ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Multi Purpose Stadium: రూ.6 కోట్లతో స్టేడియం నిర్మాణం.. 30 లక్షలు లేక నిలిచిపోయిన పనులు

By

Published : Apr 22, 2023, 5:06 PM IST

Updated : Apr 22, 2023, 5:15 PM IST

Vizianagaram Multi Purpose Stadium latest updates: విజయనగరం జిల్లాలోని విజ్జీ క్రీడా మైదానం నిధులు లేక భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తైనప్పటికీ కేవలం 10 శాతం పనులకు నిధులు విడుదలకాక ఆకతాయిల వికృత చేష్ఠలకు అడ్డగా మారుతుంది. రూ. 6 కోట్లతో నిర్మితమైన మైదానం..కేవలం రూ.30 లక్షల నిధులు లేక పనులు ఆగిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోందని క్రీడాకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Vizianagaram
Vizianagaram

Vizianagaram Multi Purpose Stadium latest updates: క్రీడలు దేశ సంస్కృతిని, సాంప్రదాయలను ప్రపంచానికి చాటుతాయి. అంతేకాదు, పిల్లల దైనందిన జీవితంలో ఒక భాగమై.. ఆరోగ్యానికి, వినోదానికి, బుద్ధి వికాసానికి, చురుకుదనానికి, భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా పేరును సాధించేందుకు ముఖ్య పాత్రను పోషిస్తాయి. దాంతోపాటు పిల్లల్లో చక్కటి క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష, సమయస్ఫూర్తి, ఐకమత్యం వంటి గుణాలను పెంపొందిస్తాయి. అప్పుడే పిల్లలు ఆ ఆటల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. అటువంటి క్రీడాకారుల కోసం విజయనగరం జిల్లాలో గత ప్రభుత్వ హయంలో మల్టీపర్పస్ క్రీడా మైదానికి బీజం పడడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు, పిల్లలు, యువకులు, ఆటలకు శిక్షణనిచ్చి నిపుణులు, క్రీడాకారులు ఎంతో ఆనందపడ్డారు. అంతలోనే ప్రభుత్వం మారింది.. నిధుల్లేక మైదానం పనులు ఆగిపోయాయి. దీంతో క్రీడాకారులకు సరైన మైదానం లేక, కనీస వసతుల్లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రూ.6కోట్లతో నిర్మించారు..రూ.30 లక్షల్లేక నిలిపివేశారు..విజయనగరం జిల్లాలో గత ప్రభుత్వ హయంలో విజ్జీ క్రీడా మైదానంలో మల్టీపర్పస్ మైదానికి బీజం పడింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రూ.6 కోట్లు చొప్పున నిధులను కేటాయించాయి. ఈ మేరకు గతేడాదే 90 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. ఇంకా 10శాతం పనులే చేపట్టాల్సి ఉంది. అందుకు సుమారు రూ.30 లక్షల నిధులు కావాలి.. కానీ, నిధులు మంజూరు కాక పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ మైదానంలో వ్యాయామం చేస్తున్న క్రీడాకారులకు తిప్పలు మొదలయ్యాయి.

2018-19లో విజ్జీలో శంకుస్థాపన.. విజయనగరం ఉమ్మడి జిల్లాలోని అన్ని మైదానాలు అవుట్‌డోర్ ఆటలకే ఉపయోగపడుతున్నాయి. ఇండోర్ మైదానం లేకపోవటంతో వర్షాలు, ఇతరాత్ర సమస్యలు వచ్చినప్పుడు క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు గుర్తించారు. దీంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.6 కోట్ల రూపాయలతో మల్టీ పర్పస్ ఇండోర్ మైదానానికి విజ్జీలో అప్పటి పాలకులు శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా తరఫున విజయనగరం పురపాలక సంఘం రూ. 25 లక్షలు, అప్పటి పార్లమెంట్ సభ్యుల నుంచి రూ. 25 లక్షలు, విశాఖపట్నం మెట్రో అథారిటీ రూ.2 కోట్లు, క్రీడా శాఖ రూ. 50 లక్షల రూపాయల చొప్పున నిధులను కేటాయించాయి.

రూ.30 లక్షల్లేక పనులు నిలిపివేత.. ఈ నేపథ్యంలో ఆ నిధులన్నింటినీ వెచ్చించి.. ఇండోర్ ఆటల సాధనకు తగ్గట్లుగా క్రీడా కోర్టులు విజ్జీలో ఏర్పాటు చేశారు. ఈ మైదానంలో షటిల్, టెన్నిస్, వాలీబాల్, కబడ్డీ, చదరంగం, మార్షల్ ఆర్ట్, ఫెన్సింగ్, ఆర్చరీ, రైఫింగ్, షూటిగ్ ఇలా ఎన్నో ఆటలు ఆడొచ్చు. అయితే, ఉడెన్ కోర్టు, విద్యుత్తు సౌకర్యం, ప్లోరింగ్, చిన్న చిన్న పనులకు రూ. 30 లక్షల రూపాయలు అవసరం కానున్నాయి. ఆ నిధులు లేక, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేయక.. గుత్తేదారు చేతులెత్తాశాడు. దీంతో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఇలా.. కోట్లాది రూపాయలతో నిర్మించిన క్రీడా భవనాన్ని అర్థరాంతరంగా నిలిపివేయటం.. ప్రస్తుతం ఏడాది నుంచి నిరుపయోగంగా ఉండటంపై క్రీడాశిక్షకులు, పుర ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. బయట అందమైన రంగులతో కళకళలాడుతున్న మైదానానికి.. నిధుల శాపం నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తోందనని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఆకతాయిల చేష్ఠలకు పగిలిన అద్ధాలు, కిటికీలు.. విజ్జీ క్రీడా మైదానంలో కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలిపోయాయి. నిధుల లేమితో మిగిలిన పనులు చేపట్టక అధికారులు భవనాన్ని గాలికి వదిలేశారు. దీంతో కోట్లాది రూపాయల భవనం నిరూపయోగంగా మారింది. ఇప్పటికే ఆకతాయిల చేష్ఠల కారణంగా భవనం కిటికీల అద్దాలు, భవనం వెలుపల విద్యుత్తు స్విచ్ బోర్డులు పాడైపోయాయి. ఈ పరిస్థితులపై క్రీడా సంఘాల ప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని.. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

ప్రభుత్వం 10శాతం పనులను పూర్తి చేయాలి.. రాష్ట్రంలో రెండో ఆదర్శ క్రీడా పాఠశాలను విజ్జీ క్రీడా మైదానంలో నిర్మించ తలపెట్టారు. అందుకు మైదానంలో అప్పట్లో ప్రభుత్వం రూ. 20 కోట్లను కేటాయించగా.. తొలి విడతగా రూ. 67 లక్షలు నిధులు ఇచ్చింది. దీంతో పాఠశాల భవనాల పనులను చేపట్టారు. ఈ క్రమంలో ఓ భవనం స్లాబ్ వరకు పూర్తయింది. మరొకటి పునాదుల దశలో ఆగిపోయింది. అంతలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. పనులన్నీ నిలిపివేసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. మిగిలిపోయిన 10శాతం పనులను పూర్తి చేసి, క్రీడాకారులకు అండగా నిలవాలని ప్రజలు, పిల్లలు, క్రీడాకారులు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 22, 2023, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details