ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో మందుబాబులకు వెరైటీ శిక్ష.. రోజంతా వారితో..!

By

Published : Feb 21, 2023, 7:31 PM IST

Beach cleaning punishment: మద్యం తాగి వాహనాలను నడపొద్దని ఎంత చెప్పినా కొంత మంది అస్సలు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతుంటారు. మందుబాబులకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం శూన్యం. దీంతో విశాఖ కోర్టు కొంచెం భిన్నంగా ఆలోచించింది. ఏం చేస్తే వీరిలో మార్పు వస్తుందా అని ఆలోచించి.. చివరకు ఒక వినూత్నమైన తీర్పును ఇచ్చింది. అది ఏంటంటే..!

Beach cleaning punishment
Beach cleaning punishment

అక్కడ మందుబాబులకు వెరైటీ శిక్ష.. రోజంతా వారితో..!

Beach cleaning punishment: ఇక్కడ కనిపిస్తున్న వీరంతా సామాజిక బాధ్యతలో భాగంగా విశాఖ సాగర తీరాన్ని శుభ్రపరిచేందుకు వచ్చిన వారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. వీరంతా మద్యం అతిగా సేవించి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడ్డ నిందితులు. విశాఖ నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సోమవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడ్డ వారిని ఇవాళ ఉదయం కోర్టులో హాజరుపరచగా వాళ్ల గురించి న్యాయమూర్తి కాస్త ఆలోచించి ఏమి చేస్తే వీరిలో మార్పు వస్తుందా అని వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరికి జరిమానా విధిస్తే సరిపోదని భావించిన న్యాయమూర్తి.. వారిలో పరివర్తన వచ్చేలా, అలాగే అందరికీ ఉపయోగపడేలా ఏదైనా శిక్ష విధించాలని భావించారు.

అందులో భాగంగా అందరిని సాగర తీరంలో ఉన్న వ్యర్థాలను ఏరివేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో సుమారు 52 మంది ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్న సాగర తీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించే పనిలో పడ్డారు. వీరు సక్రమంగా చెప్పిన పని నిర్వర్తించేలా చూసుకునే బాధ్యతను ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. మండుటెండలో చెత్త ఏరే పని నిర్వహిస్తే వారిలో కొంచమైనా మార్పు వస్తుందని న్యాయమూర్తి శిక్ష విధించినట్లు తెలుస్తోంది.

గతంలో పలు కూడళ్లలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించేలా.. హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్లకార్డులు పట్టుకునే శిక్షలు వేసేవారు. ఈ సారి బీచ్ క్లినింగ్ విధులు చేయమని ఆదేశించడం వినూత్నంగా ఉంది. కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సాగర తీరానికి వచ్చే సందర్శకులతో పాటు.. అక్కడ ఉన్న స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైనా వారిలో మార్పు వస్తుందని, అలాగే పరిసరాలు కూడా శుభ్రపడతాయని.. ఇంకోసారి ఇలా చేయాలంటే భయపడతారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజు 52 మందిని కోర్టులో హాజరుపరచడం జరిగింది.. ఎంవీపీ, హార్బర్​, త్రీటౌన్​ స్టేషన్ పరిధిలో.. వారికి గౌరవ కోర్టువారు సాగర తీరాన్ని సాయంత్రం వరకూ కూడా శుభ్రం చేయాలని ఆదేశించారు. వారందరినీ తీసుకువచ్చి శుభ్రం చేయిస్తున్నాము. కోర్టు ఆదేశాల ప్రకారం వారిలో మార్పు రావాలి.. ఈ రోజు ప్రత్యేకంగా యువతలో ఒక మార్పు రావాలి.. వారికి ఒక అర్థం ఉండాలి. వారిలో పరివర్తన రావాలని బీచ్​ క్లీనింగ్​ చేయిస్తున్నాం.- తులశీ దాస్, ట్రాఫిక్ సీఐ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details