ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మినీ ట్రక్కుల కేటాయింపు... నాయకుల చుట్టూ దరఖాస్తుదారుల ప్రదక్షిణలు

By

Published : Dec 4, 2020, 7:38 PM IST

జనవరి నుంచి ఇంటింటా బియ్యం పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అందుకు అవసరమైన వాహనాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సమకూర్చుతోంది. వాటి కోసం అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు గత నెల 20 నుంచి 27వ తేదీ వరకు అవకాశం కల్పించింది. దాంతో అధిక సంఖ్యలోనే అవి రాగా లబ్ధిదారుల ఎంపికకు శుక్రవారం అన్ని మండల కార్యాలయాలు, పురపాలికలు, నగర పంచాయతీల్లో ముఖాముఖిలు నిర్వహించనున్నారు. అర్హుల జాబితాను శనివారం ఆయా సచివాలయాల్లో ప్రదర్శించనుండగా అదృష్టం ఎవరిని వరించనుందోననే ఆత్రుత నెలకొంది.

recommendations for ration trucks
ప్రభుత్వం మంజూరు చేయనున్న మినీ ట్రక్కులు

ఏఏ చౌకధరల దుకాణాల పరిధిలో రేషన్‌ కార్డుదారులు సరకులు తీసుకుంటున్నారో వాటి ఆధారంగా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా మ్యాపింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. జనవరి ఒకటో తేదీ నుంచి బియ్యంతోపాటు, ఇతర సరకులను ఇంటికే చేర్చనున్నారు. వాటి రవాణా నిమిత్తం సామాజికవర్గాల వారీగా కార్పొరేషన్ల కింద అందించేందుకు ప్రకాశం జిల్లాకు 589 మినీ ట్రక్కులను కేటాయించారు. ఒక్కో దానికి 60 శాతం రాయితీ ఇవ్వడంతోపాటు, సరకులను ఇళ్లకు చేర్చడం ద్వారా స్థానికంగానే ఉపాధి లభించనుండడంతో 4,593 మంది పోటీ పడుతున్నారు. ఎలాగైనా ట్రక్కు దక్కించుకోవాలని ఒక్కో దాని కోసం ఏడుగురికిపైగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన గ్రామ, మండల నాయకులను అయిదు రోజులుగా ప్రసన్నం చేసుకుంటున్నారు. మౌఖిక పరీక్ష ద్వారా లబ్ధిదారులను గుర్తించినా అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే వాహనాలు దక్కతాయన్న చర్చ అందరిలోనూ నడుస్తోంది. వాహన సబ్సిడీ రూ.3.48 లక్షలు ఉన్నందున అందులో కొంత మొత్తం ఇవ్వాలంటూ కొందరు గ్రామస్థాయి నాయకులు తెర చాటు రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏడాదికిపైగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీయూనిట్ల మంజూరును నిలిపివేయడం కారణంగానూ దరఖాస్తులు పెరిగాయి. మైనార్టీ క్రిస్టియన్‌ విభాగానికి సంబంధించి యూనిట్లు కేటాయించగా, అందుకు ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులు 7వ తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. లైట్‌ మోటార్‌ వెహికల్‌(ఎల్‌ఎంవీ) లైసెన్స్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలి. గత అయిదేళ్లల్లో ప్రభుత్వ పథకాల ద్వారా ఎటువంటి వాహనాలు పొంది ఉండకూడదని నిబంధన పెట్టారు.

ట్రక్కులకు సంబంధించిన వివరాలు

ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో
అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలతో శుక్రవారం తమ మండల, పురపాలిక కార్యాలయాల్లో మౌఖిక పరీక్షలకు హాజరు కావాలని సమాచారం అందించారు. ఎంపిక కమిటీలో ఎంపీడీవో/పురపాలిక కమిషనర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ అధికారులు, బ్యాంకు, రవాణా శాఖ అధికారులు ఉంటారు. వారి ఆధ్వర్యంలో తుది జాబితా తయారు కానుంది.

ABOUT THE AUTHOR

...view details