ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Caste boycott: కల్లు దుకాణం వద్దన్నందుకు కుల బహిష్కరణ.. ఎక్కడంటే..?

By

Published : Apr 19, 2023, 8:12 PM IST

Caste boycott for telling thatikallu shop to close: కల్లు దుకాణాన్ని తమ ఇంటి వద్ద నుంచి తరలించాలని వేడుకున్నందుకు గ్రామ పెద్దలు ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. అంతేకాదు, రచ్చబండ కార్యక్రమం పెట్టి, ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడకూడదని, వారి కష్టసుఖాలను తెలుసుకోకూడదని ఆంక్షలను విధించారు. ఈ రోజులలో కూడా కుల బహిష్కరణ ఏంటీ..? అని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Caste boycott
Caste boycott

Caste boycott for telling thatikallu shop to close: తాటికల్లు దుకాణాన్ని తమ ఇంటి వద్ద నుంచి తరలించాలని కోరినందుకు.. ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన ఘటన విశాఖపట్టణం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కల్లు దుకాణంపై గ్రామ సచివాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారన్న ఆగ్రహంతో రగిలిపోయిన గ్రామ పెద్దలు.. రచ్చబండ కార్యక్రమం పెట్టి కుల బహిష్కరణ చేశారు. అంతేకాదు, ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడకూడదని, వారి కష్టసుఖాలకు పిలవకూడదు, వెళ్లకూడదని ఆంక్షలను విధించారు. ఒకవేళ పంచాయతీ పెద్దల ఆంక్షలను ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయల జరిమానా కట్టాలని దండోరా వేయించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్టణం జిల్లా పెదగంట్యాడ మండలం మురభాయికి చెందిన దొడ్డి దేవరాజు ఇంటి పక్కన గత రెండు సంవత్సరాలుగా ఓ కల్లు దుకాణం నడుస్తోంది. ఈ క్రమంలో ప్రతి రోజు కల్లు త్రాగడానికి వచ్చినవాళ్లంతా గంటల తరబడి గట్టి గట్టిగా మాట్లాడుతూ, ఇంటిలోని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో ఆ కల్లు దుకాణాన్ని తమ ఇంటి వద్ద నుంచి తరలించాలని యజమానిని కోరారు. కానీ, ఆ యజమాని అతని మాట వినలేదు. దీంతో గ్రామ సచివాలయంలో దేవరాజు ఫిర్యాదు చేశారు. ఆగ్రహించిన కల్లు దుకాణం యజమాని.. ఆ గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టిన కుల పెద్దలు.. దొడ్డి దేవరాజు కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. అంతేకాదు, దండోరా వేయించి.. దేవరాజు కుటుంబంతో ఎవరూ మాట్లాడకూడదని, వారి కష్టసుఖాలను తెలుసుకోకూడదని, వారి ఇంటికి వెళ్లకూడదని ఆంక్షలను విధించారు. ఒకవేళ పంచాయతీ పెద్దల విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తే.. వెయ్యి రూపాయల జరిమానా కట్టాలని ఊరంతా తెలియజేశారు. అయితే, మురుభాయి గ్రామంలో దాదాపు 150 కుటుంబాలు ఉన్నాయి. అందరూ గీత కార్మికులే. కల్లు దుకాణాల వల్ల ఏదైనా సమస్య ఉంటే గ్రామ పెద్దలకు చెప్పి సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప.. అధికారులకు ఫిర్యాదు చేస్తావా అంటూ కుల పెద్దలు వారిని బహిష్కరించినట్లు పలువురు గ్రామస్థులు తెలిపారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ''మేము చేసిన తప్పు ఏంటీ..?, ప్రశ్నించే హక్కు కూడా మాకు లేదా..?, ఏకపక్షంగా పెద్దలు నిర్ణయం తీసుకుని.. మా కుటుంబానికి ప్రశాంతత లేకుండా చేశారు. ఇంటి నుంచి బయటికి కూరగాయలకు వెళ్లినా, నిత్యవసరాలకు, కూలీ పనులకు వెళ్లినా మిమ్మల్ని కులం నుంచి వెలివేశారంటా కదా అని ప్రశ్నిస్తున్నారు. మాకు చాలా అవమానంగా ఉంది. ఈ రోజులలో కూడా కుల బహిష్కరణ ఏంటీ..?, తాటికల్లు అమ్మకాలు ఊరికి దూరంగా అమ్మండి అని చెప్పడం తప్పా..?'' అంటూ వారు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు స్పందించి, తమకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details