ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గ్రామాల్లో కొవిడ్ ఉద్ధృతి.. అవగాహనారాహిత్యమే కారణం!

By

Published : May 11, 2021, 1:00 PM IST

గ్రామీణ ప్రాంతాలపై కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి విజయనగరం జిల్లానే ఒక ఉదాహరణ. కేసులనమోదులో, కొవిడ్‌ మరణాల్లో రోజురోజుకు అక్కడ కొత్తరికార్డులు నమోదు అవుతున్నాయి. సెకండ్‌వేవ్‌లో అధిక శాతం కేసులు గ్రామాల్లోనే వెలుగు చూస్తుండటం కలవరానికి గురి చేస్తోంది. ఒకవైపు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు.. మరోవైపు తగ్గి పోతున్న వైద్య సౌకర్యాలు. పరీక్షా కేంద్రానికి వెళ్తే టెస్టింగ్‌ కిట్లు ఉండట్లేదు... ఆసుపత్రులకు వెళ్తే బెడ్లు దొరకట్లేదు. సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి ఇంకా పెరిగే ప్రమాదమున్న నేపథ్యంలో... జిల్లాలో పరిస్థితి చేయి దాటిపోతుందా..? అన్న సందేహం గుబులు రేపుతోంది.

covid virus to villages in vijayanagaram district
covid virus to villages in vijayanagaram district

ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ అమలు చేయడంలో విజయనగరం జిల్లా అందరికి ఆదర్శం.

జనతా కర్ఫ్యూ మెుదలు.. అన్‌లాక్‌ ప్రక్రియ ముగిసేంత వరకు పకడ్బందీగా అమలు చేసింది. అంతేకాదు, రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవడం ప్రారంభమైన నాటి నుంచి 45 రోజుల పాటు గ్రీన్ జోన్ జిల్లాగా రికార్డు సాధించింది. ఇదంతా... మెుదటి దశ కరోనా విజృంభణ నాటి పరిస్థితి.

నెలలోనే 7 వేలకు పైగా...

ఏడాదిలోనే పరిస్థితులు తలకిందులైపోయాయి. విజయనగరం జిల్లాపై కొవిడ్‌ ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. సగటున రోజూ వెయ్యి పైగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. గత పది రోజుల వ్యవధిలో 4 రోజుల పాటు రాష్ట్రంలో అత్యధిక మరణాలు నమోదైన జిల్లాగా విజయనగరం రికార్డులెక్కింది. ఈ నెలలో ఇప్పటికే 7,700 కు పైగా పాజిటివ్‌ కేసులు.. 76మరణాలు నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది.


సెకండ్‌ వేవ్‌లో విజయనగరం జిల్లాలో... పట్టణాల కంటే గ్రామాల్లోనే అధిక శాతం కేసులు వెలుగుచూస్తున్నాయి. అందులో ప్రధానంగా... విజయనగరం గ్రామీణం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, శృంగవరపుకోట, కొత్తవలస, లక్కవరపుకోట, నెల్లిమర్ల, భోగాపురం మండలాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు క్రమంగా పెరగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.


కేసుల ఉద్ధృతితో క్రమంగా జిల్లాలో వైద్యసౌకర్యాలపై ఒత్తిడి పెరుగుతోంది. మందుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటోంది. పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లు సకాలంలో అందడం లేదు. ఆక్సిజన్ కొరత సమస్య వేధిస్తోంది. ఆక్సిజన్, వెంటిలేటర్లతో కూడిన పడకలకూ విపరీతమైన డిమాండ్ పెరిగింది. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పడకలు దొరకని పరిస్థితి. మరోవైపు పరీక్షల ఫలితాలు సకాలంలో రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఫలితాలు రావడానికి 4, 5 రోజులు సమయం పడుతోంది. దీంతో...ఫలితాలు వచ్చేసరికే.... కొందరు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అవగాహన లేకపోవడంతోనే..

గ్రామాల్లో పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు పెరగడానికి అవగాహన రాహిత్యమేనని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. పరిస్థితులు చక్కదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరిస్తున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించి వెంటనే స్థానికంగా ఉండే వైద్యులను సంప్రదించాలి. ఏ మాత్రం అనుమానం ఉన్నా... నిర్ధరణ పరీక్ష చేయించుకోవాలి. ఆ తరువాత వైద్యుల సూచనలు ,సలహాలు పాటిస్తూ హోం ఐసోలేషన్‌లో ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటించకపోతే... పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు.


మరోవైపు చూస్తే పలు ప్రైవేటు ఆసుపత్రులు శవాలతో వ్యాపారం చేస్తున్నాయి. ఆసుపత్రుల్లో చేరినప్పుడు రోగికి బాగానే ఉందంటూ అధికమొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు. రాత్రికి రాత్రే పరిస్థితి విషమించింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన లాభం లేకపోయిందంటూ మృతదేహాన్ని అప్పగిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై జిల్లా అధికారుల చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు. అధికారులను ఆరా తీస్తే.. పెద్దగా ఫిర్యాదులు రావట్లేదనే సమాధానాలు వినిపిస్తున్నాయి. అసలే, కుటుంబ సభ్యుడిని కొల్పోయి పుట్టెడు దుఃఖంలో వారు ఫిర్యాదులు అంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతారా..! పరిస్థితి బట్టి అధికారులే పర్యవేక్షించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.


ప్రస్తుతం పెరిగిపోతున్న కొవిడ్‌ మరణాలను నియంత్రించాలంటే... మరిన్ని ఆక్సిజన్ చికిత్సతో కూడిన పడకలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎంతైన ఉంది. అదేవిధంగా, ప్రైవేట్ ఆసుపత్రులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఆరోగ్యశ్రీ ద్వారా పడకలను అందుబాటులో ఉంచి, రోగులకు పూర్తి స్థాయిలో వైద్యమందించాలి. రెమిడెసివిర్ వంటి ఇంజెక్షన్లు నల్లబజారుకు తరలిపోకుండా అరికట్టాలి. ప్రధానంగా, ఆర్టీపీసీఆర్ ఫలితాలు 48 గంటల్లోగా వచ్చేలా చర్యలు చేపడితే వ్యాధి వ్యాప్తికి, మరణాల నియంత్రణకు అడ్డుకట్ట వేయవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:ఆ పసి మనసుకేం తెలుసు..? అమ్మలేదని.. తిరిగి రాదని..!

ABOUT THE AUTHOR

...view details