ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ జిల్లాలో ఘనంగా భోగి సంబురాలు

By

Published : Jan 13, 2021, 12:26 PM IST

Updated : Jan 13, 2021, 9:06 PM IST

విశాఖ జిల్లా ప్రజలు.. భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నా పెద్దా అంతా కలిసి సంబరాలు చేసుకున్నారు. పండగ శోభతో తెలుగు లోగిళ్లలో ఆనందాలు వెల్లివిరిశాయి.

bhogi celebrations in visakha
విశాఖ జిల్లాలో ఘనంగా భోగి సంబురాలు

విశాఖ జిల్లాలో ఘనంగా భోగి సంబురాలు

విశాఖ జిల్లా వ్యాప్తంగా భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే భోగి మంటలు వేసుకుని.. ప్రజలు సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఉల్లాసంగా వేడుకలు చేసుకున్నారు.

విశాఖలో...

విశాఖ శ్రీ శారదాపీఠంలో సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టారు. భోగి సందర్భంగా పీఠం ప్రాంగణంలో మంటలు వేశారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి పూజలు చేశారు. పీఠం నిర్వహణలోని శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు, సిబ్బంది సాంప్రదాయబద్ధంగా భోగి మంటల్లో పిడకలు వేశారు.

పిల్లలకు భోగిపళ్లు పోయటం వల్ల దిష్టి పోయి.. ప్రకాశిస్తూ, ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి డాక్టర్ రవిరాజు అన్నారు. శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో.. నగరంలోని మహారాణి పేట ప్రకృతి చికిత్సాలయంలో పిల్లలకు భోగి పళ్లు పోశారు.

చోడవరంలో...

చోడవరంలోని స్వయంభూ వినాయక ఆలయం వద్ద 400 మంది పేదలకు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దుప్పట్లు పంపిణీ చేశారు. పలువురు దాతలు ఆర్థిక సాయంతో.. ఏటా భోగి పండుగ రోజున పేదలకు వస్త్రదానం చేస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. దేవాదాయ శాఖ అధికారులు, వైకాపా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పరిసర గ్రామాల ప్రజలు భోగి మంటలు వేసుకుని ఆనందంగా గడిపారు. పాత వస్తువులు, కర్రలను మంటల్లో వేసి.. చెడు దగ్గరికి రాకుండా ఉండాలని వేడుకున్నారు.

పాడేరులో...

గుడివాడ చావడిలో పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. దట్టమైన పొగమంచు, 12 డిగ్రీల చలిలో.. వెచ్చని అనుభూతి పొందారు. ఆనందోత్సాహాల మధ్య నృత్యాలు చేస్తూ పెద్దలు, యువకులు సందడి చేశారు.

సింహాచలంలో...

పల్లె వాతావరణం ఉట్టిపడేలా సింహగిరిపై ఏర్పాట్లు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి.. ప్రత్యేక పూజలు నిర్వహించి భోగి మంటలు వెలిగించారు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అప్పన్నను కోరుకున్నారు. ఆయన సంక్రాంతి సంబరాలు ప్రారంభించగా.. స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం ఇక్కడ గోదా కళ్యాణం జరగనుంది.

ఇదీ చూడండి:భోగి పరమార్థం.. తెలుగు లోగిళ్లలో ఆనందోత్సాహం

Last Updated : Jan 13, 2021, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details