ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కష్టాల్లో పలాస జీడి పరిశ్రమ

By

Published : Oct 26, 2020, 3:14 PM IST

ఒకప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లిన పలాస జీడి పరిశ్రమ కష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. ఒడిశా, పశ్చిమ బంగాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమలు నెలకొల్పడంతో.. ఇక్కడి పరిశ్రమలపై ప్రభావం పడింది. శ్రీకాకుళం జిల్లా నుంచి 30 శాతం మాత్రమే పంట దిగుబడి రావడంతో ఏటా విదేశీ పిక్కలపై ఆధారపడాల్సిన వస్తోంది. లాక్డౌన్ తో విదేశీ జీడిపిక్కల దిగుబడికి అటంకం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో తెల్ల బంగారం.. తెల్ల బోయిన వైనంపై ఈటీవీ- ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Palasa cashew industry in trouble
కష్టాల్లో పలాస జీడి పరిశ్రమ

శ్రీకాకుళం జిల్లా పలాస జీడి పప్పునకు తెల్ల బంగారంగా పేరొందింది. 70 ఏళ్ల చరిత్ర కలిగిన పలాస జీడి పరిశ్రమలు... రోజు రోజుకు దిగజారుతున్నాయి. ఏటా ఏదో ఒక సమస్య.. మరింత జటిలం చేస్తున్నాయి. ఉద్దానంలో తిత్లీ తుపాన్‌ దెబ్బకు జీడి చెట్లు కనుమరుగుయ్యాయి. పక్క రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బంగాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జీడి పరిశ్రమలు నెలకొల్పడంతో.. వాటి ప్రభావం తీవ్రస్థాయిలో పడింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలు నడిపేందుకు వ్యాపారులు చేస్తున్న ప్రయత్నాలతో ఆశించిన మేర ఫలితాలు రావడం లేదని ఉత్పత్తిదారులు వాపోతున్నారు.

జిల్లాలో సుమారు 450 కర్మాగారాలు ఉన్నాయి. రోజుకు వంద టన్నుల వరకు ఇక్కడ జీడిపప్పు తయారవుతుంది. ఏటా 250రోజులు పని దినాలు ఉంటాయి. జిల్లాలో సుమారు 20 వేల హెక్టార్లలో జీడి పంట సాగవుతున్నట్లు అధికారుల లెక్కల చెబుతున్నాయి. కానీ ఎన్నో ఏళ్ల క్రితం చెట్లు కావడంతో ప్రస్తుతం పంట దిగుబడి 30 శాతానికి మించి రావడం లేదు. కొత్తగా జీడి మొక్కల పెంపకం జరగడం లేదు. దీంతో కావలసిన ముడిసరుకైన జీడిపిక్కల కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. జీడి పరిశ్రమకు గత కొన్నేళ్లుగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. రెండేళ్ల క్రితం తిత్లీ తుపాన్‌ ధాటికి భారీ నష్టం వాటిల్లింది. తాజాగా కరోనా లాక్‌డౌన్‌ మరింత ఇబ్బందులకు గురి చేసింది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో కొత్తగా స్థానిక జీడిపిక్కలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈఏడాది కరోనాతో కొనుగోలుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. మరోవైపు పిక్కల మద్దతు ధర విషయంలో నామమాత్ర ప్రయత్నాలే జరిగాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో ఈయేడాది మరింతగా విదేశీ పిక్కలపైనే ఆధారపడాల్సి వస్తుంది. పాడవుతున్న యంత్రాలకు మరమ్మతులు చేసే కార్మికులు దొరకడం లేదు. ప్రభుత్వం పరిశ్రమ మనుగడకు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు

కర్మాగారాలు నడవకపోతే వేలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ పోషణ కష్టమవుతోందని వారు వాపోతున్నారు. లాక్‌డౌన్‌ తో 15 రోజుల నుంచి ఒక పూట మాత్రమే పరిశ్రమలు తెరుస్తున్నారు. అరకొరగానే పనులు దొరుకుతున్నాయంటున్నారు. పలాస జీడి పరిశ్రమలకు పూర్వ వైభవం తెచ్చేందుకు.. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి: సముద్రంలో వేటకు వెళ్లిన ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు

ABOUT THE AUTHOR

...view details