ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆరేళ్లైనా ఇంకా నిరాశ్రయులగానే హుద్‌హుద్‌ బాధితులు

By

Published : Jul 1, 2021, 1:49 PM IST

హుద్‌హుద్‌ తుపాను కారణంగా నిరాశ్రయులైన వారికి ఆదుకునేందుకు ఇళ్లు నిర్మించినా..అవి ఇంకా లబ్ధిదారులకు అందలేదు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా..మరికొన్ని చోట్ల అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఇళ్ల చుట్టూ తుప్పలు పెరిగి.. పాములు, దోమలకు నిలయంగా మారిపోయాయి. కొంతమంది ఆకతాయిలు పేకాటకు, మద్యం సేవించడానికి అడ్డాలుగా మార్చుకున్నారు. ఇళ్లను లబ్ధిదారులకు అందజేసి.. మౌలిక సదుపాయాలు కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

Hudhud victims
Hudhud victims

ఆరేళ్లైనా ఇంకా నిరాశ్రయులగానే హుద్‌హుద్‌ బాధితులు

2014 అక్టోబర్‌లో వచ్చిన హుద్‌హుద్‌ తుపాను ఉత్తరాంధ్రలో విలయం సృష్టించగా..విజయనగరం జిల్లాలో 17 వందల ఇళ్లకు నష్టం వాటిల్లిందని.. అధికారులు గుర్తించారు. బాధితుల కోసం 13 వందల 68 గృహాలు మంజూరు చేశారు. జిల్లా కేంద్రంలో 552 ఇళ్లు మంజూరు చేయగా.. గాజులరేగలో 120, లంకాపట్నంలో 432 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. ఆ ఇళ్లను హుద్‌హుద్‌ బాధితులతో పాటు విజయనగరంలో రహదారుల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన 134 మందికి కేటాయించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తైన చోట్ల సామూహిక గృహ ప్రవేశాల్లో భాగంగా.. 2017లోనే పాలు పొంగించారు. కానీ ఇళ్లను లబ్ధిదారులకు ఇప్పటివరకూ అప్పగించలేదు. ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పాములు, పురుగులు చేరుతున్నాయి.

పూసపాటిరేగ మండలం చింతపల్లి, కుమలి, వెంపడాం, మొదలవలస, చల్లవానితోట గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగానే మిగిలాయి. గుత్తేదారు పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. డెంకాడ మండలం యాతపేటలో 64 ఇళ్లకు గానూ.. 48 పూర్తి చేశారు. జామి మండలం అలమండలో 169 గృహాలు నిర్మించారు. గంట్యాడ మండలం పెంట శ్రీరాంపురంలో 36 ఇళ్లు మంజూరు కాగా.. ప్రతిపాదన దశలోనే అధికారులు రద్దు చేశారు. పూర్తైన వాటిల్లోనూ విద్యుత్‌, నీటి సదుపాయం కల్పించలేదు.

చంద్రబాబు నాయుడు హయాంలో 10 వేల రూపాయలు తీసుకుని ఇక్కడ ఇల్లు ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తరువాత నీళ్లు లేవు, కరెంటు లేదు. ఎక్కడ పడితే అక్కడ పాములు తిరుగుతున్నాయి. దిక్కూ దివానం లేదు. గతీ గోత్రం లేదు. ఎవరూ లేని ఏకాకిని. ఎవరైనా ఏమైనా దయతలచి ఇస్తే కడుపునింపుకోవడం తప్ప ఇంకేం చేయలేను. నాకు తాగడానికి గుక్కెడు నీళ్లు, కరెంటు ఇస్తే ఇంకేమీ అక్కర్లేదు- వృద్ధురాలు

విజయనగరం మండలం లంకాపట్నంలో నిలువ నీడలేని కొంతమంది హుద్‌హుద్‌ బాధితులు.. నిర్మాణాలు పూర్తైన ఇళ్లల్లోనే.. అనధికారికంగా ఉంటున్నారు. నీరు, కరెంట్‌ సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాములు, దోమల మధ్య ఉండలేకపోతున్నామని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు పూర్తైన కొన్ని చోట్ల నిర్మాణ సామాగ్రి దొంగలపాలవుతోంది. గృహాల చుట్టూ తుప్పలు పెరిగిపోయాయి. కొంతమంది ఆకతాయిలు ఆ ఇళ్లను పేకాట, మద్యం తాగడానికి అడ్డాగా మార్చేస్తున్నారు. రాత్రి పూట ఆకతాయిల ఆగడాలను భరించలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అన్ని సమస్యలూ పరిష్కరించి.. లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తామని.. అధికారులు తెలిపారు. నిర్మాణాలు పూర్తైన గృహాలైనా అందజేసి.. మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:AP - TS Water War: ఇటు పులిచింతల.. అటు సాగర్: జలజగడంతో భారీగా భద్రత పెంపు

ABOUT THE AUTHOR

...view details