ఆంధ్రప్రదేశ్

andhra pradesh

sriharikota: సువర్ణ అధ్యాయాలను లిఖించిన శ్రీహరికోటకు.. ముప్పు పొంచి ఉందా?

By

Published : Jul 28, 2021, 12:03 PM IST

దేశ సాంకేతిక విప్లవంలో ముఖ్యభూమిక పోషిస్తున్న సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌).. కోతకు గురవుతోంది. ఎన్నో సమస్యలు పరిష్కరించిన ప్రతిష్ఠాత్మకమైన శ్రీహరికోటను.. సముద్రపు అలలు భయపెడుతున్నాయి. మరోవైపు.. పులికాట్ సరస్సుతో సైతం షార్ కు ముంపు పొంచి ఉంది. షార్​లోని చాలా భాగాలు.. అలల కారణంగా దెబ్బ తింటున్నాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. బహుళ ప్రయోజక ఓడరేవులు, సముద్ర మార్పుల వల్ల ఇలా జరుగుతుందేమో అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Ports and waves Are Eroding Sriharikota Island
శ్రీహరికోట

భారతదేశానికే తలమానికమైన రాకెట్ ప్రయోగ కేంద్రం.. నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌(శ్రీహరికోట)కు ప్రమాదం పొంచి ఉంది. ఒక దిక్కు సముద్రం, మరో దిక్కు పులికాట్‌ సరస్సుతో... నాలుగు వైపులా నీరు ఆవరించి ఉంటుంది. దేశ అంతరిక్ష చరిత్రలో ఎన్నో సువర్ణ అధ్యాయాలను లిఖించిన షార్‌ను సముద్రపు అలలు భయపెడుతున్నాయి. శ్రీహరికోటలో సముద్రానికి కిలో మీటరు దూరంలో రెండు ప్రయోగవేదికలు ఉన్నాయి. ఇక్కడి తీరం క్రమంగా కోతకు గురవుతోంది. గత పదేళ్లలో 250 నుంచి 350 మీటర్ల వరకు కోతకు గురైంది.

గతంలో షార్‌ ఆధ్వర్యాన తీరంలో నిర్మించిన పలు వంతెనలు ధ్వంసమయ్యాయి. అనంతరం ప్రత్యామ్నాయంగా కొత్తవి నిర్మించారు. ప్రస్తుతం ఇవీ ప్రమాదపు అంచునే ఉన్నాయి. నిరుడు నవంబరులో కురిసిన భారీ వర్షాలకు షార్‌ తీరంలో చందరాజకుప్పం వద్ద సముద్రం ముందుకొచ్చింది. అలలు ఎగసి పడటంతో ఉత్తర కేటీఎల్‌ ప్రాంతంలోని కోస్టల్‌ రోడ్డు కొన్ని చోట్ల దెబ్బతింది. ఆ సమయంలో తీరం సుమారు 150 మీటర్ల వరకు కోసుకుపోయింది. విషయం తెలిసిన తర్వాత నిరుడు ఇస్రో అధిపతి డాక్టర్‌ శివన్‌ సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించి వెళ్లారు. కోతకు కారణాలు, పరిష్కార మార్గాలు కనుగొనాలని చెన్నైకి చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌(ఎన్‌సీసీఆర్‌) శాస్త్రవేత్తలను షార్‌ యాజమాన్యం కోరింది. శ్రీహరికోట సమీపంలోని వాకాడు మండలం నవాబుపేట, మొనపాళెం, కొండూరుపాళెం, శ్రీనివాసపురం, వడపాళెం, మంజకుప్పం గ్రామాల్లోనూ ఇదే సమస్య నెలకొంది.

మూడు నెలలపాటు..

శాస్త్రవేత్తల బృందం మూడు నెలలుగా వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తోంది. శ్రీహరికోట ఉత్తరం వైపు తీరంలో పలుమార్లు పరిశీలించి, అక్కడ కోతకు కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మానవ కార్యకలాపాల కారణంగానూ తీరప్రాంతాలు కోతకు గురవుతున్నట్లు గుర్తించారు. దాంతోపాటు అల్పపీడన వ్యవస్థలు, సముద్ర మట్టం మార్పులు పెరిగినట్లు తెలుసుకున్నారు. తీరంలో తరంగ శక్తి ఎక్కువగా ఉండటంతోనూ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తోంది.

పెద్ద ఓడరేవుల ఏర్పాటుతోనూ సమస్య

తమిళనాడు ప్రాంతంలో సముద్ర తీరంలో వివిధ బహుళ ప్రయోజక ఓడరేవులు ఏర్పాటయ్యాయి. వాటికి ఉత్తరాన శ్రీహరికోట ఉంది. ఓడరేవుల్లో నిర్మాణ కార్యకలాపాలు, భారీ షిప్పుల రాకపోకల కారణంగా అలలపై ఒత్తిడి పెరుగుతోంది. దాని ప్రభావం శ్రీహరికోట తీరంపై కనిపిస్తోందని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

అధ్యయనం చేయిస్తున్నాం

శ్రీహరికోట వద్ద తీరం కోత గురవుతున్న మాట వాస్తవమే. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎన్‌సీసీఆర్‌ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఇంకా నివేదికలు సమర్పించలేదు. అవి వచ్చాక తీరం కోతకు గురికాకుండా ఉండేందుకు చర్యలు చేపడతాం. -శ్రీనివాసులురెడ్డి, నియంత్రణాధికారి, షార్‌

ఇదీ చూడండి:

Godavari Floods Effect: గోదావరికి వరద.. పోలవరం ముంపు మండలాల ప్రజలకు బెడద..!

ABOUT THE AUTHOR

...view details