ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Dispute Between Fishermen: విశాఖలో మళ్లీ రింగు వలల వివాదం.. ఆ తీరంలో 144 సెక్షన్​

By

Published : Jan 4, 2022, 11:57 AM IST

Updated : Jan 4, 2022, 5:51 PM IST

dispute-between-peddajalaripeta-and-chinnajalaripeta-fishermen
పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య వివాదం

17:22 January 04

Dispute Between Fishermen: సముద్రంలో ఆరు పడవలకు నిప్పుపెట్టిన మరో వర్గం మత్స్యకారులు

ఆరు పడవలకు నిప్పుపెట్టిన మరో వర్గం మత్స్యకారులు

రింగు వలల విషయమై విశాఖ జిల్లాలో జాలర్ల మధ్య.. మరోసారి అగ్గి రాజేసుకుంది. ఓ వర్గం మత్స్యకారులపై మరో వర్గం దాడి చేయడంతో.. వివాదం చినికిచినికి గాలివానగా మారింది. మరో వర్గం దాడిలో దెబ్బతిన్న మత్స్యకారులు ప్రత్యర్థుల బోట్లకు నిప్పుపెట్టారు. పరస్పర దాడులతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో..పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. ఆ గ్రామాల తీర ప్రాంతంలో 144 సెక్షన్​ విధించారు.

11:52 January 04

సముద్రంలో ఆరు పడవలకు నిప్పుపెట్టిన మరో వర్గం మత్స్యకారులు

విశాఖలో మళ్లీ రింగు వలల వివాదం

విశాఖలో పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య వివాదం చెలరేగింది. రింగు వలల విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో.. సముద్రంలో ఉన్న ఆరు పడవలను మరో వర్గం తగలబెట్టింది. వాసవానిపాలెం, జాలరిపేటలో తీరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో.. అధికారులు 144 సెక్షన్ విధించారు. విషయం తెలుసుకున్న పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. సముద్రంలోకి వెళ్లిన బోట్లను బయటికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శాంతిభద్రతలు తలెత్తకుండా.. పెద్దజాలరిపేట, వాసవానిపాలెంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. ఘటనపై రుషికొండ మెరైన్‌ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు.

మత్స్యకారులను పరామర్శించిన మంత్రి అవంతి

రింగు వలల విషయంలో మత్స్యకారుల మధ్య 16 నెలలుగా వాగ్వాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆరు బోట్లను మరో వర్గం దగ్ధం చేసింది. మత్స్యకారులు మంగమారిపేట తీరానికి చేరుకోవటంతో.. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పోలీసులు మోహరించారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు మంగమారిపేట మత్స్యకారులను పరామర్శించి.. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యపై గతంలోనే కలెక్టర్, మత్స్య శాఖ మంత్రితో కలిపి రెండు వర్గాల మత్స్యకార పెద్దలతో చర్చలు జరిపినా.. సమస్య కొలిక్కి రాలేదని మంత్రి అన్నారు. సమస్య కోర్టు పరిధిలో ఉందన్నారు. ప్రస్తుతం ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఏ వర్గం వారైనా చట్టానికి లోబడి ఉండాలని.. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. స్థానిక పోలీసులు, మెరైన్ పోలీసులు.. బోట్లు దొంగిలించిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆదేశించామన్నారు.


ఇదీ చూడండి:

RGV TWITTER: ఏపీ ప్రభుత్వంపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ దాడి

Last Updated : Jan 4, 2022, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details