించిన టిఏలు ఇంకా ఇవ్వలేదన్న ఆయన ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి వాటి సాధనకు కృషి చేస్తామన్నారు. సంక్రాంతికి ఇస్తామన్న ఒక డిఏని మూడు నాలుగు రోజుల్లో ఇచ్చే అవకాశం ఉన్నట్లు బండి శ్రీనివాసరావు చెప్పారు. జీతం ఒకటే తమ డిమాండ్ కాదని, తాము దాచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం వాడుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు.
'నెలలు గడుస్తున్నా ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడం లేదు. ఏడాదిన్నరగా జీపీఎఫ్, ఏపీజీఎఫ్ రావట్లేదు. ఇప్పటికీ అనేక సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. ఐదు డీఏలు, సరెండర్ లీవులు, పోలీసులకు టీఏలు ఇవ్వట్లేదు. పథకాలు అమలుచేస్తూ... ఉద్యోగులను సంక్షోభంలోకి నెట్టడం సరికాదు. ప్రభుత్వం ఏపీ జీఎఫ్ నిధులు వాడుకుంది. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే కార్యాచరణతో ముందుకెళ్తాం. ఉద్యోగులు దాచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం వాడుకుంది. మా డబ్బులు ప్రభుత్వం వాడినట్లు ఇప్పటికే కేంద్రప్రభుత్వం చెప్పింది.పెండింగ్ డిమాండ్స్ అన్నింటిపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం '- బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు
కడపలో ఏపీఎన్జీవో సంఘం ఆత్మీయ అభినందన సభలో బండి శ్రీనివాసరావు
ఇవీ చదవండి: