ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారు.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు'

By

Published : Jul 15, 2021, 10:02 PM IST

Updated : Jul 15, 2021, 10:59 PM IST

రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక... అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేయటం తప్ప మరేమీ చేయలేదని అన్నారు. ప్రజలపై పన్నుల భారాన్ని మోపి.. వారి జీవితాలను రోడ్డు పైకి లాగుతున్నారని మండిపడ్డారు. వైకాపా నేతల అవినీతిని ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

tdp leaders
తెదేపా నేతలు

వైకాపా పాలనపై పలు జిల్లాల్లో తెదేపా నేతలు విమర్శలు చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. వారి అవినీతిని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహించారు.

కృష్ణా జిల్లాలో....

విజయవాడ గవర్నరుపేట పోలీస్ స్టేషన్​లో తెదేపా కార్పొరేటర్లను ఎంపీ కేశినేని నాని పరామర్శించారు. ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే.. వారిపై వైకాపా ప్రభుత్వం పన్నులు వేస్తోందని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వస్తే పన్నులు పెంచుతుందని విపక్షాలు ముందే చెప్పాయని గుర్తు చేశారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేస్తే సామాన్యుడు బ్రతికే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కును వైకాపా ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహించారు.

ప్రకాశం జిల్లాలో...

వైకాపా నేతల అవినీతికి సహకరించలేదని ప్రకాశం జిల్లాలో ఈఈ భాస్కరరావుని సస్పెండ్ చేశారని.. ఇది దుర్మార్గమని తెదేపా శాసనసభ పక్ష విప్ డోలా బాల వీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు శ్రీధర్ మాట వినలేదనే.. కక్షసాధింపుతో చేసిన భాస్కరరావు సస్పెన్షన్ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భాస్కర్ రావు పట్ల అమర్యాదగా వ్యవహరించిన శ్రీధర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు.

నెల్లూరు జిల్లాలో...

సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి పేద ప్రజలపై భారం మోపటం తప్ప చేసింది ఏమీ లేదని తెదేపా నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి సంపత్ యాదవ్ మండిపడ్డారు. రూ.కోట్లు అప్పుల చేసి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేశారని ఆరోపించారు. ప్రతి వ్యక్తిపై రూ. రెండున్నర లక్షల అప్పుల భారం మోపారన్నారు. ఓ వైపు అన్ని వస్తువుల ధరలను పెంచుతూ.. మరోవైపు ప్రజలపై పన్నులను పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఇసుక, సిమెంట్, స్టీల్ ధరలు విపరీతంగా పెంచి, సామాన్య మానవుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

Water War: అప్పుడు రాని నీటి వివాదం.. ఇప్పుడెందుకు వచ్చింది?: చంద్రబాబు

Last Updated :Jul 15, 2021, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details