ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ రుషికొండ లెక్కతేల్చేందుకు రంగంలోకి కేంద్రం

By

Published : Nov 4, 2022, 8:37 AM IST

Updated : Nov 4, 2022, 9:50 AM IST

VISAKHA RISHIKONDA: విశాఖ రుషికొండ తవ్వకాల లెక్కతేల్చేందుకు కేంద్ర బృందం రంగంలోకి దిగనుంది. అసలు అనుమతులున్నాయా? ఇచ్చిందెంత? తవ్విందెంతో క్షేత్రస్థాయి సర్వే చేయాలని, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారి ఆధ్వర్యంలో బృందాన్ని హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా.. పర్యాటక శాఖ తీరును హైకోర్ట్‌ తప్పుపట్టింది.

VISAKHA RUSHIKONDA
విశాఖ రుషికొండ

HIGH COURT ON RISHIKONDA: విశాఖలోని రుషికొండ అక్రమ తవ్వకాలపై నిజాలను నిగ్గు తేల్చేందుకు హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. క్షేత్రస్థాయి సర్వే నిర్వహించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారి ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎంత విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారు? నిర్మాణాల పటిష్ఠానికి కొండవాలును ఎంతమేర చదును చేశారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అనుమతులకు లోబడి పనులు చేపట్టారా? వంటి వివరాలతో నివేదిక ఇవ్వాలని బృందాన్ని ఆదేశించింది.

ఇదేసమయంలో రుషికొండపై నిర్మాణాల గురించి స్థాయీ నివేదిక సమర్పించాలని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థనూ ఆదేశించింది. స్లోపింగ్‌ కోసం అదనంగా భూమి వాడుకునేందుకు మీకెవరు అనుమతినిచ్చారంటూ ఆ సంస్థను నిలదీసింది. స్లోపింగ్‌ కోసం 3.86 ఎకరాలు తవ్వామని అఫిడవిట్లోనే అంగీకరిస్తున్నారని గుర్తుచేసింది. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. నిర్మించాక అనుమతులు కోరడమేంటని ప్రశ్నించింది. మీ అభీష్టం మేరకు అనుమతులు పొందడమేంటని ఘాటుగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను డిసెంబరు 14కు వాయిదా వేసింది.

టూరిజం రిసార్టు అభివృద్ధి పేరుతో రుషికొండను విచక్షణారహితంగా తవ్వేస్తూ పరిధికి మించి నిర్మాణాలు చేపట్టారంటూ.. విశాఖ తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చి తన వాదనలూ వినాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారు. వీటిపై గురువారం విచారణ జరగ్గా.. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 9.88 ఎకరాల్లో ప్రాజెక్టు అభివృద్ధికి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అనుమతినిచ్చిందని తెలిపారు. అందులో 5.18 ఎకరాల్లో భవనాలు నిర్మించే వీలున్నా 2.70 ఎకరాలకే నిర్మాణాలను పరిమితం చేస్తున్నామని వివరించారు.

తవ్వినచోట పునరుద్ధరించే పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇకపై తవ్వకాలు జరిపే ఉద్దేశం లేదని తెలిపారు. స్లోపింగ్‌ కోసం 3.86 ఎకరాలు తవ్వింది వాస్తవమేనని, దాన్ని పునరుద్ధరిస్తున్నామని వివరించారు. పిటిషనర్ల తరఫున వాదించిన సీనియరు న్యాయవాది కేఎస్‌ మూర్తి.. 20 ఎకరాలకుపైనే కొండను తవ్వేశారని.. ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అధ్యయనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వశాఖల అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఆ మేరకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

విశాఖ రుషికొండ తవ్వకాల లెక్కతేల్చేందుకు రంగంలోకి కేంద్ర బృందం

ఇవీ చదవండి:

Last Updated : Nov 4, 2022, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details